Heavy Rains Ravage Roads: ఉమ్మడి పశ్చిమ జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు
ABN , Publish Date - Oct 25 , 2025 | 10:11 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రోడ్లు గజానికో గొయ్యి మాదిరిగా తయారయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రోడ్లు గజానికో గొయ్యి మాదిరిగా తయారయ్యాయి. కొన్ని రోడ్లు వాహనదారులు వెళ్లేందుకే కాదు.. కనీసం నడిచి కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. కొన్ని రహదారుల పరిస్థితిపై ఆంధ్రజ్యోతి కథనం.
నడవడానికి దారి వెతుక్కోవాల్సిందే..
ఏలూరు నగరంలో రహదారులన్నీ భారీ వర్షాలకు మరింత దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద గుంతల్లో నీళ్లు నిలిచి చెరువుల్లా మారాయి. వాహన చోదకులు ప్రయాణమంటేనే హడలిపోతున్నారు. ఏలా వంగాయగూడెం సెంటర్ నుంచి కేన్సర్ ’ హాస్పిటల్స్ కి వెళ్లే రహదారి సుమారు రెండు కిలోమీటర్లు పైగా రహదారి ధ్వంసమైంది. నడవడానికీ దారి వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ గుంతలను పూడ్చండి మహాప్రభో అని ప్రజలు మొత్తుకుంటున్నారు.
పెనుగొండ-సిద్ధాంతం రహదారి అధ్వానం
పెనుగొండ-సిద్ధాంతం రహదారి అధ్వానంగా తయారైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెనుగొండ - సిద్ధాంతం రహదారిని ఏడేళ్ల క్రితం విస్తరించారు. పెనుగొండ మీదుగా సిద్ధాంతం వెళ్లే రహదారిలో మధ్యలో ఉన్న గ్రామాలు పెనుగొండ, వెంకట్రామపురం, వడలి, సిద్ధాంతం గ్రామాల్లో సిమెంట్ రహదారులు నిర్మించారు. గ్రామాల శివారు నుంచి ప్రారంభమయ్యే రహదారి ప్రతీ ఏటా వర్షాలకు గోతులమయంగా మారుతూ ప్రయాణికులను మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ రహదారిలోని భారీ గోతులు వర్షాల సమయంలో నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మల్లప్పదిబ్బ, వడలి, రామన్నపాలెం, సిద్ధాంతం, సిద్ధాంతం లింక్ రోడ్డు మలుపు, జాతీయ రహదారి మలుపులో భారీ గోతులు పడడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల గోతులను పూడ్చారు. కానీ మళ్లీ వర్షాలకు గోతులమయం అయింది. వడలి నుంచి రామన్నపాలెం వెళ్లే రహదారి పూర్తిగా గోతులమయంగా మారింది. వర్షం వస్తే పెద్దపెద్ద గోతుల్లో నీరు నిలిచి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా రహదారులను పూర్తి నిర్మాణం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఉండి-చేబ్రోలు హైవేకి తూట్లు
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఉండి- చేబ్రోలు జాతీయరహదారికి తూట్లుపడ్డాయి. ప్రయాణికులు, వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. రహదారి పెచ్చులుపెచ్చులుగా ఊడిపోయి గోతులమయంగా మారుతోంది. భీమవరం నుంచి ఉండి మీదుగా పాములపర్రు, కోలమూరు, ఉప్పులూరు రోడ్డు, పొందువ్వరోడ్, ఆరేడు మీదుగా గణపవరం ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి. అదేవిధంగా అక్కడ నుంచి తాడేపల్లిగుడెం, చేబ్రోలు, నారాయణపురం మీదుగా ఏలూరు బస్సులు, వాహనాలు వెళ్తుంటాయి. వర్షాకాలం పూర్తికాక ముందే ఈ రహదారి అధ్వానంగా మారింది. ఇక నుంచి కురిసే వర్షాలకు రహదారి మరింత దెబ్బతినే అవకాశం ఉందని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రయాణికులు, ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.
కనీసం గోతులైన పూడ్చండి..
భీమవరం పట్టణ పరిసర ప్రాంతాల్లోని రోడ్లు భారీ వర్షాలకు ధ్వంసమయ్యాయి. ఉండి రోడ్డు, జువ్వలపాలెరం స్టేట్ హైవే రోడ్డు, లోసరి రోడ్డు, పట్టణంలోని బైపాస్ రోడ్డు, ఉండి గేటు రోడ్లు, డీఎన్ఆర్ కళాశాల రోడ్డు, టూటౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లు ఛిద్రంగా మారాయి. వర్షాలు తగ్గిన తరువాత కనీసం గోతులైనా పూడ్చాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
రహదారికి గండి..
జీలుగుమిల్లి మండలంలోని వంకవారిగూడెం, జీలుగుమిల్లి గ్రామాల మధ్య రహదారికి గండిపడడంతో రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తూరలు ఏర్పాటు చేసి రోడ్డు పోయించారు. శుక్రవారం వరద ఉధృతికి కల్వర్టు వద్ద తూరలు కొట్టుకుపోయి రోడ్డు మళ్లీ ధ్వంసమైంది. తాటియాకులగూడెం వద్ద జాతీయ రహదారిపై గోతుల్లో వాహనాలు వరద నీటిలో నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సూమారు రెండు గంటలపాటు వాహన చోదకులు గోతుల వద్ద ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్ర డాక్టర్ సూసైడ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి