Tariffs Plus Penalty On India: భారత్‌పై 25 శాతం సుంకాలు, ఇంకా జరిమానా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Jul 30 , 2025 | 06:08 PM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ మీద సుంకాల బాంబు పేల్చారు. భారతదేశంపై 25 శాతం సుంకాలు ఇంకా జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 1 నుండి, అంటే శనివారం నుండి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు.

ఇంటర్నెట్ డెస్క్, జులై 30: గడియ గడియకో సంచలన ప్రకటన చేసే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత్ మీద మరో సుంకాల బాంబు పేల్చారు. భారతదేశంపై 25 శాతం సుంకాలు ఇంకా జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 1 నుండి, అంటే శనివారం నుండి భారతదేశం.. అమెరికాకు 25 శాతం సుంకాలను చెల్లిస్తుందని డొనాల్డ్ ట్రంప్ తన స్వంత సోషల్ మీడియా నెట్‌వర్క్ ట్రూత్‌లో తెలిపారు.
'గుర్తుంచుకోండి.. భారతదేశం మనకు మిత్రదేశంగా ఉన్నప్పటికీ, మేము వారితో చాలా తక్కువ వ్యాపారం చేశాము.. ఎందుకంటే వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. అంతేకాదు, వారు ఏ దేశంలోనూ లేనంత అత్యంత కఠినమైన, అసహ్యకరమైన ద్రవ్యేతర వాణిజ్య విధానాల్ని కలిగి ఉన్నారు. అలాగే, వారు ఎల్లప్పుడూ తమ సైనిక సామాగ్రిలో ఎక్కువ భాగాన్ని రష్యా నుండి కొనుగోలు చేశారు. ఉక్రెయిన్‌లో హత్యలను రష్యా ఆపాలని అందరూ కోరుకుంటున్న సమయంలో భారత్, చైనా దేశాలు రష్యా యొక్క అతిపెద్ద చమురు కొనుగోలుదారులుగా ఉన్నాయి. ఇది మంచిది కాదు. అందువల్లే.. భారతదేశం ఆగస్టు నుండి మొదట 25 శాతం సుంకం, దీనికి అదనంగా జరిమానా కూడా చెల్లిస్తుంది. థ్యాంక్స్.. అమెరికాను మళ్లీ గొప్పగా చేయండి (MAGA Make America Great Again) ' అంటూ రాసుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.