Gottipati Ravikumar: డిస్కమ్‌ల బలోపేతానికి సహకారం అందించండి
ABN , Publish Date - Feb 28 , 2025 | 04:38 AM
డిస్కమ్‌లను ఆర్థికంగా బలోపేతం చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం నిరంతరం కావాల్సిందేనని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

సీమలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేయండి
కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కోరిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): డిస్కమ్‌లను ఆర్థికంగా బలోపేతం చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం నిరంతరం కావాల్సిందేనని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ గురువారం రాష్ట్రాల ఇంధన శాఖల కార్యదర్శులు, మంత్రులతో సమావేశమయ్యారు. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉన్న గొట్టిపాటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నామని గొట్టిపాటి తెలిపారు. రాయలసీమలో సోలార్, పవన, పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ పథకాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కరెంటును రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేసేలా గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రినికోరారు. కేంద్ర సహకారాన్ని కోరగా, కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మరోసారి సమావేశాన్ని నిర్వహిస్తామని, ఈ సమావేశంలో కార్యాచరణను ప్రకటిస్తామని ఖట్టర్ వెల్లడించారు.