Share News

Anantapur: ఈ స్టాంపుల స్కామ్‌లో ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Jun 29 , 2025 | 03:40 AM

నకిలీ ఈ స్టాంపుల కుంభకోణంలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌ వెల్లడించారు.

Anantapur: ఈ స్టాంపుల స్కామ్‌లో ముగ్గురి అరెస్టు

  • కళ్యాణదుర్గంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • నకిలీలతో ప్రభుత్వానికి 25 లక్షలు గండి కొట్టిన ‘మీసేవ బాబు’

  • వివరాలు వెల్లడించిన అనంత ఎస్పీ జగదీష్‌

అనంతపురం క్రైం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణంలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌ వెల్లడించారు. ఈ కేసులో నిందితులు బోయ ఎర్రప్ప అలియాస్‌ మీసేవ బాబు, మోహన్‌బాబు, భువనేశ్వర్‌ను కళ్యాణదుర్గంలో శనివారం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి నుంచి మూడు సెల్‌ఫోన్లు, 3 సీపీయూలు, 3 మానిటర్లు, 3 ప్రింటర్‌ కం స్కానర్లు, రెండు ప్రింటర్లు, ఒక లాప్‌లాప్‌, 88 ఖాళీ ఈ-స్టాంపులు, 7 వాడిన ఈ-స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కేసు వివరాలను ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కర్నూలులోని స్టాక్‌ హోల్డింగ్‌ కంపెనీ నుంచి మీసేవ బాబు రూ.32,80,750 విలువైన 15,851 స్టాంపులు కొనుగోలు చేశాడని తెలిపారు. ఇందులో 438 స్టాంపులను ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా, దాని అనుబంధ సంస్థలకు రూ.32 లక్షలకు విక్రయించాడని, కానీ ప్రభుత్వానికి మాత్రం రూ.6.52 లక్షలు మాత్రమే స్టాంప్‌ డ్యూటీ చెల్లించారని తెలిపారు. ఎస్‌ఆర్‌సీ నుంచి తీసుకున్న సొమ్ములో మిగిలిన రూ.25.48 లక్షలను ప్రభుత్వానికి చెల్లించకుండా మోసగించాడని తెలిపారు.


ఈ-స్టాంపుల స్కాంపై ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జీఎం సతీష్‌ నుంచి ఈనెల 22న, అలాగే బెంగళూరుకు చెందిన నియో కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ అకౌంటెంట్‌ షేక్‌ఇమామ్‌ జుబేర్‌, ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన సూరజ్‌ ఇన్‌ఫ్రా కంపెనీ అకౌంటెంట్‌ శ్రీనివాసులు నుంచి ఈనెల 25న ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వీటిపై మూడు కేసులు నమోదు చేశామని, ఈ కుంభకోణంపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఎస్‌ఆర్‌సీ, ఇతర సంస్థలకు విక్రయించగా మిగిలిన 15,413 ఈ-స్టాంపులను ఎవరు కొనుగోలు చేశారో దర్యాప్తులో తేలుతుందన్నారు. ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు.

మోసం చేసిందిలా..

ఎస్‌ఆర్‌సీ, దాని అనుబంధ సంస్థలకు విక్రయించిన మొత్తం 438 ఈ-స్టాంపుల ముఖ విలువ రూ.6.52 లక్షలు మాత్రమే. ఈ సొమ్ము మాత్రమే ప్రభుత్వానికి చేరింది. కానీ ఈ-స్టాంపుల ముఖ విలువను ఎర్రప్ప టాంపరింగ్‌ చేసి ఎక్కువగా చూపించాడు. రూ.100 విలువైన స్టాంపును ఫొటో షాప్‌లో ఎడిట్‌ చేసి.. సున్నాలు చేర్చడం ద్వారా రూ.1,00,000కు విక్రయించాడు. ఇలా స్టాంపు ముఖ విలువ కంటే ఎక్కువగా వసూలు చేసిన సొమ్మును కాజేశాడు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి రూ.25.48 లక్షల గండి పడింది.

Updated Date - Jun 29 , 2025 | 03:40 AM