Share News

Nandyal Suspicious Death: భర్తను చంపి అత్తింటికే డోర్‌ డెలివరీ...!

ABN , Publish Date - Jul 24 , 2025 | 03:41 AM

భర్తతో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్లింది. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ భర్తకు ఫోన్‌ చేసి పిలిపించింది.

Nandyal Suspicious Death: భర్తను చంపి అత్తింటికే డోర్‌ డెలివరీ...!

  • మృతదేహాన్ని పల్నాడు నుంచి నంద్యాలకు తీసుకెళ్లిన భార్య

  • మృతుడి కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు

పిడుగురాళ్ల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): భర్తతో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్లింది. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ భర్తకు ఫోన్‌ చేసి పిలిపించింది. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలీదు.. భర్త శవమై కనిపించాడు. ఆ మృతదేహాన్ని తీసుకుని ఆమె నేరుగా అత్తింటికి వెళ్లింది. మద్యం సేవించి ఇంట్లో కుప్పకూలి చనిపోయాడని వారితో చెప్పింది. అయితే ఒంటిపై గాయాలు ఉండడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్లలోని ప్రజాశక్తినగర్‌కు చెందిన రమణమ్మకు నంద్యాల జిల్లాలోని నూనెపల్లెకు చెందిన మేకల శేషాచలం (50) అలియాస్‌ రమణయ్యతో ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్యోతి, చందన, సాయి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. రమణయ్య పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అప్పుడప్పుడూ భర్తతో గొడవ జరిగినప్పుడు రమణమ్మ పిడుగురాళ్లలోని పుట్టింటికి వచ్చి కొన్నాళ్లు ఉండేది. భర్త, పెద్దమనుషులు ఆమెను బుజ్జగించి నం ద్యాల తీసుకెళ్తుండేవారు. రెండు నెలల క్రితం భర్తతో గొడవపడిన రమణమ్మ పిడుగురాళ్లకు వచ్చింది. ఈ క్రమంలో భర్తకు ఫోన్‌చేసి తన ఆరో గ్యం బాగోలేదని చెప్పడంతో ఆయన సోమవారం నంద్యాల నుంచి పిడుగురాళ్లకు వచ్చాడు. భార్యకు నచ్చజెప్పి తనతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఆమె వినిపించుకోలేదు. సోమవారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. అయితే మంగళవారం కారులో రమణయ్య మృతదేహంతో రమణమ్మ, ఆమె సోదరుడు రామయ్య నంద్యాలలోని రమణయ్య ఇంటికి వెళ్లారు. అక్కడ వారు ఏమైందని ప్రశ్నించగా.. మద్యంతాగి పక్కింటి వారితో గొడవపడిన రమణయ్య కొద్దిసేపటికి ఇంట్లోకి వచ్చి కుప్పకూలి చనిపోయాడని చెప్పారు. అయితే మృతదేహాన్ని పరిశీలించిన రమణయ్య చిన్న కుమార్తె చందన... కంట్లో కారం చల్లినట్టు, ఒంటిపై గాయాలున్నట్టు గుర్తించింది. తన తండ్రి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 24 , 2025 | 03:41 AM