Share News

Land Grabbing: రామచంద్రా.. ఏమిటీ అరాచకం?

ABN , Publish Date - Mar 17 , 2025 | 03:21 AM

తిరుపతిలోని మారుతీనగర్‌లో పెద్దిరెడ్డి నివాసానికి ఆనుకుని ఉత్తరం, తూర్పు, వాయవ్య దిశల్లో బుగ్గ మఠానికి భూములున్నాయి.

Land Grabbing: రామచంద్రా.. ఏమిటీ అరాచకం?

  • పెద్దిరెడ్డి ఆక్రమణలో రూ.100 కోట్ల బుగ్గ మఠం భూములు

  • తిరుపతిలో ఇంటి పక్కనే 3.88 ఎకరాలు స్వాహా.. అందులోనే కార్యాలయం,

  • వాహనాల పార్కింగ్‌.. భూములకు కంచె.. దర్జాగా మధ్యలో సీసీ రోడ్డు

  • సర్వే కూడా చేయలేని స్థితిలో అధికారులు.. అధికారం పోయినా పవర్‌ తగ్గని పెద్దిరెడ్డి

వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘భూదాహం’ అంతా ఇంతా కాదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. గత జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లూ సొంత నియోజకవర్గం పుంగనూరులోనే కాదు, తిరుపతిలోనూ ఆయన హవా జోరుగా సాగింది. తిరుపతిలో తన నివాసం పక్కనే ఉన్న బుగ్గ మఠానికి చెందిన భూములను గతంలో ఆయన ఆక్రమించారు. వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములు ఇప్పటికీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. అధికారం పోయినా కూడా ఆయన నీడ తాకడానికి కూడా అధికారులు భయపడుతున్నారు. కనీసం సర్వే చేసేందుకు కూడా ధైర్యం చేయడం లేదు.

(తిరుపతి-ఆంధ్రజ్యోతి)

తిరుపతిలోని మారుతీనగర్‌లో పెద్దిరెడ్డి నివాసానికి ఆనుకుని ఉత్తరం, తూర్పు, వాయవ్య దిశల్లో బుగ్గ మఠానికి భూములున్నాయి. అందులో పెద్దిరెడ్డి నివాసానికి ఉత్తరం, తూర్పు దిశల్లో 3.88 ఎకరాల మఠం భూములకు ఆయన కంచె వేసుకున్నారు. ఆ భూమిలో కార్యాలయ భవనం నిర్మించుకున్నారు. వాహనాల పార్కింగ్‌కు కొంత స్థలం వాడుతున్నారు. ఆక్రమించిన భూమిలో సుమారు మూడెకరాల భూమిని రెండు భాగాలుగా విభజించి మధ్యలో రోడ్డు వేసుకున్నారు. ఆ రోడ్డు రాయల్‌ నగర్‌ రోడ్డులో కలుస్తుంది. రెండు భాగాలుగా విభజించిన భూమిలో ఓవైపు గడ్డి పెంచుతుండగా, మరోవైపు గోశాల తరహాలో ఆవులు, మేకలు వంటి వాటి పోషణకు వినియోగిస్తున్నారు. ఆ భూమిలో బోరు కూడా ఉంది. ఆయన ఆక్రమణలో ఉన్న 3.88 ఎకరాల్లో.. సర్వే నంబరు 261-1లో 1.50 ఎకరాలు, సర్వే నంబరు 261-2లో 2.38 ఎకరాలు ఉన్నాయి. తిరుపతి నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న ఈ భూముల కనీస విలువ రూ.వంద కోట్లు.


సర్వేకు అనుమతించని అనుచరులు

బుగ్గ మఠం అధికారులు పెద్దిరెడ్డి ఆక్రమించిన భూములను సర్వే చేయించడానికి గతంలో ప్రయత్నం చేసి విఫలమయ్యారు. 2010లో దేవదాయ శాఖ తిరుపతి ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ నుంచీ సర్వేయర్‌ను వెంటబెట్టుకుని మఠం అధికారులు వెళ్లగా... పెద్దిరెడ్డి అనుచరులు ఆ భూముల్లోకి అడుగు పెట్టనివ్వలేదని సమాచారం. 2017లోనూ, అలాగే 2018లోనూ కూడా ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ సర్వేయర్‌తో వెళ్లినా అదే పరిస్థితి ఎదురైందని మఠం వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వం మారినా అదే పరిస్థితి

