Sankranti Travel: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి.. రైళ్లలో వెయిటింగ్ షురూ.!
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:40 PM
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే ఆ హుషారే వేరు.! ఈ వేడుక కోసం ఊర్లకు వెళ్లేందుకు పలువురు ప్రణాళికలు సిద్ధం చేస్కుంటుంటారు. ఇక ప్రయాణ విషయానికొస్తే రైళ్లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయి.. రెండు నెలల ముందే వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. వందేభారత్ రైలుకూ వెయిటింగ్ చూపిస్తుండటంతో.. సంక్రాంతి వేళ రద్దీ ఏమేర ఉండనుందో ఊహకందదేమో..!
ఇంటర్నెట్ డెస్క్: జనవరి(January)లో వచ్చే సంక్రాంతి(Sankranti) పండుగకు నవంబర్‌లోనే సందడి ప్రారంభమైంది. పండుగ వేళ ఆయా ఊర్లకు వెళ్లడానికి ప్రయాణికులు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా అప్రమత్తమై టికెట్లు బుక్ చేస్కుంటున్నారు. హైదరాబాద్(Hyderabad) పరిసర ప్రాంతాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు చెందిన వారు.. ట్రైన్ టికెట్లు(Train Ticket) బుక్ చేస్కోవడానికి పోటీపడటంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ముందస్తు రిజర్వేషన్‌కు విండో(Reservation Window) ఓపెన్ అయిందో లేదో టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. జనవరి 9వ తేదీకి సంబంధించిన టికెట్లు పూర్తై.. రిగ్రెట్(Regret), వెయిటింగ్(Waiting) అని చూపిస్తోంది.
సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రయాణించే గోదావరి రైలుకు టికెట్లు అయిపోయి.. 'రిగ్రెట్'గా చూపిస్తోంది. ఈ మార్గంలో నడిచే రెండు వందేభారత్(Vandebharat) రైళ్లలో సైతం 'వెయిటింగ్ లిస్ట్' చూపిస్తోంది. ఇవే కాకుండా గరీబ్‌రథ్, ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, మహబూబ్‌నగర్ - విశాఖ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్ దాటిపోయి.. రిగ్రెట్ అని చూపిస్తోంది. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ అనే తేడాలేకుండా సీట్లన్నీ పూర్తిగా బుక్ అయిపోయాయి. ఆరోజు ఉదయం బయల్దేరే జన్మభూమి, కోణార్క్, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మాత్రం ఇంకా వెయిటింగ్ లిస్ట్‌గా చూపిస్తోంది.
బుకింగ్ ఇలా...
సంక్రాంతి వేళ.. జనవరి 13, 14, 15 తేదీలకు రెండ్రోజులు అటూ ఇటూ సందడి ఉండడం సహజం. అయితే.. ఈసారి 10, 11న శని, ఆదివారాలు వస్తుండటంతో రిజర్వేషన్ల సందడి జోరుగా ఆరంభమైంది. ప్రయాణానికి 60 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకునేందుకు రైల్వే శాఖ వెసులుబాటు కల్పిస్తోంది. గతంలో ఈ గడువు 120 రోజులుగా ఉండేది. టికెట్ల జారీ ప్రక్రియ దుర్వినియోగమవుతోందన్న నెపంతో రెండు నెలలకు కుదించింది. దాని ప్రకారం జనవరి 10కి నవంబర్ 11న, జనవరి 11కి సంబంధించి నవంబర్ 12న, జనవరి 13కు సంబంధించి నవంబర్ 13న.. ఉదయం వేళ 8 గంటల ప్రాంతంలో రిజర్వేషన్ విండో ఓపెన్ అవుతుంది.
ఐఆర్‌సీటీసీ(IRCTC) అకౌంట్ ద్వారా లాగిన్ అయి గతంలో టికెట్లు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ, కొందరు ఏజెంట్లు ఒక్కో ఖాతా నుంచి ఎక్కువ టికెట్లు బుక్ చేస్తూ అధిక మొత్తంలో లాభాలు అర్జిస్తూ, దుర్వినియోగానికి పాల్పడుతుండటంతో సాధారణ ప్రయాణికులకు తత్కాల్(Tatkal) టికెట్లు లభించేవి కాదు. ఈ క్రమంలో జులై 1 నుంచి ఐఆర్‌సీటీసీ ఖాతాకు ఉన్న మొబైల్ నంబర్‌తో ఆధార్ కార్డ్ అనుసంధానమై ఉంటేనే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేలా రైల్వే శాఖ నిబంధనలు సడలించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ ఇదే విధానాం వర్తింపజేసింది. ఆధార్ అథంటికేషన్ పూర్తయ్యాక.. ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉన్నవారు మాత్రమే ఉదయం 8 గంటలకు రిజర్వేషన్ టికెట్లు పొందేలా మార్పులు చేసింది. అలా లింక్ చేసుకోని వారు 15 నిమిషాలు ఆలస్యంగా టికెట్లు పొందేందుకు వెసులుబాటు కల్పించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
మౌలానా ఆజాద్‌కి నివాళి అర్పించిన చంద్రబాబు, లోకేష్
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Read Latest AP News And Telugu News