liquor scam: ఆ ఫ్లాట్ ఏజెన్సీకిచ్చాం.. ఎవరున్నారో తెలీదు
ABN , Publish Date - Jul 17 , 2025 | 03:48 AM
దుబాయ్‌లో తమ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఫ్లాట్‌ను ఓ రెంటల్ ఏజెన్సీకి లీజుకు ఇచ్చామని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు స్పష్టం చేశారు.

ఏపీ లిక్కర్ స్కాం నిందితులతో వ్యాపార లావాదేవీలు లేవు: శ్రవణ్ రావు
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): దుబాయ్‌లో తమ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఫ్లాట్‌ను ఓ రెంటల్ ఏజెన్సీకి లీజుకు ఇచ్చామని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు స్పష్టం చేశారు. ఆ ఏజెన్సీ వారు ఎవరికి అద్దెకు ఇచ్చారో, అందులో ఎవరున్నారో తమకు తెలియదని వెల్లడించారు. ‘శ్రవణ్ రావు దుబాయ్ ఫ్లాట్‌లో లిక్కర్ స్కాం నిందితుల మకాం’ పేరుతో ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురితమైన కథనంపై శ్రవణ్ రావుకు చెందిన సంస్థ వివరణ ఇచ్చింది. ‘శ్రవణ్ రావు కుటుంబ సభ్యులు గతంలోనే దుబాయ్‌లో ఫ్లాట్ కొనుగోలు చేశారు. అయితే ఆ ఫ్లాట్‌ను హాలీడే హోమ్స్ అనే ఏజెన్సీకి 2023లో లీజుకు ఇచ్చారు. ఆ సంస్థ తాత్కాలిక పద్ధతిలో భారత్‌తోపాటు ఇతర దేశాల నుంచి దుబాయ్ వచ్చే వారికి అద్దెకు ఇస్తోంది. హాలీడే హోమ్స్ ఆ ఫ్లాట్‌ను ఎవరికి అద్దెకు ఇస్తుందనే విషయంతో యజమానికి ఏ సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డితోగానీ, ఆ కేసులో మిగతా నిందితులతోగానీ శ్రవణ్ రావు, అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. 2023 నుంచి దుబాయ్‌లోని ఫ్లాట్ శ్రవణ్ రావు కుటుంబం ఆధీనంలో లేదు’ అని వెల్లడించింది.