Share News

YS Jagan Support: రౌడీషీటర్లకు మద్దతా

ABN , Publish Date - Jun 03 , 2025 | 06:06 AM

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తెనాలిలో రౌడీషీటర్ల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తుండగా, కానిస్టేబుల్‌పై దాడి సంఘటనపై విస్తృత చర్చ నడుస్తోంది. బాధిత కానిస్టేబుల్ భార్య కూడా తన అసమర్థతను వ్యక్తం చేస్తూ ఈ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు.

YS Jagan Support: రౌడీషీటర్లకు మద్దతా
YS Jagan

  • వైసీపీ అధ్యక్షుడి వైఖరిపై విస్మయం.. నేడు తెనాలికి వస్తున్న జగన్‌

  • కానిస్టేబుల్‌పై ఇటీవల రౌడీషీటర్ల దాడి

  • బహిరంగంగా ‘ట్రీట్మెంట్‌’ ఇచ్చిన పోలీసులు

  • అదే రౌడీ షీటర్లకు మద్దతుగా జగన్‌

  • నేనూ దళితురాలినే.. కానిస్టేబుల్‌ భార్య వీడియో

(తెనాలి, గుంటూరు-ఆంధ్రజ్యోతి)

ప్రమాద బాధితులను పరామర్శించవచ్చు. రాజకీయ హత్యలు, ఆందోళనల్లో బాధితులైన వారినీ ఓదార్చవచ్చు. కానీ... వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తీరే వేరు! పోలీసులకే సవాలు విసురుతూ, శాంతిభద్రతలకు తరచూ విఘాతం కల్గిస్తూ... ఏకంగా కానిస్టేబుల్‌పైనే హత్యాయత్నం చేసిన రౌడీషీటర్లకు ఆయన వత్తాసు పలుకుతున్నారు. కానిస్టేబుల్‌పై దాడిచేసిన కేసులో అరెస్టయిన రౌడీషీటర్ల కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం ఆయన తెనాలిలోని ఐతానగర్‌కు వస్తున్నారు. వారికి భరోసా ఇచ్చేందుకు ఆయన వస్తున్నారని వైసీపీ వర్గాలు ప్రకటించాయి.

అసలేం జరిగింది...

తెనాలిలో గంజాయి బ్యాచ్‌ రౌడీషీటర్లను పోలీసులు ఎన్నిమార్లు మందలించినా, కేసులు నమోదు చేసినా మార్పు రావడం లేదు. బెయిల్‌పై వచ్చి మళ్లీ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇటీవల చిరంజీవి అనే కానిస్టేబుల్‌పై తిరగబడి హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధిత కానిస్టేబుల్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రౌడీషీటర్లలో భయం కలిగించాలనే ఉద్దేశంతో కానిస్టేబుల్‌పై దాడి చేసినవారిని పోలీసులు బహిరంగంగా లాఠీలతో అరికాళ్లకు కొట్టారు (నాడా ట్రీట్‌మెంట్‌). వైసీపీకి వంతపాడి ప్రస్తుతం జైలులో ఉన్న ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు రౌడీషీటర్లపైనే కాకుండా అమాయకులపై కూడా కాళ్లు వాచేలా డార్మెటరీలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించేవారు. ఇలా బహిరంగంగా కొట్టడం చట్టవిరుద్ధమే! జగన్‌ దీన్ని ఖండిస్తే ఎవరూ తప్పు పట్టేవారు కారేమో. కానీ... ఏకంగా రౌడీషీటర్ల కుటుంబాలను పరామర్శించేందుకు రావడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ‘వీరికేనా మీ మద్దతు..?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో తెనాలిలోని అదే ఐతానగర్‌లో రౌడీషీటర్‌లు రెచ్చిపోయి అమాయకపు జనంపై దాడులకు దిగిన వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.


నేనూ దళితురాలినే...

తెనాలిలో రౌడీషీటర్ల చేతిలో హత్యాయత్నానికి గురైన కానిస్టేబుల్‌ చిరంజీవి భార్య కల్యాణి తానూ దళితురాలినే నంటూ ఓ వీడియో విడుదల చేశారు. ‘దళిత సంఘ పెద్దలను, రాజకీయ నాయకులను ఒక దళిత సోదరిగా వేడుకుంటున్నా! రౌడీ షీటర్లను కొట్టిన సంఘటనలో వారికి మద్దతుగా నిలుస్తున్న వారికి ఇదే నా విన్నపం! నేను కూడా దళిత మహిళనే. నాకు తల్లిదండ్రులు లేరు. బీసీ సామాజికవర్గానికి చెందిన చిరంజీవిని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నా. నా భర్తను రౌడీషీటర్లు మారణాయుధాలతో దాడిచేసి చంపబోయారు. మేం కేసు పెట్టాం. దాడికి పాల్పడిన వారిని పోలీసులు పట్టుకొని దండించారు. రౌడీషీటర్లకు అండగానిలవాలని చూస్తే దళిత సోదరినైన నాకు అన్యాయం చేసినట్టే’ అన్నారు.

రౌడీషీటర్లకు కులం రంగా?: గుంటూరు ఎస్పీ

రౌడీషీటర్లకు కుల, రాజకీయ రంగు పులిమి మద్దతు ఇవ్వటం సముచితం కాదని గుంటూరు జిల్లా ఎస్పీ సతీ్‌షకుమార్‌ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన సంఘటనపై ఉన్నతస్థాయి పోలీసు అధికారితో దర్యాప్తు చేయిస్తున్నామని, దీనిని రాద్ధాంతం చేయటం తగదని ప్రకటించారు.

Updated Date - Jun 03 , 2025 | 08:20 AM