wedding Drama: ఆమె నా ప్రియురాలు పెళ్లాపండి
ABN , Publish Date - Jun 27 , 2025 | 07:15 AM
కల్యాణ మండపంలో బంధుమిత్రులు, పెళ్లి కొడుకు సమక్షంలో వధువుకు సంప్రదాయబద్ధంగా హల్దీ నలుగు కార్యక్రమం వేడుక జరుగుతోంది.

సినీ ఫక్కీలో ‘హల్దీ’ని అడ్డుకున్న యువకుడు.. ఆగిపోయిన వివాహం
జీవితం నాశనం చేశాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు
నెల్లూరు (క్రైం), జూన్ 26 (ఆంధ్రజ్యోతి): కల్యాణ మండపంలో బంధుమిత్రులు, పెళ్లి కొడుకు సమక్షంలో వధువుకు సంప్రదాయబద్ధంగా హల్దీ (నలుగు కార్యక్రమం) వేడుక జరుగుతోంది. ఇంతో ఓ యువకుడు సినీ ఫక్కీలో తన స్నేహితులతో వేదిక వద్దకు వచ్చాడు. ‘పెళ్లి ఆపండి. నేనూ పెళ్లికూతురు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం’ అంటూ అక్కడే ఉన్న సారెపళ్లేన్ని కాలితో తన్నాడు. ఊహించని ఈ ఘటనతో అందరూ నిర్ఘాంతపోయారు. చివరికి పెళ్లాగిపోయింది. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరులోని నవాబుపేట ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన యువతి లేగుంటపాడులో ఉంటున్న తన సమీప బంధువు ఇంటికి తరచూ వెళుతుండేది. ఈ క్రమంలో 2022లో నందవర్ధన్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి పరిచయంపై ఇంట్లో తెలియడంతో ఆమె అతడితో మాట్లాడటం మానేసింది. దీంతో నందవర్ధన్ యువతి వెంటబడుతూ మాట్లాడక పోతే మనం తీసుకున్న ఫొటోలు అందరికీ చూపిస్తానని బెదిరించేవాడు.
ఆమెకు పెళ్లి సంబంధాలు వచ్చినా చెడగొట్టేవాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు నవాబుపేట స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని పిలిపించి మందలించారు. ఈ క్రమంలో ఈ నెల 22న పెద్దలు యువతికి వివాహం నిశ్చయించారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో బంధువులు, పెళ్లికొడుకు సమక్షంలో హల్దీ కార్యక్రమం జరుగుతుండగా.. నందవర్ధన్ తన స్నేహితులతో అక్కడికి వచ్చాడు. పదేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామంటూ యువతిని కాలితో తన్నడానికి ప్రయత్నించి అక్క డే ఉన్న సారెపళ్లేన్ని తన్ని దౌర్జన్యం చేశాడు. చివరికి పెళ్లి ఆగిపోయింది. దీంతో యువతి ఈనెల 25వ తేదీ రాత్రి వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది.