Piyush Goyal: ఎగుమతి, దిగుమతుల్లో ఏపీని కింగ్‌ని చేస్తాం: కేంద్రమంత్రి
ABN , Publish Date - Jun 15 , 2025 | 09:33 PM
గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి భరత్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పొగాకు బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అమరావతి: గుంటూరు పొగాకు బోర్డును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సందర్శించారు. అనంతరం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడితో చర్చలు జరిపారు. అంతకుముందు, గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి భరత్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు అధికారులతో కేంద్రమంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబుని పియూష్ గోయల్ అమరావతిలో కలిశారు. ఈ భేటీపై స్పందించిన కేంద్రమంత్రి.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో మంచి వాతావరణంలో సమావేశం జరిగిందని, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్దిపై జరిగిన సమావేశం ఆశాజనకంగా ఉందని చెప్పారు.
ఏపీలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటు చేస్తామని, పోర్ట్‌లు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో రూ.1.6కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. కొత్త ఉద్యోగ కల్పన జరుగుతుందని, పరిమితికి మించి పొగాకు సాగు చెయెుద్దని ఈ సందర్భంగా రైతులకు కేంద్రమంత్రి సూచించారు. గత నాలుగేళ్లలో పోగాకు రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందని.. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని చెప్పారు.
కేంద్రమంత్రితో తన భేటీ గురించి సీఎం చంద్రబాబు తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ ద్వారా వివరాలు తెలిపారు. ' గౌరవనీయులైన కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ని కలవడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పురోగతికి సంబంధించిన కీలక విషయాలపై ఫలప్రదమైన చర్చలు జరిపాం. పొగాకు రైతులకు కేంద్రం మద్దతు, మామిడి గుజ్జుపై GST తగ్గింపు, ఆక్వా ఎగుమతులకు ఉపశమనం, ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాలను సమీక్షించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని అభ్యర్థించా. పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా మూడు పారిశ్రామిక పార్కుల అభివృద్ధి గురించీ చర్చించాం. ఎగుమతులు, దిగుమతుల రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా మారడానికి కేంద్రం పూర్తి మద్దతు ఉంటుందని పియూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఆయన సానుకూల స్పందనకు కృతజ్ఞతలు. రైతుల సంక్షేమం, రాష్ట్ర పురోగతి కోసం కలిసి పనిచేస్తూ ముందుకు సాగుతాం' అని చంద్రబాబు తన పోస్ట్‌లో రాశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News