IPS Officers: ఇద్దరు ఐపీఎస్‌లకు ఊరట
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:18 AM
ఏపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు అమిత్ బర్దార్, గరికపాటి బిందు మాధవ్‌కు ఉపశమనం లభించింది. ఎన్నికల సమయంలో ఈ ఇద్దరిపై ఎన్నికల కమిషన్ విధించిన సస్పెన్షన్‌ను రాష్ట్ర...

అమిత్ బర్దార్, బిందు మాధవ్‌పై ఎన్నికల నాటి కేసుల ఉపసంహరణ
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ఏపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు అమిత్ బర్దార్, గరికపాటి బిందు మాధవ్‌కు ఉపశమనం లభించింది. ఎన్నికల సమయంలో ఈ ఇద్దరిపై ఎన్నికల కమిషన్ విధించిన సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉప సంహరించుకుంది. ఆ కాలాన్ని డ్యూటీగా పరిగణిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు అమిత్ బర్దార్ అనంతపురం జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. పోలింగ్ రోజు తాడిపత్రిలో జరిగిన గొడవలు అదుపు చేయలేకపోయారనే కారణంతో అమిత్ బర్దార్ సస్పెండయ్యారు. ఎన్నికల కమిషన్ సిఫారసుతో అమిత్‌ను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. విచారణ సందర్భంగా ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందింది. ఇక ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ పని చేశారు. అప్పట్లో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు, ఆ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుడిని చేస్తూ ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది.
మాచర్ల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంను పగుల గొడుతున్న వీడియోలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. టీడీపీ మహిళా ఏజెంట్ నుదుటిపై గొడ్డలితో నరికినా ఆమె తలకు కట్టు కట్టుకుని పోరాడిన తీరు పల్నాడులో పరిస్థితులకు అద్దం పట్టింది. అల్లర్లపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏడు హింసాత్మక ఘటనలపై చట్ట పరమైన చర్యలకు సిఫారసు చేసింది. ఆ ఘటనల్లో తన తప్పు లేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి బిందు మాధవ్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వం పరిశీలించి ఇటీవలే సస్పెన్షన్‌ను రద్దు చేసింది. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.