Share News

YCP Jagan: సింగయ్య కేసులో జగన్‌నుతప్పించే కుట్ర

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:37 AM

జగన్‌ పర్యటిస్తున్న కారు ఢీకొని వైసీపీ దళిత కార్యకర్త చీలి సింగయ్య మరణించిన కేసును నిర్వీర్యం చేసేందుకు.. ఈ ఘటనలో జగన్‌, ఆయన ప్రయాణించిన కారు ప్రమేయం లేదంటూ తప్పించడానికి పెద్ద కుట్ర జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.

YCP Jagan: సింగయ్య కేసులో జగన్‌నుతప్పించే కుట్ర

  • కేసును తప్పుదారి పట్టించే యత్నంపై సమగ్ర దర్యాప్తునకు ఉన్నతాధికారుల ఆదేశం

గుంటూరు, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): జగన్‌ పర్యటిస్తున్న కారు ఢీకొని వైసీపీ దళిత కార్యకర్త చీలి సింగయ్య మరణించిన కేసును నిర్వీర్యం చేసేందుకు.. ఈ ఘటనలో జగన్‌, ఆయన ప్రయాణించిన కారు ప్రమేయం లేదంటూ తప్పించడానికి పెద్ద కుట్ర జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఏడాది కిందట ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు కాసి రూ.కోటిన్నర పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వైసీపీ రెంటపాళ్ల ఉపసర్పంచ్‌ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికంటూ 18న జగన్‌ పర్యటనకు వెళ్తున్న క్రమంలో ఏటుకూరు బైపాస్‌ వద్ద వెంగళాయపాలేనికి చెందిన ప్లంబర్‌ సింగయ్యను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది.


కారు కింద పడిన సింగయ్యను పట్టించుకోకుండా ముందుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత వైసీపీ కార్యకర్తలు పెద్దపెద్దగా కేకలు వేయడంతో డ్రైవరు కారును ఆపాడు. సింగయ్యను బయటకు తీశాక ముందుకెళ్లిపోయాడు. సింగయ్య కొద్దిసేపటికే కన్నుమూశారు. జగన్‌ కారు ఢీకొనడం వల్లే ఆయన మరణించారని మాజీ సీఎంతో పాటు కారులో ప్రయాణిస్తున్న వైసీపీ నాయకులు విడదల రజని, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, జగన్‌ పీఏ కె.నాగేశ్వరరెడ్డి, డ్రైవర్‌ రమణారెడ్డి తదితరులకు తెలుసు. ఈ విషయం బయటకు వస్తే రాజకీయంగానే కాక చట్టపరంగా కూడా ఇబ్బంది అవుతుందని భావించిన వైసీపీ నాయకులు కేసును తప్పుదోవ పట్టించేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత తలశిల రఘురాం రంగంలోకి దిగినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది.


జగన్‌ కాన్వాయ్‌లో ఉన్న కార్లలో ఒకటైన దేవినేని అవినాశ్‌ అనుచరుడి కారును ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడకు చెందిన వైసీపీ నేత తెలివిగా దేవినేని అనుచరుడి కారు నంబరును పోలీసులకు లీక్‌ చేశారు. సాధారణంగా రోడ్డు ప్రమాద కేసుల్లో కంటితో చూసినప్పటికీ అప్పటికప్పుడు వాహనం నంబరును పోలీసులు ప్రకటించరు. అటువంటిది ప్రత్యక్షంగా ఎవరు చూడకపోయినా.. అదేరోజు హడావుడిగా పోలీసులు ఏపీ 26సీఈ 0001 అనే నంబరు కలిగిన కారు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగి సింగయ్య మృతి చెందినట్లు ప్రకటించేశారు. ఏ ఆధారంతో అలా ప్రకటించారంటే సమాధానం లేదు. అయితే నిఘా వర్గాలు ఆరోజు జగన్‌ కాన్వాయ్‌లో పాల్గొన్న కార్ల నంబర్లతో స్పష్టంగా వీడియో తీసి ఉన్నతాధికారులకు అందించాయి. అందులో పోలీసులు ప్రకటించిన ఈ కారు నంబర్‌ కూడా ఉంది.


జగన్‌పైకి కేసు రాకుండా తప్పించాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు రంగంలోకి దిగి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. పైగా తాడేపల్లి సీఐ 24 గంటల్లోనే విజయవాడలో దేవినేని అనుచరుడి కారును, డ్రైవర్‌ను, యజమానినీ అదుపులోకి తీసుకోవడం మరిన్ని సందేహాలకు దారితీసింది. వారిని విచారిస్తున్న సమయంలోనే సింగయ్యను జగన్‌ కారు ఢీకొన్న వీడియోలు బయటపడ్డాయి. ఈ పరిస్థితుల్లో 18, 19 తేదీల్లో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించిన ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. దరిమిలా.. ఆ తేదీల్లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నేతలతో పోలీసు శాఖలో ఎవరు టచ్‌లోకి వెళ్లారనేది తెలుసుకునేందుకు వారి కాల్‌ డేటాను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోజు పోలీసులు తీసిన డ్రోన్‌ విజువల్స్‌, అదేవిధంగా స్థానికులు సెల్‌ఫోన్లలో తీసిన వీడియో పుటేజీల్లో జగన్‌ కారు ఢీకొనే సింగయ్య మరణించిన విషయం స్పష్టంగా కనిపించింది. ఆయా వీడియోలు బయటకు రాకుండా ఉన్నట్లయితే.. దేవినేని అవినాశ్‌ అనుచరుడి కారు ఢీకొనే సింగయ్య చనిపోయినట్లు నిర్ధారించి కేసు క్లోజ్‌ చేసేవారు. వారిని విచారిస్తున్న క్రమంలోనే జగన్‌ కారు ఢీకొన్న వీడియో విజువల్స్‌ బయటకు వచ్చాయి.

Updated Date - Jun 26 , 2025 | 01:19 PM