2019-2024 నడుమ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా కొనసాగడంతో అప్పట్లో మఠం అధికారులు కబ్జాలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోలేకపోయారు. కనీసం ఆ భూముల్లో అడుగు పెట్టడానికి కూడా సాహసించలేకపోయారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూడా అవే పరిస్థితులు కొనసాగుతుండడమే విచిత్రం. వాస్తవానికి గతేడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక జూలై 29న మఠం భూములు సర్వే చేసి, హద్దులు నిర్ణయించాలని కోరుతూ తిరుపతి అర్బన్‌ తహశీల్దారుకు మఠం అధికారులు లేఖ రాశారు. అయితే అర్బన్‌ తహశీల్దారు స్పందించలేదు. తాజాగా గత నెలలో మరోసారి అర్బన్‌ తహశీల్దారుకు లేఖ రాసినా ఇప్పటి వరకూ సర్వే జరగలేదు. మఠం భూములు సర్వే చేసి హద్దులు నిర్ణయించాలంటే అనివార్యంగా పెద్దిరెడ్డి ఇంటి ఆవరణ సహా ఆయన కంచె వేసి ఆక్రమించుకున్న మఠం భూముల్లో అడుగు పెట్టాల్సి ఉంటుంది. అందుకు ఎవరూ సాహసించడం లేదు. తమను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి భవిష్యత్తులో ఇబ్బందులకు గురి చేస్తారన్న భయం కిందిస్థాయి అధికారుల్లో, ఉద్యోగుల్లో బలంగా ఉంది. రాష్ట్రస్థాయి అధికారులు స్పందించి జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తే తప్ప కనీసం సర్వే కూడా జరిగే సూచనలు కనిపించడం లేదు.


ఆక్రమణలకు గురైన భూములివే..

తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెలో 14.49 ఎకరాలు, వేశాలమ్మ గుడి వీధిలో 3.53 ఎకరాలు, మారుతీనగర్‌ చర్చి సమీపంలో ఒకచోట 1.08 ఎకరాలు, మరో చోట 2.38 ఎకరాలు, మల్లంగుంటలో 47 సెంట్లు, గోవిందరాజస్వామి దక్షిణ మాడ వీధిలో 47 సెంట్లు మఠానికి చెందిన భూములున్నాయి. ముత్యాలరెడ్డిపల్లెలో 14.49 ఎకరాలూ కౌలుదార్లుగా చెప్పుకొంటున్న కొందరు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. వేశాలమ్మ గుడి వీధిలోని 3.53 ఎకరాలను స్థానికులు ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకునేశారు. సంబంధిత భూముల్లో 126 ఇళ్లు ఉన్నాయి. గోవిందరాజస్వామి గుడి దక్షిణ మాడవీధిలోని 47 సెంట్లు కూడా ఆక్రమణకు గురై ఇళ్లు కట్టుకునేశారు. మిగిలిన భూములు సైతం కౌలుదార్లుగా చెప్పుకొంటున్న వ్యక్తుల స్వాధీనంలో ఉన్నాయి. ఇక మారుతీనగర్‌లో 3.88 ఎకరాలను పెద్దిరెడ్డి ఆక్రమించారు. అవిలాల రోడ్డు విస్తరణలో అక్కడున్న 7 సెంట్ల భూమి పోయింది. దశాబ్దాలుగా బుగ్గ మఠం భూములు ఆక్రమణల పాలయ్యాయి. మిగిలిన కాస్తో కూస్తో కూడా దక్కించుకునే స్థితిలో మఠం లేదు.


ఏమిటీ బుగ్గ మఠం..?

తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయ పరిసరాల్లో ఏర్పడిన రెండు సహజ నీటి బుగ్గలు గతంలో ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి అవసరాలు తీర్చేవి. వాటి నిర్వహణకు ఏర్పాటైన బుగ్గ మఠానికి చంద్రగిరి రాజులు భూములు దానమిచ్చారు. వాటిపై వచ్చే ఆదాయంతో భక్తులకు బస, భోజన సదుపాయాలను మఠం కల్పించేది. ప్రారంభంలో మఠాధిపతులు ఉన్నప్పటికీ కొన్ని దశాబ్దాల కిందటే ఆ పరంపర ఆగిపోయింది. ఆ స్థానంలో మహంతులు వచ్చారు. వారి హయాంలో భూములను కౌలుకు ఇచ్చారు. 1969లో బుగ్గమఠం ప్రభుత్వ దేవదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటికి మఠానికి గోవిందరాజస్వామి ఆలయంలో, వెలుపల నీటి బుగ్గలు, ఆలయంలో లక్ష్మీమండపం ఉండేవి. మఠంలో రామాలయం, కల్యాణ మండపం, మండపానికి అనుబంధంగా గదులు ఉండేవి. కార్యాలయ భవన సముదాయంలో 14 షాపింగ్‌ గదులుండేవి. ఇవి కాకుండా 123.43 ఎకరాల భూములుండేవి. అయితే మఠం ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాక 1969-1991 నడుమ 100.94 ఎకరాల భూములను విక్రయించారు. అవి పోనూ 22.49 ఎకరాల భూములు మఠం ఆధీనంలో ఉండాలి. అయితే ఈ మొత్తం భూములు ప్రస్తుతం ఇతరుల ఆక్రమణలో ఉన్నాయి.

