Share News

HPCL Pipeline Project: విశాఖ నుంచి రాయ్‌పూర్‌కు హెచ్‌పీసీఎల్‌ పైప్‌లైన్‌

ABN , Publish Date - May 06 , 2025 | 05:08 AM

విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కు హెచ్‌పీసీఎల్‌ పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.2,212 కోట్లు కేటాయించి, నాలుగు జిల్లాల్లో 165 కిలోమీటర్ల పొడవునా ఈ పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు.

HPCL Pipeline Project: విశాఖ నుంచి రాయ్‌పూర్‌కు హెచ్‌పీసీఎల్‌ పైప్‌లైన్‌

  • రూ.2,212 కోట్లతో పనులు.. మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యం

  • రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 165 కి.మీ. పొడవున ఏర్పాటు

  • భూసేకరణకు కమిటీల నియామకం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో రిఫైనరీ విస్తరణ పనులు పూర్తికావడంతో హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌

(హెచ్‌పీసీఎల్‌) పైప్‌లైన్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇక్కడ ఏడాదికి 8.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగిన రిఫైనరీ ఉండగా, దానిని 15 మిలియన్‌ టన్నుల సామర్థ్యానికి విస్తరించింది. ఇక్కడి నుంచి పైప్‌లైన్ల ద్వారా దూర ప్రాంతాలకు పెట్రోల్‌, డీజిల్‌, ఇతర ఇంధనాలు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధంచేసింది. విశాఖ నుంచి రాయ్‌పూర్‌కు పైప్‌లైన్‌(వీఆర్‌పీఎల్‌) ఏర్పాటుకు రూ.2,212 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో నాలుగు జిల్లాలు(విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం) మీదుగా ఈ పైప్‌లైన్‌ ఛత్తీస్గ‌ఢ్‌లోని రాయ్‌పూర్‌కు వెళ్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 165 కిలోమీటర్లు. ఈ మార్గంలో పంపింగ్‌, పిగ్గింగ్‌ స్టేషన్లు, సెక్షన్ల వారీగా వాల్వ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పంపింగ్‌ స్టేషన్‌కు ఆరు నుంచి ఎనిమిది ఎకరాల భూమి అవసరం. అలాగే వాల్వ్‌ స్టేషన్‌లకు అర ఎకరా చొప్పున కావాలి. ఈ నాలుగు జిల్లాల్లో అవసరమైన భూములను డీ పట్టాలు, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించగా జిల్లాల వారీగా జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా, ఆర్‌డీఓ, హెచ్‌పీసీఎల్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌, డీజీఎం, జీఎం స్థాయి అధికారులతో ఐదుగురు సభ్యుల కమిటీలను ఏర్పాటుచేయాలని సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరు అక్కడి ధరల ఆధారంగా భూమికి పరిహారం ఇస్తారు. పైపులైన్‌ ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Updated Date - May 06 , 2025 | 05:09 AM