IPS Officer PSR Anjaneyulu: జెత్వానీ ఎవరో తెలీదు
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:13 AM
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు సీఐడీ విచారణలో సహకరించకుండా దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. జెత్వానీ కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

కుక్కల విద్యాసాగర్ కూడా నాకు తెలియదు
నేను జిల్లా అధికారిని కాదు..
దర్యాప్తు అధికారిని అంతకన్నా కాదు
సీఐడీ ప్రశ్నలకు పీఎస్ఆర్ జవాబులు
విచారణకు సహకరించని సీనియర్ ఐపీఎస్
నేటితో పోలీసు కస్టడీ పూర్తి
విజయవాడ, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ‘నేను జిల్లా అధికారిని కాదు.. ఏ కేసులోనూ దర్యాప్తు అధికారిని అంతకన్నా కాదు.. నాకేమీ తెలియదు..’ సీఐడీ విచారణలో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు చెప్పిన సమాధానాలివి. ముంబై నటి కాదంబరి జెత్వానీ గానీ, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ గానీ తనకు తెలియదని చెప్పారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణిలో జవాబులిచ్చినట్లు తెలిసింది. జెత్వానీని వేధింపులకు గురిచేసిన కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎ్‌సఆర్(ఏ-2)ను మూడ్రోజులు కస్టడీలో విచారించేందుకు కోర్టు అనుమతించగా.. తొలిరోజు ఆదివారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించినప్పుడు బీపీ ఎక్కువగా ఉండడంతో సీఐడీ అధికారులు ఆయన్ను తిరిగి జైలులోనే అప్పగించారు. సోమవారం ఉదయం జైలు నుంచి ముందుగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చేసిన పరీక్షల్లో బీపీ 160/95గా ఉండడంతో విచారణకు తీసుకెళ్లారు. కానూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. దర్యాప్తు అధికారి (ఆర్‌ఐవో) ప్రసాద్ ఆధ్వర్యంలో రెండు బృందాలు ఆయన్ను ప్రశ్నించాయి. మొత్తం 82 ప్రశ్నలు సంధించాయి. జెత్వానీపై కేసు నమోదు చేయాలని ఎవరు ఆదేశించారని అడుగగా.. అసలామె ఎవరో తనకు తెలియదని పీఎ్‌సఆర్ బదులిచ్చారు. కుక్కల విద్యాసాగర్ ఎవరి ద్వారా కలిశారని అడుగగా.. ఆయన కూడా తనకు తెలియదని చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను చూపించి అది ఎవరిదని ప్రశ్నిస్తే.. తనదేనని అంగీకరించారు.
ఉపయోగించిన సిమ్ నంబర్‌ను ప్రస్తావించగా.. అది కూడా తనదేనని చెప్పారు. జెత్వానీపై కేసు నమోదు చేయడానికి ముందు జగన్ నివాసాని(సీఎంవో)కి వెళ్లారు కదా అని అడుగగా.. వెళ్తే వెళ్లి ఉండవచ్చని దాటవేశారు. కోర్టు ఇచ్చిన మూడ్రోజుల కస్టడీ గడువు మంగళవారంతో ముగియనుంది. చివరిరోజు సీఐడీ మరో 80 ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం. విచారణ అనంతరం పీఎ్‌సఆర్‌ను జైలుకు తరలిస్తారు.
మీ పోలీసు భోజనం వద్దు
విచారణకు హాజరైన పీఎఫ్ఆర్.. పోలీసులు అందించిన భోజనం తినడానికి ఇష్టపడలేదు. ఉదయం సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లాక అల్పాహారం తీసుకోవాలని వారు కోరగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. భోజన విరామ సమయంలో భోజనం చేయాలని సూచించగా.. ‘మీ పోలీసు భోజనం నాకొద్దు’ అని చెప్పారు. సీనియర్ పోలీసు అధికారిగా ఉన్న పీఎఫ్ఆర్.. తనకు, పోలీసు శాఖకు మధ్య గీత గీశారని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఆయన కాఫీ మాత్రమే తాగినట్లు తెలిసింది.
ఇంటి భోజనం అనుమతించండి
పీఎఫ్ఆర్ పిటిషన్
తనకు ఇంటి నుంచి భోజనం, మందులు, తాగునీరు అనుమతించాలని ఐపీఎస్ అధికారి పీఎఫ్ఆర్ ఆంజనేయులు విజయవాడలోని మూడో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. జైలులో నిద్రపోవడానికి సౌకర్యంగా ఉండే పడకను ఏర్పాటు చేయాలని ఆయన తరఫున న్యాయవాది విష్ణువర్ధన్ దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు.
జెత్వాని కేసులో ఐపీఎస్‌ల క్వాష్
పిటిషన్లపై విచారణ 1కి వాయిదా
తనపై కేసును కొట్టివేయాలని హైకోర్టులో పీఎస్ఆర్ మరో పిటిషన్
సినీనటి కాదంబరి జెత్వాని ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని, అప్పటి ఏసీపీ కె.హనుమంతరావు, దర్యాప్తు అధికారి కె.సత్యనారాయణ వేసిన క్వాష్ పిటిషన్లపై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. సోమవారం వ్యాజ్యాలు విచారణకు వచ్చిన సమయంలో ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. ఈ కేసుల్లో అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని, విచారణను మే 1కి వాయిదా వేయాలని కోరారు. దీనికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ అంగీకరించారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ నిందితులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యాలు సోమవారం విచారణకు రాగా నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. కేసులో నిందితులను విచారణకు పిలవబోమని ఏజీ కోర్టుకు హామీ ఇచ్చారన్నారు. అందుకు విరుద్ధంగా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారని చెప్పారు. పిటిషనర్ల విషయంలో సైతం తొందరపాటు చర్యలు తీసుకొనే అవకాశం లేకపోలేదన్నారు. తదుపరి విచారణ వరకు స్టే విధించాలని కోరారు. మరోవైపు ఇదే వ్యవహారంలో తనపై కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ్‌సఆర్ ఆంజనేయులు సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు.