BSNL Yatra Offer: అమర్‌నాథ్ యాత్రికుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ యాత్ర సిమ్ కార్డ్ సేవలు..
ABN , Publish Date - Jul 05 , 2025 | 08:52 PM
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఓ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ యాత్రను మరింత సులభతరం చేయడానికి, వినియోగదారులకు BSNL ప్రత్యేకమైన యాత్ర సిమ్ కార్డుని (BSNL Yatra Offer) అందుబాటులోకి తెచ్చింది. దీని స్పెషల్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అమర్‌నాథ్ యాత్ర కోసం ప్రయాణిస్తున్న భక్తులకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కీలక ప్రకటన చేసింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో BSNL కాకుండా ఇతర టెలికాం సేవలు పనిచేయవు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వ సంస్థ యాత్ర సిమ్‌ను (BSNL Yatra Offer) ప్రవేశపెట్టింది. ఆ ప్రాంతంలో ఇతర్ నెట్ వర్క్ సేవలు ఉండవు కాబట్టి.. ఈ సిమ్ కార్డ్ తీసుకున్నవారు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు సహాయపడుతుంది. అది కూడా తక్కువ ఖర్చుతో అందించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
అమర్‌నాథ్ యాత్ర సిమ్ ఆఫర్ వివరాలు
ఈ బీఎస్‌ఎన్‌ఎల్ యాత్ర సిమ్ కేవలం 196 రూపాయల ధరతో 15 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో భక్తులకు కింది సౌకర్యాలు లభిస్తాయి.
4G కనెక్టివిటీ: వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు
అపరిమిత కాల్స్: దేశవ్యాప్తంగా ఎక్కడికైనా అపరిమిత ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు
అపరిమిత డేటా: 15 రోజుల పాటు డేటా వినియోగంపై ఎలాంటి పరిమితి లేదు
ఈ ఆఫర్ యాత్ర సమయంలో భక్తులకు నిరంతర కమ్యూనికేషన్‌ను సులభతరం చేస్తుంది. ప్రధానంగా జమ్మూ కశ్మీర్‌లోని రిమోట్ ప్రాంతాల్లో ఈ సేవలు భక్తులకు సౌకర్యంగా ఉపయోగపడనున్నాయి.
సిమ్ ఎక్కడ కొనుగోలు చేయాలి
అమర్‌నాథ్ యాత్ర మార్గంలో బీఎస్‌ఎన్‌ఎల్ యాత్ర సిమ్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ సిమ్ కార్డ్‌లు లఖన్‌పూర్, పహల్గామ్, బల్తాల్, చంద్రకోట్, భగవతి నగర్ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ప్రదేశాలు యాత్ర మార్గంలోని ముఖ్యమైన చెక్ పాయింట్లుగా ఉన్నాయి. ఇక్కడ యాత్రికులు తమ యాత్రను ప్రారంభించే ముందు లేదా విశ్రాంతి తీసుకునే సమయంలో సిమ్‌ను తీసుకోవచ్చు.
సిమ్ కొనుగోలుకు ఏం కావాలి
యాత్ర సిమ్‌ను యాక్టివేట్ చేయడానికి యాత్రికులు కింది డాక్యుమెంట్లతో KYC నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయాలి
ఆధార్ కార్డ్ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డ్: గుర్తింపు ధృవీకరణ కోసం
అమర్‌నాథ్ యాత్ర స్లిప్: యాత్రికులుగా ధృవీకరణ కోసం
కేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే, బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ కనెక్టివిటీతో సిమ్‌ను యాక్టివేట్ చేస్తుంది
బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే ఎందుకు
అమర్‌నాథ్ యాత్ర ప్రాంతం భద్రతా కారణాల వల్ల సున్నితమైన ప్రదేశంగా ఉంది. దీంతో ఈ మార్గంలో టెలికాం టవర్లను స్థాపించడానికి కేవలం బీఎస్‌ఎన్‌ఎల్‌కు మాత్రమే అనుమతి ఉంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల కవరేజ్ లేదు. దీంతో ఈ ప్రాంతంలో ఇతర టెలికాం ఆపరేటర్ల సేవలు అందుబాటులో ఉండవు. కేవలం BSNL మాత్రమే పనిచేస్తుంది.
జమ్మూ కశ్మీర్‌లో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకున్న ప్రీపెయిడ్ సిమ్‌లు కూడా పనిచేయవు. కాబట్టి ఈ యాత్రలో టెలికాం సేవలు కావాలంటే బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవాల్సిందే. ఈ సిమ్ ద్వారా అత్యవసర సమయంలో సహాయం పొందవచ్చు. వారి యాత్ర అనుభవాలను కూడా సోషల్ మీడియాలో వెంటనే షేర్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి