Telugu States CMs Meeting: న్యూఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ !
ABN , Publish Date - Jul 14 , 2025 | 07:09 PM
తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరు భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

అమరావతి, జులై 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12.00 గంటలకు ఆయన న్యూఢిల్లీకి చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవి, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేర్వేరుగా సమావేశం కానున్నారు.
అలాగే నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్, ఢిల్లీ మెట్రో ఎండీతో సైతం సీఎం చంద్రబాబు భేటీ అవనున్నారు. ఇక ప్రధాని సంగ్రహాలయలో మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నర్సింహారావు జీవితంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. అలాగే భారత పరిశ్రమ సమాఖ్య- సీఐఐ స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.
న్యూఢిల్లీలో సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇలా..
జులై 15వ తేదీ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
మధ్యాహ్నం 2. 30 గంటలకు సీఎం చంద్రబాబుతో ఆయన అధికారిక నివాసంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ సమావేశం కానున్నారు.
మధ్యాహ్నం 3.00 గంటలకు సీఎం చంద్రబాబును ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఢిల్లీ మెట్రో ఎండీ కలవనున్నారు.
సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రధాని సంగ్రహాలయను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. అనంతరం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సంస్మరణ సభలో 'పీవీ జీవితం, వారసత్వం'పై ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు.
సాయంత్రం 7.00 గంటలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
బుధవరం అంటే.. జులై 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశం కానున్నారు.
రాత్రి 7 గంటలకు సీఐఐ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా పలు అంశాలపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.
స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారంపై టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో చేపట్టాల్సిన ప్రాజక్టులు, అభివృద్ది కార్యక్రమాలు, ప్రజల ఆదాయ పెంపుదల తదితర అంశాలతో పాటు.. దేశంలో అధిక వృద్ది రేటు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేసిన విషయం విదితమే. సీఐఐ నిర్వహిస్తున్న కార్యక్రమంలో సీఎం చంద్రబాబుకు ఈ టాస్క్‌ఫోర్స్ నివేదికను అందజేయనుంది.
అనంతరం... రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సీఐఐ పోషించాల్సిన కీలక పాత్రపై సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు.
గురువారం అంటే.. జులై 17వ తేదీ ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం..!
మరోవైపు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు న్యూఢిల్లీలో భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తుంది. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో వీరిద్దరు భేటీ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్‌పై తెలంగాణలో పలు రాజకీయ పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్రం నుంచి వచ్చిన అభ్యంతరాలపై ఏపీ ఇప్పటికే సమాధానం ఇచ్చింది. అయితే దీనిపై చర్చలే ముఖ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఈ అంశంపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో వీరిద్దరు సమావేశమయ్యే అవకాశముందని తెలుస్తుంది.
ఇక సీఎం చంద్రబాబు రెండు రోజుల న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కానున్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా బుధవారం న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన సైతం అదే రోజు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌లో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులు, నీటి కేటాయింపులతోపాటు పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఈ సీఎంలు ప్రాథమిక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
అయితే పోలవరం - బనకచర్లపై కేంద్రం లేవనెత్తిన అంశాలపై సీఎం చంద్రబాబు ఇప్పటికే సమగ్ర నోట్స్ తయారు చేసినట్లు సమాచారం. అలాగే ఈ ప్రాజెక్ట్‌పై తెలంగాణ తెరపైకి తీసుకు వచ్చిన అంశాలను కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఒకే సారి అపాయింట్‌మెంట్ ఇచ్చారా? లేకుంటే వేర్వేరుగా ఇచ్చారా ? అనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో వీరి భేటీపై కొంత సందిగ్థత నెలకొంది.
ఇవి కూడా చదవండి
నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '
తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు
Read Latest AP News And Telugu News