Illegal Mining: మైనింగ్ అక్రమాల పై ఉక్కుపాదం
ABN , Publish Date - Jun 27 , 2025 | 06:13 AM
రాష్ట్రంలో ఇసుక, మట్టి, గ్రావెల్, ఇతర చిన్న తరహా ఖనిజాల అక్రమ మైనింగ్, రవాణాను అరికట్టేందుకు ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది.

చిన్నతరహా ఖనిజాల అక్రమ తవ్వకం, రవాణాకు అడ్డుకట్ట.. మైనర్ మినరల్ నిబంధనల్లో కీలక సవరణలు
అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇసుక, మట్టి, గ్రావెల్, ఇతర చిన్న తరహా ఖనిజాల అక్రమ మైనింగ్, రవాణాను అరికట్టేందుకు ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న తరహా ఖనిజాల కన్సెషన్ నిబంధనలకు పదునుపెడుతూ కీలక సవరణలు చేస్తూ గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ గురువారం ఉత్తర్వులు (జీవో 100) జారీ చేశారు. మేజర్ మినరల్స్ మైనింగ్‌లో అక్రమాలను గుర్తిస్తే కనీసం రూ.5 లక్షల జరిమానాతో పాటు ఖనిజం మార్కెట్ విలువ ఆధారంగా అపరాధ రుసుము వసూలు చేసేందుకు నిబంధనలు ఉన్నాయి. మైనర్ మినరల్స్‌లో ఇది లేదు. తాజాగా వీటిలోనూ భారీ పెనాల్టీలను తీసుకొచ్చారు. ఇసుక, మట్టి, రోడ్‌మెటల్, సున్నపురాయి తదితర ఖనిజాల అక్రమ మైనింగ్, రవాణాను గుర్తిస్తే.. వాటి మార్కెట్ విలువ ఆధారంగా భారీ స్థాయిలో అపరాధ రుసుము విధించనున్నారు.
ఖనిజాలపై నేతలు, దళారులు కన్నేసి ముందే దరఖాస్తు చేసి రిజర్వ్ చేసుకోకుండా కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు. నిజంగా మైనింగ్ చేయాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేలా లీజు దరఖాస్తు ఫీజులను భారీగా పెంచారు. ఇంతకు ముందు రూ.వెయ్యి ఫీజు చెల్లించి దరఖాస్తు వేసేవారు. దీంతో భారీసంఖ్యలో వచ్చేవి. ఫలితంగా లీజుల కోసం పోటీ ఉండేది. ఇప్పుడు సగటున ఏ దరఖాస్తు అయినా సరే రూ.10 వేలు ఫీజుగా చె ల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, పట్టా, డీకేటీ భూముల్లో లీజులు కోరుకునేవారు సైతం ఒక్కో దరఖాస్తుకు 10 వేలు కట్టాల్సిందే. మైనింగ్ లీజు దక్కకపోయినా ఆ ఫీజు వెనక్కి ఇవ్వరు. ఈ పెంపుదల వల్ల కేవలం మైనింగ్ చేసేవాళ్లే దరఖాస్తుకు ముందుకొస్తారని ప్రభుత్వం భావిస్తోంది. లీజులకు సంబంధించి గనుల శాఖ నుంచి లెటర్ ఆప్ ఇంటెంట్ (ఎల్‌వోఐ) తీసుకున్నవారు.. 15 రోజుల వ్యవధిలో ప్రీమియంలో తొలి వాయిదా చెల్లించాలని, మూడు రెట్ల వార్షిక డెడ్‌రెంట్ చెల్లించాలన్న నిబంధన తీసుకొచ్చారు.
ఆ బాధ్యత అధికారులదే..
మైనింగ్ ప్లాన్‌ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఆ ఉత్తర్వులను 4 నెలల్లోగా సంబంధిత జిల్లా గనుల అధికారులు లీజుదారులకు పంపించాలి. లేనిపక్షంలో మైనింగ్ ప్లాన్ ఆమోదం పొందినట్లుగానే పరిగణించేలా నిబంధనలు తెచ్చారు. ఆ ప్లాన్‌ను సకాలంలో లీజుదారుడికి ఎందుకు అందించలేకపోయారో జిల్లా అధికారి లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది.
ఇకపై ఆన్ లైన్ పర్మిట్లు
లీజుదారులకు ఇకపై ఆన్ లైన్ ట్రాన్సిట్ పర్మిట్లు ఇవ్వనున్నారు. ఈ మేర కు నిబంధనల్లో స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం సీనరేజీ వసూళ్ల కాంట్రాక్టును అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ట్రాన్సిట్ పర్మిట్లు కూడా ఆన్‌లైన్ ద్వారానే ఇవ్వాలని తాజాగా పేర్కొంది. కాగా.. సీనరేజీ కాంట్రాక్టులు పొందిన సంస్థలు.. ఇతరులకు వాటిని బదలాయించడానికి వీల్లేదని కూడా నిబంధనల్లో చేర్చారు.
ఇసుక అక్రమాలపై కన్నెర్ర
సవ రించిన సమగ్ర ఇసుక విధానాన్ని కూడా మైనర్ మినరల్స్ కన్సెషన్ రూల్స్ పరిధిలోకి తీసుకొచ్చారు. తొలిసారి ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే ట్రాక్టర్‌పై రూ.10 వేలు, 10 టైర్ల లారీపై రూ.25 వేలు, 10 కంటే ఎక్కువ టైర్లు ఉండే లారీపై రూ.50 వేల పెనాల్టీ విధిస్తారు. ఇక అక్రమ మైనింగ్ చేసే యంత్రాలపై రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తారు. ఇవే వాహనాలు రెండోసారి అక్రమ రవాణాలో దొరికితే ట్రాక్టర్‌పై రూ.10-20 వేలు, 10 టైర్ల లారీపై రూ.25-50 వేల వరకు, 10 కంటే ఎక్కువ టైర్లు ఉన్న లారీపై గరిష్ఠంగా రూ.లక్ష వరకు, యంత్రాలకూ రూ.లక్ష జరిమానా విధించనున్నారు. అలాగే పరిమితికి మించి ఇసుక నిల్వ చేసినా.. అక్రమంగా నిల్వచేసినట్లు నిరూపితమైతే రూ.2 లక్షల జరిమానాతోపాటు రెండేళ్లు జైలు శిక్ష విధించాలని రూల్స్‌లో చేర్చారు. అక్రమ మైనింగ్, రవాణాలో వాహనాల సీజ్‌తోపాటు జరిమానాలు అదనంగా ఉంటాయి. ఈ మేరకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డీఎల్‌ఎ్‌ససీ)కి కీలక అధికారాలు ఇచ్చారు.