YSRCP Violence: వైసీపీ మూక వీరంగం
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:11 AM
అధికారం కోల్పోయినా వైసీపీ మార్క్ దాడుల సంస్కృతి ఆగలేదు.

‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై దాడి
జగన్ చిత్తూరు పర్యటనలో ఘటన
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైగ చేయడంతో రెచ్చిపోయిన మూక
బంగారుపాళ్యం, జూలై 9(ఆంధ్రజ్యోతి): అధికారం కోల్పోయినా వైసీపీ మార్క్ దాడుల సంస్కృతి ఆగలేదు. వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఆ పార్టీ మూకలు రెచ్చిపోయాయి. విధి నిర్వహణలో ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ చిత్తూరు స్టాఫ్ ఫొటోగ్రాఫర్ శివకుమార్‌పై పలువురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. జగన్ చిత్తూరు జిల్లా పర్యటన కవరేజీకి వెళ్లిన శివకుమార్ ఫొటోలు తీస్తుండగా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆ ఫొటోగ్రాఫర్ మనోడు కాదని సైగ చేయడంతో వైసీపీ గూండాలు రెచ్చిపోయారు. శివకుమార్‌ను చుట్టుముట్టి తల, ఛాతీపై పిడిగుద్దులు కురిపించారు. ఆయన కెమెరా లాక్కుని, అందులోని మెమొరీ కార్డును తీసేసుకున్నారు. చిత్తూరు అసెంబ్లీ వైసీపీ ఇన్‌చార్జి విజయానందరెడ్డి సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఆయన కూడా దాడిని నిలువరించలేదు. బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటించారు. బంగారుపాళ్యం మార్కెట్‌యార్డులోని 22వ నంబరు మండీలో రైతులతో మాట్లాడేందుకు జగన్, వైసీపీ నాయకులు వెళ్లారు. వారితో పాటు శివకుమార్ వెళ్లి ఫొటోలు తీస్తున్నారు. అక్కడ ఉన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైగ చేయడంతో వైసీపీ మూక శివకుమార్‌పై దాడి చేసింది. పిడిగుద్దులు కురిపించడంతో ఊపిరాడని స్థితిలో ఆయన ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఆయనకు పాత్రికేయులు మంచినీళ్లు ఇచ్చి సేదదీర్చి.. బంగారుపాళ్యం ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేశాక, మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శివకుమార్‌పై దాడిని టీడీపీ నేతలు, పాత్రికేయులు ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ బంగారుపాళ్యం ఆస్పత్రికి వెళ్లి శివకుమార్‌ను పరామర్శించారు. చిత్తూరు గాంధీ సర్కిల్ ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్‌ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. దాడి ఘటనపై బంగారుపాళ్యం పోలీసులకు ఫొటోగ్రాఫర్ శివకుమార్ ఫిర్యాదు చేశారు. దాడి చేసినవారిలో పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అనుచరుడు ప్రకాశ్ ఆచారి ఉన్నట్టు ప్రాఽథమికంగా గుర్తించారు. కాగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నికల ముందు అనంతపురం జిల్లాలో ఆయన సభలో వైసీపీ మూక ఇలాగే రెచ్చిపోయింది. ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.