Indian Stock Market: 5 రోజులు రూ.32 లక్షల కోట్లు
ABN , Publish Date - Apr 22 , 2025 | 02:59 AM
ఈక్విటీ మార్కెట్ ర్యాలీలో 5 రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.32 లక్షల కోట్లు పెరిగింది. రూపాయి కూడా డాలర్ మారకంలో 23 పైసలు లాభపడి 85.15 వద్ద ముగిసింది

మార్కెట్ ర్యాలీలో భారీగా పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై: ఈక్విటీ మార్కెట్ అద్భుతమైన ర్యాలీలో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఫలితంగా ఐదు వరుస ట్రేడింగ్ సెషన్లలో బీఎ్‌సఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఐదు సెషన్లలో నికరంగా రూ.32,03,295.80 కోట్లు పెరిగి రూ.4,25,85,629.02 కోట్లకు (5 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. సోమవారం సర్వత్రా నెలకొన్న సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 855.30 పాయింట్లు లాభపడి 79,408.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 273.90 పాయింట్లు లాభపడి 24,125.55 వద్ద క్లోజయింది. ఐదు వరుస ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 5,561.35 పాయింట్లు, నిఫ్టీ 1,726.40 పాయింట్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్ షేర్లలో సాగిన కొనుగోళ్ల మద్దతుతో బ్యాంక్ నిఫ్టీ సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయి 55,200 వరకు దూసుకుపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన, ట్రంప్ అస్తవ్యస్త టారిఫ్ విధానం పైన విశ్వాసం కోల్పోయిన విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్‌పై దృష్టి సారించారు. గత వారంలో ట్రేడింగ్ జరిగిన మూడు రోజుల్లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.8,472 కోట్ల విలువ గల కొనుగోళ్లు నిర్వహించారు. మార్కెట్‌పై బుల్స్ పట్టు సాధించాయని, మూడు నెలల కాలంలో జరిగిన మూడో ప్రయత్నంలో నిఫ్టీ 24,000 కన్నా పైన ముగిసిందని, బ్యాంక్ నిఫ్టీ కూడా కొత్త రికార్డు స్థాయిలో ముగిసిందని జియోజిత్ ఇన్వె్‌స్టమెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
సోమవారం నాటి ర్యాలీ అన్ని రంగాలకు విస్తరించింది. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సూచీ 2.20%, స్మాల్‌క్యాప్ సూచీ 1.67% లాభపడ్డాయి. బీఎ్‌సఈలోని రంగాల వారీ సూచీలన్నీ కూడా 2% పైబడి లాభపడ్డాయి.
గత వారంలో ఆర్థిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేరు బీఎస్ఈలో 2.13% లాభపడి రూ.1,450.45 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.12,563.63 కోట్ల మేరకు పెరిగి రూ.6,02,410.10 కోట్ల వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో 2.15% మేరకు లాభపడి 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.1,437ని తాకినప్పటికీ చివరికి 0.20% లాభంతో రూ.1,409.40 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 1.10% లాభంతో రూ.1,927.55 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు 2.27% లాభంతో 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.1,950ని తాకింది.
బీఓబీలో వాటా పెంచుకున్న ఎల్‌ఐసీ
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లో వాటాను 2% మేరకు పెంచుకోవడంతో ప్రస్తుతం అది 7.05 శాతానికి చేరింది. గత ఏడాదిన్నర కాలంలో బీఓబీకి చెందిన 10.45 కోట్ల షేర్లను కొనుగోలు చేసినట్టు ఎల్‌ఐసీ తెలిపింది.
రూపాయిదీ అదే ర్యాలీ
ఈక్విటీ మార్కెట్ తరహాలోనే ఫారెక్స్ మార్కెట్లో కూడా డాలర్ మారకంలో రూపాయి అద్భుతమైన ర్యాలీని సాధించింది. ఐదో రోజు కూడా ర్యాలీని కొనసాగించిన రూపాయి డాలర్ విలువతో పోల్చితే 23 పైసలు లాభపడి 85.15 వద్ద ముగిసింది. డాలర్ ఇండెక్స్ బలహీనపడి మూడు సంవత్సరాల కనిష్ఠ స్థాయి 99ని బ్రేక్ చేయడం ఇందుకు దోహదపడిందని ఫారెక్స్ విశ్లేషకులంటున్నారు. ఈ నెల 9వ తేదీన 86.68 వద్ద ముగిసిన రూపాయి ఆ తర్వాత 5 వరుస ట్రేడింగ్ సెషన్ల ర్యాలీలో 155 పైసలు బలపడింది. డాలర్ బలహీనపడిన కారణంగా సమీప భవిష్యత్తులో రూపాయి 84.80-8535 మధ్యన ట్రేడ్ కావచ్చని విశ్లేషకులంటున్నారు.