Minister Narayana: పటేల్ విగ్రహ నిర్మాణంపై నారాయణ బృందం అధ్యయనం
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:33 AM
మంత్రివర్యులు నారాయణ బృందం గుజరాత్‌లో పర్యటించి, సర్ధార్ పటేల్ విగ్రహం, గిఫ్ట్ సిటీ, సబర్మతి రివర్ ఫ్రంట్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించారు. అమరావతిలో భారీ విగ్రహాలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం గుజరాత్ ఆధారంగా అధ్యయనం చేస్తున్నారు

ఏక్తానగర్‌లో భారీ విగ్రహం సందర్శన
గుజరాత్ అధికారుల ప్రజెంటేషన్
అమరావతి నిర్మాణం నేపథ్యంలో పర్యటన
అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ పరిశీలన
నేడూ గుజరాత్‌లో కొనసాగనున్న టూర్
స్పోర్ట్స్ సిటీని సందర్శించనున్న మంత్రి, అధికారులు
అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్న మంత్రి నారాయణ బృందం రెండు రోజుల పర్యటనకు గుజరాత్ వెళ్లింది. మొదటి రోజు అహ్మదాబాద్, ఏక్తానగర్‌లో పర్యటించింది. ఆదివారం ఉదయం అహ్మదాబాద్‌లో మంత్రి బృందానికి గుజరాత్ అధికారులు స్వాగతం పలికారు. అహ్మదాబాద్ నుంచి బస్సులో ఏక్తానగర్ చేరుకుని, అక్కడ ప్రపంచంలోనే అతి పెద్దదైన సర్ధార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహాన్ని, దానికి అనుగుణంగా నిర్మించిన మరికొన్ని కట్టడాలను పరిశీలించారు. 597 అడుగుల ఎత్తుతో అతి భారీ విగ్రహం నిర్మాణం ఏ విధంగా జరిగింది? ఎలాంటి సాంకేతికత ఉపయోగించారు? విగ్రహం తయారీలో ఎలాంటి నిర్మాణ సామగ్రి ఉపయోగించారు? అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులతో పాటు పటేల్ విగ్రహ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి సమాచారాన్ని మంత్రి బృందానికి వివరించారు. నర్మదానది ఒడ్డున ఉన్న ఈ విగ్రహం నిర్మాణంపై అధ్యయనం ద్వారా అమరావతిలో నిర్మించదలచిన పలు విగ్రహాలపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు ప్రముఖుల భారీ విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
గిఫ్ట్ సిటీ సందర్శన
ఏక్తా నగర్ పర్యటన తర్వాత అహ్మదాబాద్ శివారులోని గాంధీనగర్ జిల్లాలో ఉన్న గిఫ్ట్ సిటీని మంత్రి బృందం సందర్శించింది. దేశంలోనే మొదటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్‌గా 866 ఎకరాల విస్తీర్ణంలో గిఫ్ట్ సిటీ ఉంది. ఇందులో ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)తో పాటు అనేక సంస్థలు, కంపెనీలు, బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు ఉన్నాయి. దీన్ని జాతీయ రహదారులతో పాటు రైల్వే, మెట్రో రైల్వే లైన్‌లకు అనుసంధానం చేశారు. గిఫ్ట్ సిటీకి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు అక్కడ కార్యకలాపాల గురించి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా గుజరాత్ అధికారులు వివరించారు. ఇందులో ఉన్న ఆటోమెటెడ్ చెత్త సేకరణ విధానం, 5.5 కి.మీ. పొడవుతో 8 సర్వీసులకు సంబంధించిన పైపులు వెళ్లే యుటిలిటీ టన్నెల్‌ను మంత్రి బృందం పరిశీలించింది. అనంతరం అహ్మదాబాద్‌లోని యూనివర్సిటీని సందర్శించింది. పర్యావరణం, సంబంధిత విభాగాల్లో ఈ యూనివర్సిటీ వివిధ కోర్సులను అందిస్తోంది. రాజధాని అమరావతిలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై యూనివర్సిటీ అధికారులతో మంత్రి బృందం చర్చించింది. ఇప్పటికే ప్రభుత్వం అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా నిర్మించేలా మాస్టర్‌ప్లాన్ రూపొందించింది. మాస్టర్‌ప్లాన్‌కు తగిన విధంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
సబర్మతి తీరంలో...
గుజరాత్ పర్యటనలో మొదటి రోజు చివర్లో నారాయణ బృందం సబర్మతి రివర్ ఫ్రంట్‌ను సందర్శించింది. అహ్మదాబాద్‌లో సబర్మతి నది ఒడ్డున అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని రివర్ ఫ్రంట్‌గా పిలుస్తారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేకంగా సబర్మతి రివర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. నదీ తీరాన్ని రక్షించడంతో పాటు పర్యావరణ హితంగా ఉండేలా, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసింది. అమరావతిని కూడా కృష్ణా నది ఒడ్డున నిర్మిస్తుండటంతో రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసే ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా సబర్మతి రివర్ ఫ్రంట్‌ను ఏ విధంగా అభివృద్ధి చేశారనే దానిపై అధ్యయనం చేశారు. మొదట సబర్మతి రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మొదటి రోజు పర్యటన ముగిసిన తర్వాత రాత్రికి అహ్మదాబాద్‌లోనే మంత్రి నారాయణ బృందం బస చేసింది. సోమవారం ఉదయం స్పోర్ట్స్ సిటీని పరిశీలించనుంది. మంత్రి వెంట సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, అమరావతి అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారఽథి, గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు ఉన్నారు.