Share News

Tirumala : పాత్రధారులెవరో తేలింది!

ABN , Publish Date - Feb 16 , 2025 | 05:02 AM

శ్రీవారి లడ్డూల తయారీకి నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసిన కేసులో పాత్రధారులెవరన్నది సిట్‌ బృందం దాదాపుగా తేల్చేసింది.

Tirumala : పాత్రధారులెవరో తేలింది!

  • లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట

  • దర్యాప్తుపై బృందానికి సీబీఐ దిశానిర్దేశం

తిరుపతి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూల తయారీకి నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసిన కేసులో పాత్రధారులెవరన్నది సిట్‌ బృందం దాదాపుగా తేల్చేసింది. ఇక సూత్రధారుల కోసం వేట మొదలుపెట్టబోతోంది. ఇప్పటి వరకూ చేసిన దర్యాప్తు ఆధారంగా ఈ వ్యవహారంలో టీటీడీకి సంబంధించిన 12 మంది అధికార, అనధికార ముఖ్యుల ప్రమేయం ఉందని సిట్‌ భావిస్తోంది. వారిపై దృష్టి సారించిన అధికారులు అందులో ఇద్దరిని విచారణకు పిలిచేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నారని, మరో ముగ్గురిని నేరుగా అరెస్టు చేసే అవకాశముందని సమాచారం. విచారణ మరో రెండు మూడు నెలలు కొనసాగనుందని, అప్పటికిగానీ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని సమాచారం.

ఏ ప్రశ్న వేసినా ఒకే రకమైన సమాధానం!

శుక్రవారం జ్యుడిషియల్‌ కస్టడీ నుంచి కోర్టు ద్వారా తమ కస్టడీకి తీసుకున్న ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌, భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌, వైష్ణవీ డెయిరీ సీఈవో వినయ్‌కాంత్‌ చావ్డాలను సిట్‌ అధికారులు రెండవ రోజైన శనివారమూ విచారించారు. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వీరేశ్‌ ప్రభు, సీబీఐ డీఐజీ మురళీ రాంబా శనివారం కూడా ప్రధాన నిందితులు నలుగురినీ వేర్వేరుగా ప్రశ్నించారు. ఏ ప్రశ్న వేసినా నలుగురూ కూడబలుక్కున్నట్టు ఒకే రకమైన సమాధానం ఇచ్చారని తెలిసింది. శనివారం రోజంతా ఈ నలుగురినే ప్రశ్నించారని, టీటీడీకి సంబంధించి ఎవరినీ పిలవలేదని సమాచారం.


సిట్‌ అధికారులకే ఎదురు ప్రశ్నలు!

నిందితులు నలుగురినీ సిట్‌ అధికారులు ప్రశ్నిస్తుండగా, పలు సందర్భాలలో నిందితులే సిట్‌ అధికారులను ఎదురు ప్రశ్నించారని సమాచారం. గతేడాది జూలైలో ఏఆర్‌ డెయిరీ సరఫరా చేసిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించినట్టు టీటీడీ ఎప్పుడు సమాచారం ఇచ్చింది? అన్న ప్రశ్నకు ఆ డెయిరీ ఎండీ అసలు తాము టీటీడీకి నెయ్యే సరఫరా చేయలేదని, ఇక తిరస్కరించినట్టు టీటీడీ తమకు ఎందుకు సమాచారం ఇస్తుందని ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. నాణ్యత లేదన్న కారణంగా టీటీడీ నెయ్యిని తిరస్కరించిందని తమకు వైష్ణవి డెయిరీ ప్రతినిధుల నుంచి ఫోన్‌ ద్వారా సమాచారం అందిందని చెప్పినట్టు తెలిసింది. టీటీడీ తిరస్కరించిన ట్యాంకర్లు కూడా తమ డెయిరీకి రాలేదని, వైష్ణవి డెయిరీకి వెళ్లాయని చెప్పినట్టు సమాచారం. ఆ ట్యాంకర్లన్నీ భోలేబాబా డెయిరీ నుంచి వైష్ణవీ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా అయ్యాయే తప్ప తమ డెయిరీకి ఎలాంటి సంబంధమూ లేదని సమాధానమిచ్చినట్టు తెలిసింది.


సిట్‌ బృందంతో సీబీఐ అధికారుల భేటీ

తిరుపతి సిట్‌ కార్యాలయంలో దర్యాప్తు బృందంతో సీబీఐ అధికారులు సమావేశమయ్యారు. ఇప్పటి వరకూ కొనసాగిన దర్యాప్తు గురించి సమీక్షించుకున్న అనంతరం తదుపరి దర్యాప్తు ఎలా చేపట్టాలన్న దానిపై దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. టీటీడీ అధికారులు, పాలకమండలికి సంబంధించిన వ్యక్తులను ఎవరెవరిని విచారించాలో లోతుగా చర్చించినట్టు సమాచారం. కల్తీ నెయ్యి సరఫరాలో టీటీడీ పరంగా 12 మంది ప్రమేయం ఉందని సిట్‌ భావిస్తున్నట్టు సమాచారం. అందులో పాలకమండలి, పాలనా విభాగం, మార్కెటింగ్‌ విభాగం, పర్చేజెస్‌, టెక్నికల్‌ కమిటీల్లోని కొందరు సభ్యులు, నెయ్యికి సంబంధించిన నిపుణులు, ల్యాబ్‌, విజిలెన్స్‌ విభాగాల కీలక వ్యక్తులున్నారు. వారందరినీ విచారించే ఆస్కారం ఉంది. ఇదివరకు పనిచేసిన ఓ కీలక అధికారి, పాలకమండలికి చెందిన ముఖ్యులొకరిని విచారణకు హాజరు కావాల్సిందిగా పిలిచేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. మిగిలిన వారిలో ముగ్గురిని నేరుగా అదుపులోకి తీసుకునే, అరెస్టుకు సైతం అవకాశాలున్నాయని తెలిసింది. ఇక సిట్‌ దర్యాప్తులో టీటీడీ అధికార యంత్రాంగం ప్రధానంగా ల్యాబ్‌కు సంబంధించి ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. సిట్‌ బృందంలో ప్రభుత్వం ఓ డీఎస్పీని, ఓ సీఐని అదనంగా కేటాయించిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా కారంపూడి సీఐ శ్రీనివాసరావు శనివారం తిరుపతికి చేరుకుని సిట్‌ విధుల్లో చేరారు. తిరుపతి ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ నరసింగప్ప సోమవారం చేరనున్నారు.

Updated Date - Feb 16 , 2025 | 05:02 AM