Apollo Hospitals: నాలుగేళ్లలో రూ.8,000 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - May 31 , 2025 | 03:40 AM
అపోలో హాస్పిటల్స్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 8,000 కోట్ల పెట్టుబడులతో 4,300 కొత్త పడకలను ఏర్పాటు చేయాలని ప్రకటించింది. క్యూ4 లో రూ.390 కోట్లు నికర లాభం నమోదు చేసిన ఈ సంస్థ, ఏడాది మొత్తానికి రూ.1,446 కోట్ల లాభాన్ని సాధించింది.

క్యూ4 లాభం రూ.390 కోట్లు
ఒక్కో షేరుకు రూ.10 తుది డివిడెండ్
అపోలో హాస్పిటల్స్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్.. వచ్చే మూడు నుంచి నాలుగేళ్ల కాలంలో రూ.8,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడులతో దేశవ్యాప్తంగా కొత్తగా 4,300 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. కొత్త హాస్పిటల్స్ ఏర్పాటు సహా ప్రస్తుత హాస్పిటల్స్ విస్తరణ ద్వారా ఈ అదనపు పడకలను చేర్చుకోనున్నట్లు అపోలో హాస్పిటల్స్ పేర్కొంది. ఇప్పటికే తొలి దశలో 2,000 పడకల ఏర్పాటుకు సంబంధించిన పనులు సాగుతున్నాయని పేర్కొంది. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ హాస్పిటల్స్ విస్తరణ ద్వారా 160 పడకలు చేర్చుకోవటంతో పాటు గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న హాస్పిటల్‌తో హైదరాబాద్‌లో మొత్తం పడకల సంఖ్య 1,400కు చేరుకోనుందని తెలిపింది. అలాగే బెంగళూరులో 200 పడకల సామర్థ్యం గల హాస్పిటల్ కొనుగోలుతో పాటు కొత్త హాస్పిటల్ ఏర్పాటుతో మొత్తం పడకల సంఖ్య 1,500కు చేరుకోనుందని పేర్కొంది. మరోవైపు పుణె, కోల్‌కతా, ఢిల్లీ ఎన్సీఆర్లో నెలకొల్పుతున్న హాస్పిటల్స్ కూడా ఈ ఏడాది అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.
క్యూ4 ఆదాయం రూ.5,592 కోట్లు: మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో అపోలో హాస్పిటల్స్ రూ.5,592 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.390 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.254 కోట్లు)తో పోల్చితే లాభం 54 శాతం వృద్ధి చెందగా ఆదాయం (రూ.4,944 కోట్లు) 13 శాతం పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.21,794 కోట్ల ఆదాయంపై రూ.1,446 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.10 తుది డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.