Share News

Visakhapatnam Lawyers : విశాఖలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:24 AM

విశాఖలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం విశాఖ బార్‌ అసోసియేషన్‌ ఆవరణలో సమావేశం నిర్వహించారు.

Visakhapatnam Lawyers : విశాఖలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి

  • ఆరు జిల్లాల న్యాయవాదుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం

మహారాణిపేట (విశాఖపట్నం), ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు దశలవారీగా ఆందోళనలు చేయాలని ఉత్తర కోస్తాలోని ఆరు జిల్లాల న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానించారు. విశాఖలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం విశాఖ బార్‌ అసోసియేషన్‌ ఆవరణలో సమావేశం నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన విశాఖ జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బెవర సత్యనారాయణ మాట్లాడుతూ, విశాఖలో ప్రిన్సిపల్‌ హైకోర్టు, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న అడ్వొకేట్‌ అమెండ్‌మెంట్‌ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపడుతున్న కార్యాచరణలో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. విశాఖలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు 1993 నుంచి ఉద్యమాలు జరుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇకపై పట్టువీడకుండా ఉద్యమించాలని తీర్మానిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటుచేసి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి, గవర్నర్‌కు నివేదిస్తామన్నారు. వివిధ కేసుల కోసం ఉత్తరకోస్తా ప్రజలు 350-700 కిలోమీటర్లు ప్రయాణించి హైకోర్టుకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నిరకాలుగా అనువైన ప్రదేశం అయిన విశాఖలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలన్నారు. బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు మాట్లాడుతూ విశాఖలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.

Updated Date - Feb 24 , 2025 | 04:24 AM