Share News

Governor Abdul Nazir: కలల నుంచే మంచి ఆలోచనలు

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:31 AM

యువత చేతిలోనే దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.

Governor Abdul Nazir: కలల నుంచే మంచి ఆలోచనలు

  • దేశ భవిష్యత్‌ యువత చేతిలోనే

  • ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో మచిలీపట్నం

  • బెల్‌లో తయారైన డ్రోన్ల వినియోగం

  • స్నాతకోత్సవంలో గవర్నర్‌ నజీర్‌ వెల్లడి

  • అన్ని సమస్యలకు విద్యతో పరిష్కారం: లోకేశ్‌

మచిలీపట్నం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): యువత చేతిలోనే దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. యువత కలలు కనాలని.. కలల నుంచే మంచి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయని చెప్పారు. కృష్ణా విశ్వవిద్యాలయం 6, 7, 8 స్నాతకోత్సవ కార్యక్రమం యూనివర్సిటీలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో బుధవారం జరిగింది. ఇందులో గవర్నర్‌తో పాటు విద్యామంత్రి లోకేశ్‌ కూడా పాల్గొన్నారు. ‘మనస్సులో భయం లేకుండా, తలెత్తుకుని ఉండేచోట, జ్ఞానం స్వేచ్ఛగా ఉండే చోట, ప్రపంచం ఇరుకైన ఇంటి గోడల ద్వారా ముక్కలుగా విభజితం కాని చోట, పదాలు సత్యపులోతు నుంచి వెలువడేచోట ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగ వచ్చు’ అని విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చెప్పిన మాటలను గవర్నర్‌ తన ప్రసంగంలో గుర్తు చేశారు.


యువత నైతిక విలువలను అలవరచుకుని, సాంకేతికపరంగా జరుగుతున్న మార్పులను అవలోకనం చేసుకుని ముందుకు సాగాలన్నారు. కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో కృష్ణా యూనివర్సిటీ భారత్‌ ఎలక్ర్టానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)తో ఒప్పందం కుదుర్చుకుందని, ఇది శుభ పరిణామమని తెలిపారు. ఇటీవల ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఆకాశ్‌తీర్‌’ రక్షణ వ్యవస్థ ద్వారా మచిలీపట్నం బెల్‌ కంపెనీలో తయారైన డ్రోన్లు శత్రుదేశం క్షిపణుల దాడులను సమర్థంగా తిప్పికొట్టాయని చెప్పారు. మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో ఇది కీలక పరిణామన్నారు సమాజంలో అన్ని సమస్యలకు విద్య పరిష్కారం చూపుతుందని లోకేశ్‌ ఈ సందర్భంగా చెప్పారు. ప్రపంచాన్ని మార్చగల సామర్ధ్యం, సత్తా యువతకు ఉన్నాయని.. పట్టాలు అందుకున్న విద్యార్థులు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు.


యువత ఉపగ్రహాలను తయారు చేయాలని, నూతన సాఫ్ట్‌వేర్లను అభివృద్ధి చేయాలని, హరిత భవనాలను రూపొందించాలని, స్టార్ట్‌పలను ప్రారంభించాలని పిలుపిచ్చారు. ఎన్‌ఎ్‌సఎల్‌ గ్రూప్‌ చైర్మన్‌ మండవ ప్రభాకరరావు, అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ట్రాన్షేషన్‌ మెడిసిన్‌ విభాగం ప్రొఫెసర్‌ ఎంఎన్‌వీ రవికుమార్‌, గ్రీన్‌కోసంస్థ సీఈవో చలమలశెట్టి అనిల్‌కుమార్‌లకు డాక్టరేట్లను ప్రదానం చేశారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 21 మందికి బంగారుపతాకాలు, 62 మందికి పీహెచ్‌డీలు, ఇద్దరికి ఎంఫిల్‌ పట్టాలు, 300 మంది పీజీ విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సుభాష్‌, కొల్లు రవీంద్ర, ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీతో పాటు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ మధుమూర్తి, కృష్ణాయూనివర్సిటీ వీసీ కూన రామ్‌జీ, రిజిస్ర్ట్రార్‌ ఎన్‌.ఉష, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత యూనివర్సిటీలోని ఫుడ్‌కోర్టు భవనాన్ని గవర్నర్‌... లోకేశ్‌తో కలిసి ప్రారంబించారు.

Updated Date - Jun 26 , 2025 | 05:31 AM