Untitled-5 copy.jpg

ఆలయాలూ ఆక్రమించేశారు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉన్న ముత్యాలరెడ్డిపల్లె మారుతీనగర్‌లో ఉన్న బుగ్గమఠం భూముల్లోని 60 సెంట్ల స్థలంలో శివాలయం, మునీశ్వరాలయం, అక్కగార్ల గుడి, గుర్రప్ప స్వామి గుడి ఉన్నాయి. ఆలయాలతో సహా ఆ భూమంతా ఆక్రమణదారుల చేతుల్లోనే ఉన్నాయి. 2008 జనవరి ఒకటిన అప్పటి ఈవో ఈశ్వరయ్య మారుతీనగర్‌లోని శివాలయం సహా ఇతర ఆలయాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అటెండర్‌ను, వాచ్‌మన్‌ను నియమించారు. భక్తులకు అర్చన తదితర పూజల కోసం టికెట్లు కూడా జారీ చేయించి ఆదాయం పెంచారు. ఇలా 11 నెలల పాటు 60 సెంట్ల స్థలం, అందులోని ఆలయాలూ మఠం నియంత్రణలో నడిచాయి. అంతే.. ఆయన బదిలీ అయిపోయారు. ఇవన్నీ తిరిగి ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పటికీ మఠం నియంత్రణలో లేవు. ఆలయాల బోర్డుల్లో కూడా అవి మఠానివని పేర్కొనడం లేదు.

Untitled-5 copy.jpg


హైకోర్టు ఉత్తర్వులు రాగానే స్వాధీనం

తిరుపతి మారుతీనగర్‌లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంచె వేసి ఆక్రమించుకున్న మఠం భూమికి సంబంధించి.. సర్వే నంబరు 261-1లోని 1.50 ఎకరా భూమి విషయంలో హైకోర్టు రెండు వారాలు గడువు ఇచ్చింది. అందువల్ల ప్రస్తుతానికి దానిని మినహాయించి సర్వే నంబరు 261-2లోని 2.38 ఎకరాల భూమిపై దృష్టి పెడుతున్నాం. ఆ భూమి తనదని మాజీ మంత్రి హైకోర్టులో ఎలాంటి ఆధారాలూ చూపలేకపోయారు. దీంతో మొదట ఆ భూమిని స్వాధీనం చేసుకోవాల్సివుంది. హైకోర్టు ఉత్తర్వుల కాపీ కోసం దరఖాస్తు చేస్తున్నాం. అందగానే భూమి స్వాధీనానికి చర్యలు తీసుకుంటాం.

- బుగ్గ మఠం ఈవో వెంకటేశ్వర్లు

సర్వే చేయిస్తాం

బుగ్గ మఠం అధికారులు సర్వే కోరుతూ జూలైలో లేఖ రాసిన సంగతి నాకు తెలియదు. అప్పటికి నేను తిరుపతి అర్బన్‌లో బాధ్యతలు చేపట్టలేదు. మూడు రోజుల కిందట మాత్రం సర్వే కోసం లేఖ వచ్చినట్టు ఉంది. పరిశీలించి త్వరగా సర్వే చేయించి మఠం భూములకు హద్దులు చూపిస్తాం.

- తిరుపతి అర్బన్‌ తహశీల్దారు భాగ్యలక్ష్మి

గుడిలోకి ఇంటి నుంచి గేటు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ఆవరణ ఆనుకునే బుగ్గ మఠానికి చెందిన భూములు, అందులో ఆలయాలు ఉన్నాయి. గుడి ఆవరణలోకి వెళ్లేందుకు తన ఇంటి నుంచే ప్రత్యేకంగా ఒక గేటును ఆయన ఏర్పాటు చేసుకున్నారు.

Untitled-5 copy.jpg

Updated Date - Mar 17 , 2025 | 07:25 AM