SC Reservation Policy: ఎస్సీ వర్గీకరణకు రూల్స్ విడుదల
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:35 AM
ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కొత్త నిబంధనలు విడుదలైంది. ఈ రూల్స్ ద్వారా 3 గ్రూపులుగా రిజర్వేషన్ పంపిణీ చేయగా, మహిళా రిజర్వేషన్ 33% సమాంతరంగా అమలు చేయనుంది

రాష్ట్రంలో అమలుకు అంతా సిద్ధం
3 గ్రూపులుగా రిజర్వేషన్ ఫలాలు
మహిళా రిజర్వేషన్ 33% ఆయా
గ్రూపులకు సమాంతరంగా అమలు
అర్హులు లేకుంటే రెండో నోటిఫికేషన్
సందేహాలపై ప్రభుత్వంతో చర్చించే చాన్స్
రాష్ట్ర సర్కారు నియామకాలకు వర్తింపు
అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి.. ‘ఎస్సీ వర్గీకరణ రూల్స్-2025’ నోటిఫికేషన్ విడుదల చేసింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏపీ షెడ్యూల్డ్ కులాల (వర్గీకరణ) ఆర్డినెన్స్-2025ను(ఏపీ ఆర్డినెన్స్ నంబరు-2/2025) గురువారం జారీచేసిన సంగతి తెలిసిందే. దీని అమలుకు విధివిధానాలతో కూడిన నిబంధనలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ రూల్స్ వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆర్డినెన్స్‌లో పేర్కొన్నట్లు ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించారు. ఎస్సీ రిజర్వేషన్ 15 శాతాన్ని ఈ గ్రూపులకు పంపిణీ చేస్తారు. గ్రూప్-1లో 12 కులాలకు 1 శాతం, గ్రూప్-2 లోని 18 కులాలకు 6.5 శాతం, గ్రూప్-3లో 29 కులాలకు 7.5 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు. ఏయే గ్రూపులలో ఏయే కులాలు ఉన్నాయన్న జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. అదే విధంగా 200 రోస్టర్ పాయింట్ల విధానాన్ని రెండు విడతలుగా అమలు చేయనున్నారు. మహిళలకు దక్కాల్సిన 33.33 శాతం రిజర్వేషన్లు ఆయా గ్రూపులు మూడింటికీ సమాంతరంగా అమలు చేస్తారు.
అంటే, ప్రతి గ్రూపులో ఆయా మహిళలకు 33.33 శాతం దక్కేలా చూస్తారు. ఏదైనా నోటిఫికేషన్‌కు సంబంధించి రోస్టర్ ప్రకారం ఓ గ్రూప్‌కు సంబంధించిన అర్హులైన వారు లేకపోతే అదే గ్రూపునకు తదుపరి నోటిఫికేషన్‌లో అవకాశమిస్తారు. రెండో నోటిఫికేషన్‌లో కూడా ఆయా గ్రూప్‌నకు అభ్యర్థులు లేకపోతే మూడో నోటిఫికేషన్‌లో అవకాశం కల్పిస్తారు. ఉదాహరణకు ఎవరైనా ఎస్సీ గ్రూప్-1కి చెందిన అభ్యర్థి మొదటి నోటిఫికేషన్‌లో అర్హులు కాకపోతే ఆ పోస్టును రెండో నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తారు. రెండో నోటిఫికేషన్‌లో కూడా అర్హత కలిగిన వారు గ్రూప్-1లో లేకపోతే ఎస్సీ గ్రూప్-2కు చెందిన వారితో మూడో నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తారు. ప్రతి శాఖ ఎస్సీ గ్రూపులకు సంబంధించి రోస్టర్ రిజిస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. రెండు సైకిల్స్‌లో 200 పాయింట్ల రోస్టర్ విధానం అమలు చేయాలి. ఈ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలో ఉన్న అన్ని విద్యాసంస్థల్లో అమలవుతాయి. విద్యాసంస్థల్లో సీట్లు భర్తీ చేసే క్రమంలో ఒక గ్రూపు నుంచి అభ్యర్థులు భర్తీ కాకపోతే మరో గ్రూపు నుంచి భర్తీ చేస్తారు. భవిష్యత్తులో విద్యాసంస్థల నియామకాలు/అడ్మిషన్లుకు ఈ రూల్స్ వర్తిస్తాయి. ఈ రూల్స్‌కు సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే ప్రభుత్వం చర్చించి తదుపరి ఆదేశాలు ఇస్తుంది. సాధారణ పరిపాలనశాఖ, పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఇతర అన్ని సచివాలయ శాఖలు ఈ రూల్స్‌కు అనుగుణంగా సవరణలు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.