Sharmila: సంగయ్య మృతికి కారణం ముమ్మాటికీ జగన్ నిర్లక్ష్యమే
ABN , Publish Date - Jun 24 , 2025 | 06:40 AM
‘పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో కారు కింద పడి సింగయ్య అనే వృద్ధుడు చనిపోవడానికి ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యమే కారణం’ అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.

5-10 కోట్ల పరిహారం చెల్లించాలి: షర్మిల డిమాండ్
తిరుపతి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ‘పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో కారు కింద పడి సింగయ్య అనే వృద్ధుడు చనిపోవడానికి ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యమే కారణం’ అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. సోమవారం శ్రీకాళహస్తిలో ఆమె మీడియాతో మాట్లాడారు. సన్ రూఫ్, బస్ టాప్‌పై నుంచీ ప్రజలకు అభివాదం చేయవచ్చు కానీ ఫుట్ బోర్డుపైన నిలబడి నిర్లక్ష్యంగా అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడం, కొందరు పిచ్చిగా కారుపైకి ఎగబడడం నిబంధనలకు విరుద్ధం కాదా అని ఆమె నిలదీశారు. మృతుడి కుటుంబానికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు నగదు చెల్లించి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వృద్ధుడు మరణించిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారందరినీ విచారించాలని పోలీసులను డిమాండ్ చేశారు. జగన్‌లో ఏ మాత్రం పాపభీతి మిగిలివున్నా మృతుడి కుటుంబానికి క్షమాపణ చెప్పి వుండాలని, ఇప్పటికే కనీస బాధ్యతగా ఆర్థిక సాయం ప్రకటించి వుండాలన్నారు.