Share News

Scorching Heat: మండిన కోస్తా

ABN , Publish Date - Jul 17 , 2025 | 03:03 AM

కొద్ది రోజులుగా ఎండలతో మండిపోతున్న కోస్తాలో బుధవారం పలుచోట్ల వడగాడ్పులు వీచాయి.

Scorching Heat: మండిన కోస్తా

  • నెల్లూరులో 40.2 డిగ్రీలు.. దేశంలోనే అత్యధికం

  • పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు దాకా వడగాడ్పులు

  • జూలై తొలి పక్షంలో నిరాశపరచిన రుతుపవనాలు

  • రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు

  • సాధారణం కంటే 38.6 శాతం తక్కువ వర్షపాతం

  • రేపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

  • దాని ప్రభావంతో 22వ తేదీ వరకు వర్షాలు

విశాఖపట్నం, జూలై 16(ఆంధ్రజ్యోతి): కొద్ది రోజులుగా ఎండలతో మండిపోతున్న కోస్తాలో బుధవారం పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు వరకూ వేడి గాలులు వీయడంతో ప్రజలు ఠారెత్తిపోయారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4నుంచి 8డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా నెల్లూరు లో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గన్నవరంలో 39.6, నరసాపురంలో 39.4, జంగమహేశ్వరపురంలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాలతో ముసురు వాతావరణం నెలకొనాల్సిన సమయంలో వడగాడ్పులు వీయడం అసాధారణమేనని వాతావరణ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. జూలైలో 40 డిగ్రీలు నమోదుకావడం అరుదుగా జరుగుతుందన్నారు. ఎండలతో వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఖరీ్‌ఫలో విత్తిన పంటలు ఎండుతున్నాయి. ఆరుబయట పనిచేసే వ్యవసాయ కూలీలు సొమ్మసిల్లిపోతున్నారు. రుతుపవన ద్రోణి ఎక్కువ రోజులు మధ్య, తూర్పు, వాయువ్య భారతంలో ఉండిపోయింది. దీనిని రుతుపవనాల విరామం అని విశ్లేషించలేం గానీ..దక్షిణ భారతంలో అనేక ప్రాంతాలు దుర్భిక్షంలో చిక్కుకున్నాయని చెప్పవచ్చువని వాతావరణ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. జూలై నెలాఖరు వరకూ కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో డ్యామ్‌లకు వచ్చిన వరదను వచ్చింది వచ్చినట్టుగానే కిందకు వదలాలి. శ్రీశైలం డ్యామ్‌ నిండిపోవడంతో నాగార్జునసాగర్‌కు వరద వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టుల కింద పంటలకు ఫర్వాలేదు గానీ వర్షాధార ప్రాంతాల్లో మాత్రం ఇబ్బంది వచ్చిందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు.


18 నుంచి కోస్తా, సీమలో వర్షాలు

ఉపరితల ఆవర్తనం ఈ నెల 18కల్లా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాకు ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నదని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. దీంతో 18వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరుగుతాయని అంచనా వేశారు. ఈ నెల 22 నాటికి ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంలోకి వచ్చిన తరువాత అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22 వరకూ కోస్తాలో వర్షాలు కురుస్తాయని ఆయన వెల్లడించారు.

కరువు గుప్పిట్లో కోస్తా, రాయలసీమ

రుతుపవనాల సీజన్‌లో 45 రోజులు ముగిసింది. జూన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన రుతుపవనాలు జూలై ప్రథమార్ధంలో కూడా ఆదుకోలేకపోయాయి. జూలై తొలిపక్షం ముగిసినా రాష్ట్రంలో చాలాకాలం తరువాత తీవ్రవర్షాభావం నెలకొంది. జూన్‌ 1నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో 175.6 మిల్లీమీటర్లకుగాను 107.9 మి.మీ. (సాధారణం కంటే 38.6ు తక్కువ) వర్షపాతం నమోదయింది. మొత్తం 26 జిల్లాల్లో విజయనగరం, ఏలూరు తప్ప మిగిలిన 24 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకావడం వర్షాభావం తీవ్రతకు అద్దం పడుతుంది. సాధారణం కంటే కడప జిల్లాలో 74.7 శాతం, అన్నమయ్యలో 72.6, పల్నాడులో 70, శ్రీత్యసాయిలో 60 శాతం తక్కువగా నమోదైంది. దీంతో రాయలసీమ, కోస్తాల్లో ఎక్కువ ప్రాంతాలు తీవ్ర కరువును ఎదుర్కొంటున్నాయని వాతావరణ నిపుణుడొకరు ఆందోళన వ్యక్తంచేశారు.

Updated Date - Jul 17 , 2025 | 03:04 AM