CII Summit 2025: సీఐఐ సమ్మిట్-2025 సూపర్ హిట్: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Nov 15 , 2025 | 06:58 PM
విశాఖ సీఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లోనే రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించగలిగిందని పేర్కొన్నారు. విశాఖ వేదికగా రెండ్రోజులపాటు జరిగిన సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాలు జరిగాయని.. వీటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు.
విశాఖపట్నం: విశాఖ సీఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లోనే రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించగలిగిందని పేర్కొన్నారు. విశాఖ వేదికగా రెండ్రోజులపాటు జరిగిన సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాలు జరిగాయని.. వీటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ ఒప్పందాల ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. మూడ్రోజుల్లోనే రాష్ట్రానికి రూ.16లక్షల కోట్ల పైగా పెట్టుబడులు సాంధించామని హర్షం వ్యక్తం చేశారు. భాగస్వామ్య సదస్సులో దాదాపు 5,587మంది పాల్గొని కలిసికట్టుగా విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..'అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించుకోగలిగాం. భాగస్వామ్య సదస్సులు పెట్టినప్పుడు కేవలం పెట్టుబడులపైనే కాదు.. నాలెడ్జ్ పైనా చర్చ జరగాలి. దావోస్‌లో ఎంవోయూలు ఉండవు.. వారికి వారు మాత్రమే చేసుకుంటారు. అక్కడ ప్రస్తుత, భవిష్యత్తు సబ్జెక్టులపై చర్చించి సమాధానాలు కనుగొంటారు. ఏపీకి పెట్టుబడులు అవసరం కనుక వచ్చిన వారితో ఎంవోయూలు చేశాం.. చర్చలు చేయించాం. ప్రపంచం నలుమూలల నుంచి 650 మంది డెలిగేల్స్ వచ్చారు. ఈసారి 450 నుంచి 500 మందిని ప్రాస్పెక్టివ్ ఎంట్రప్రెన్యూర్లుగా ఆహ్వానించాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు వస్తున్నాయి. స్పెషల్ ఎకనమిక్ జోన్లు, మెగా పార్కులు, ప్రైవేటు పార్కులు ఇంటిగ్రేట్ చేస్తున్నాం.
మెడ్ టెక్ పార్కులో కామన్ మార్కెటింగ్ ఫెసిలిటీ పెట్టాం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా ఇక్కడికి వస్తుంది. రెండ్రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు ఇవాళ్టితో ముగుస్తోంది. వివిధ దేశాల నుంచి 30కి పైగా మంత్రులు ఈ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారు. భాగస్వామ్యాలు, పెట్టుబడులు, ఎంఓయూలు ఇలా 67 సెషన్లను ఈ రెండ్రోజుల్లో నిర్వహించాం. దావోస్ తరహాలో ఈ సెషన్లను నిర్వహించగలిగాం. కేవలం పెట్టుబడులు మాత్రమే కాదు ఆలోచనల్నీ పరస్పరం పంచుకోగలిగాం. 60 దేశాలకు చెందిన ప్రతినిధులు సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారు. 700కు పైగా బీటూబీ సమావేశాలు జరిగాయి. సదస్సుకు హాజరైన కొందరు విదేశీ ప్రతినిధులు స్థానిక సంప్రదాయాలను పాటిస్తూ ఇక్కడి దుస్తులు ధరించి బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారు.
దేశానికి ప్రధాని మోదీ లాంటి బలమైన నాయకత్వం ఉంది. కేంద్రం, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాలున్నాయి. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగానే ప్రణాళికలు, పాలసీలను తయారు చేసుకుంటున్నాం. గడిచిన రెండ్రోజులుగా సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కార్మిక, ఆర్థిక, ఇన్ఫ్రా సంస్కరణల్ని పరిశ్రమలకు అనుకూలంగా మార్చాం. దేశంలో ఎక్కడా లేనట్టుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఎస్క్రో ఖాతాను ఏపీ నిర్వహిస్తోంది. దీనికి ప్రభుత్వ హామీ ఉంటుందని ప్రకటిస్తున్నా. వచ్చే ఏడాదీ పెట్టుబడుల సదస్సుకు మీరంతా హాజరు కావాలని ఆహ్వానం పలుకుతున్నా. ఆంధ్రప్రదేశ్‌లో తరచూ పర్యటించాలని పారిశ్రామిక వేత్తలందరినీ కోరుతున్నా.
కాగా, రెండ్రోజుల సీఐఐ సదస్సులో వైద్యారోగ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, టెక్స్ టైల్స్, పర్యాటక రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ, హెట్రోడ్రగ్స్, భారత్ డైనమిక్స్ , జేకే ఏరోస్పేస్, అదానీ విల్మర్, ఎన్ఎస్టీఎల్ క్వాంటమ్ కంప్యూటింగ్ స్టిములేటింగ్ సెంటర్, సిడాక్, పాస్కల్ తదితర సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి: