Pulivendula: పులివెందులలో వైసీపీ పోలీసులు
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:16 AM
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. ప్రభుత్వం వచ్చి ఏడాది దాటింది. అయితే, పులివెందుల పోలీసులు మాత్రం ఇంకా జగన్ ప్రభుత్వమే ఉందన్న భ్రమలో ఉన్నట్టు కనిపిస్తోంది.

సర్కారు మారినా తీరుమారని వైనం
జగన్ సన్నిహితుడి వ్యాపారంలో బెంగళూరు వాసులకు బెదిరింపులు
సంబంధం లేని కేసులో సెటిల్‌మెంట్?
ఓ అధికారి ఇంట్లో నడిచిన వ్యవహారం
అర్బన్ స్టేషన్‌లో కేసు.. రూరల్ సీఐ జోక్యం
నోటీసులు ఇచ్చినట్టు ఒప్పుకొన్న సీఐ రమణ
కడప, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. ప్రభుత్వం వచ్చి ఏడాది దాటింది. అయితే, పులివెందుల పోలీసులు మాత్రం ఇంకా జగన్ ప్రభుత్వమే ఉందన్న భ్రమలో ఉన్నట్టు కనిపిస్తోంది. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. అయితే, ప్రభుత్వం మారినా పులివెందుల పోలీసులు ఇప్పటికీ వైసీపీకి సానుకూలంగానే, వారి చెప్పుచేతల్లోనే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధం లేని సివిల్ కేసుల్లో జోక్యం చేసుకుని వైసీపీ నేతలకు మేలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అసలు పులివెందులకే కాదు, రాష్ట్రానికి కూడా సంబంధం లేని కేసును డీల్ చేసి ‘సెటిల్‌మెంట్’ చేయడం వివాదాస్పదంగా మారింది.
సంబంధం లేని వ్యవహారం!
వాస్తవానికి ఈ వ్యవహారం బెంగళూరుకు సంబంధించింది. దుష్యంత్‌రెడ్డి లావాదేవీలు హైదరాబాద్ కేంద్రంగా ఉంటాయి. అలాంటప్పుడు.. పులివెందులకు సంబంధం లేని విషయంపై సెటిల్‌మెంట్లు చేయడం ఏంటనేది ప్రశ్న. ఇక, పులివెందుల అర్బన్ పోలీస్టేషన్లో ఈ నెల 5న బెంగళూరుకు చెందిన లలిత్‌జైన్, సుధాకర్ రాజేచర్, జయతీర్థం రాజేచర్, నిర్మల బంటియా, ఎండీ రామానుజన్‌లపై కేసు నమోదైంది. అసలు సంబంధం లేని కేసును వైసీపీ నేతల మెప్పు కోసం పులివెందుల పోలీసులు.. బెదిరించి మరీ సెటిల్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అర్బన్ స్టేషన్‌లో కేసు నమోదైతే రూరల్ సీఐ విచారించడంపైనా విమర్శలు వస్తున్నాయి.
సీఐ వివరణ ఇదీ
ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ పులివెందుల రూ రల్ సీఐ రమణతో మాట్లాడగా.. ఇరువురినీ పిలిపించి మాట్లాడాలని ప్రయత్నిస్తే మేమే మధ్యవర్తుల ద్వారా సెటిల్ చేసుకుంటామని అంగీకరించారని తెలిపారు. బెంగళూరు వాసులు న్యాయవాదులతో వచ్చారని, 41ఏ నోటీసు ఇచ్చి పంపించామని చెప్పారు. దీనిని బట్టి వ్యవహారం జరిగిందనేది వాస్తవమని తేలింది.
విషయం ఏంటంటే
చవ్వా దుష్యంత్‌రెడ్డి.. వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో కమలాపురం నియెజకవర్గం వైసీపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. దుష్యంత్‌కు పలు కాంట్రాక్టు సంస్థలున్నాయి. ఈయన కంపెనీలన్నీ హైదరాబాదులో ఉంటాయి. దుష్యంత్‌రెడ్డి తండ్రి చవ్వా విజయశేఖర్‌రెడ్డి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇటీవల ఆయన మరణించారు. ఆయనకు బెంగళూరులోని కొందరు బకాయి ఉన్నారు. ఈ బకాయిలపై దుష్యంత్‌రెడ్డి పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన బెంగుళూరుకు వెళ్లి లలిత్‌జైన్, సుధాకర్ రాజేచర్, జయతీర్ధం రాజేచర్, నిర్మల్ బంటియా, ఎండీ రామానుజన్‌లను తీసుకువచ్చి రెండు రోజులు ఇక్కడ ఉంచారు. అంతేకాదు, వారిని బెదిరించి రూ.10 కోట్లు సెటిల్‌మెంటు చేశారని సమాచారం.