Share News

Srikakulam: మూలపేటలో అమెరికా కంపెనీ

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:07 AM

అమెరికాకు చెందిన ఎగ్జాంబిల్‌ కంపెనీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పరిధిలో ఏర్పాటు కాబోతోంది. 1,250 ఎకరాల్లో రూ.83,500 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్ట్‌ పాలీఇథలీన్‌ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

Srikakulam: మూలపేటలో అమెరికా కంపెనీ

  • 83 వేల కోట్ల పెట్టుబడితో పాలిఇథలీన్‌ పరిశ్రమకు ప్రతిపాదన

  • స్థలాన్ని పరిశీలించిన సంస్థ ప్రతినిధులు, అధికారులు

టెక్కలి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): అమెరికాకు చెందిన ఎగ్జాంబిల్‌ కంపెనీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పరిధిలో ఏర్పాటు కాబోతోంది. 1,250 ఎకరాల్లో రూ.83,500 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్ట్‌ పాలీఇథలీన్‌ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. శుక్రవారం ఆ సంస్థ ప్రతినిధులు జెవె్‌స్టకాట్‌, సేలింలో, డీపీ ప్రసన్న, శ్రీసీజ్‌ రామచంద్రన్‌, రంజిత్‌ కుమార్‌ ఈ ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను ఆర్డీవో కృష్ణమూర్తి వారికి వివరించారు. రైల్‌, రోడ్డు రవాణా అనుసంధానం, అవసరమైన విద్యుత్‌, గొట్టాబ్యారేజ్‌ నుంచి నీరు సమకూరుస్తామని తెలిపారు. ఇక్కడ పోర్టు నిర్మాణంతో వచ్చే సౌకర్యాల గురించి నిర్మాణ సంస్థ విశ్వసముద్ర జీఎం శంకరరావు అమెరికా బృందానికి అవగాహన కల్పించారు.


మొగ్గుచూపిన ప్రతినిధి బృందం

ఎగ్జాంబిల్‌ కంపెనీ ప్రతినిధులు జేవె్‌స్టకాట్‌, సేలింలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఫిబ్రవరి 6 నుంచి ఇప్పటివరకు రామాయపట్నం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులు పరిశీలించాం. ఇప్పుడు మూలపేట పోర్టు ప్రాంతాన్ని కూడా చూశాం. ఇక్కడి తీరంలో కార్గోషిప్పింగ్ రాకపోకలకు అనుకూల వాతావరణం ఉంది. రైలు, రోడ్డు కనెక్టివిటీ సౌకర్యాలు బాగున్నాయి. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఏడాదికి రెండు మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ తయారీ చేయొచ్చు. మా సంస్థకు రోజుకి వంద మిలియన్‌ లీటర్ల నీరు కావాలి. పర్యావరణ ఇబ్బందులు లేని వేస్ట్‌వాటర్‌ ట్రీట్మెంట్‌ చేస్తాం. ఫస్ట్‌ఫేజ్‌లో పాలీఇథలీన్‌, రెండో ఫేజ్‌లో పాలీప్రోపలిన్‌ తయారు చేస్తాం. 70 దేశాల్లో మా పరిశ్రమలు ఉన్నాయి. 62వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు’ అని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హేమసుందర్‌, ఏపీఐఐసీ జెడ్‌ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 04:07 AM