CM Chandrababu: గిరిజన యూనివర్శిటీ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Apr 15 , 2025 | 09:46 PM
కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి అవసరమైన తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సత్వరమే పనులకు సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

అమరావతి: కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాని(Central Tribal University)కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస(Kuntinavalasa)లో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ (మంగళవారం) సీఎం చంద్రబాబుని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి, డీన్ ప్రొఫెసర్ ఎం.శరత్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వర్శిటీ నిర్మాణ పనులు, అక్కడి స్థితిగతులపై వారితో సీఎం చంద్రబాబు చర్చించారు. వర్శిటీ నిర్మాణానికి కేంద్రం రూ.800 కోట్లు కేటాయించగా.. వాటిలో రూ.340 కోట్లు ఇప్పటికే విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆ నగదుతో 561 ఎకరాల వర్శిటీ ప్రాంగణంలో అడ్మిన్ బిల్డింగ్‌తోపాటు వసతి భవనాలు, అకడమిక్ బ్లాక్ నిర్మాణం అవుతున్నట్లు చెప్పారు. ఈ పనులను మరింత వేగవంతం చేయాలని వీసీని ఆదేశించారు. ఏడాదిలోగా అన్ని నిర్మాణాలు పూర్తి చేసి భవనాలను అందుబాటులోకి తేవాలని సూచించారు. నిర్మాణాల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే విశ్వవిద్యాలయానికి అవసరమైన తాగునీరు, విద్యుత్ సౌకర్యం, అప్రోచ్ రోడ్ వంటి పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని వీసీకి చెప్పారు. దీనిపై సత్వరమే కార్యాచరణ చేపట్టాలని సమావేశంలోనే సంబంధిత అధికారులను చంద్రబాబు ఆదేశించారు. వర్శిటీకి రెండు కిలోమీటర్లు మేర అప్రోచ్ రోడ్ వేస్తే సౌకర్యవంతంగా ఉంటుందని వీసీ చెప్పగా.. అందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 100 మంది టీచింగ్ స్టాఫ్ అవసరం ఉండగా.. ప్రస్తుతం కేవలం 18 మంది మాత్రమే ఉన్నారని వర్శిటీ అధికారులు తెలపగా.. సిబ్బందిని పెంచాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని చంద్రబాబు భరోసా కల్పించారు. మరోవైపు మే నెలలో నిర్వహించే యూనివర్శిటీ స్నాతకోత్సవానికి రావాల్సిందిగా ఏపీ ప్రభుత్వం తరఫున ప్రధానికి మరో లేఖ రాస్తామని చంద్రబాబు వెల్లడించారు.
కాగా, 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి అద్దె భవనాల్లోనే విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఈ యూనివర్సిటీలో 600 మంది విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. సొంత భవనాలు పూర్తయితే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..
MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..