Bapatla : బతికుండగానే డెత్ సర్టిఫికెట్!
ABN , Publish Date - Jan 19 , 2025 | 04:37 AM
గత వైసీపీ హయాంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అండతో తన స్థలంలోని ఇంటి గోడను కూలగొట్టడంపై ప్రశ్నించిన తనపైనే వైసీపీ గూండాలు దాడి చేశారని...

భర్త తీరుపై టీడీపీ గ్రీవెన్స్‌లో భార్య ఫిర్యాదు
అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అండతో తన స్థలంలోని ఇంటి గోడను కూలగొట్టడంపై ప్రశ్నించిన తనపైనే వైసీపీ గూండాలు దాడి చేశారని బాపట్ల జిల్లా గోకరాజునల్లిబోయిన వారిపాలేనికి చెందిన వెంకట్రావు హోం మంత్రి ఎదుట తన ఆవేదన వెళ్లబోసుకున్నారు. తనను కులం పేరుతో దూషిస్తున్నారని వాపోయారు. తనను కొట్టిన వారిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని కోరారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో హోంమంత్రి అనిత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గుంటూరుకు చెందిన టి.మాధవి తాను బతికుండగానే తన భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి, తన పేరుతో ఉన్న స్థలాన్ని ఆయన అక్క పేరుమీదకు మార్చి, తన పిల్లలకు ఏ ఆధారమూ లేకుండా చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. తన కుమారులు తనను పట్టించుకోవడం లేదని బాపట్ల జిల్లా కారుమూరివారిపాలేనికి చెందిన కె.విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. కుమారులకు తాను రాసిచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయాలని కోరారు. మురళీమోహన్‌రావు అనే వ్యక్తి.. తన ఆస్తి బ్యాంకులో ఉందని చెప్పి రూ.కోటిపైగా తీసుకుని, డాక్యుమెంట్లు తెచ్చి ఇవ్వమంటే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని విజయవాడకు చెందిన రాజ్‌కుమార్ మొరపెట్టుకున్నారు. తన కుమార్తెను భర్త, బంధువులు హతమార్చి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, పోలీసులను మేనేజ్ చేసి, కేసును తప్పుదారి పట్టిస్తున్నారని నెల్లూరు రూరల్‌కు చెందిన చల్లా శ్రీనివాసులరెడ్డి ఫిర్యాదు చేశారు. తమ పొలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేసి, పొలంలోకి వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నారని తిరుపతి జిల్లా పాలమంగళంకు చెందిన ప్రమీలారాణి వాపోయారు. 70ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇంటిని అధికారులు కూల్చే ప్రయత్నం చేస్తే.. కోర్టు స్టే ఆర్డర్ తెచ్చినా తహసీల్దార్ బలవంతంగా తమను బయటకు లాగి, ఇంటిని కూల్చి, తమకు నీడ లేకుండా చేసి, రూ.లక్షలు నష్టం చేశారని అన్నమయ్య జిల్లా గోరంచెర్వుకు చెందిన ఖాజాపీర్ గోడు వెళ్లబోసుకున్నారు.