Sajjala Ramakrishna: ‘సజ్జల’ సామ్రాజ్యంలో42 కాదు.. 52 ఎకరాలు!
ABN , Publish Date - Jan 03 , 2025 | 05:56 AM
మాజీ సీఎం జగన్ గొంతు, ముక్కులాంటి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి.

అటవీ భూముల ఆక్రమణ
పేదల చుక్కల భూములూ కబ్జా రామకృష్ణారెడ్డి సోదరుల దందా
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందన.. విచారణకు ఆదేశం
అమరావతి/కడప, జనవరి 2(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ గొంతు, ముక్కులాంటి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లా సీకేదిన్నె మండల పరిధిలోని అటవీ భూముల్లో ఏకంగా 52 ఎకరాలు ఆక్రమించారు. అంతేగాక పేదల చుక్కల భూములనూ కబ్జా చేసి ఎస్టేట్‌లో కలిపేసుకున్నారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘రిజర్వు ఫారెస్టులో ‘సజ్జల’ సామ్రాజ్యం’ కథనం కడప జిల్లా వైసీపీలో కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం మేరకు... సీకేదిన్నె రెవెన్యూ పొలం సర్వే నెంబరు 1629లో 11,129.33 ఎకరాల అటవీ భూముల్లో వారు ఆక్రమించింది 42.20 ఎకరాలు కాదని, 52.20 ఎకరాలని తెలుస్తోంది. సజ్జల సోదరుడి కుమారుడి పేరుతో కడప నగర శివారులో కడప-కర్నూలు జాతీయ రహదారికి ఆనుకుని పట్టా భూములు ఉన్నాయి. వీటిలో కొన్ని డీకేటీ భూములు, ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
ఇడుపులపాయలో జగన్ కుటుంబానికి ఉన్న ఎస్టేట్ మాదిరిగానే ఇక్కడ కూడా తయారు చేశారని చెబుతున్నారు. ఎస్టేట్ ప్రధాన గేట్ ఎదురుగా సర్వే నెంబర్ 1612లో 5.18 ఎకరాల చుక్కల భూమి ఉంది. ఇందులో రాజానాయక్ భార్య బుక్కేదేవి పేరిట 34 సెంట్లు, బుక్కే ముత్యాలమ్మ పేరిట 1.30 ఎకరాలను 1993లో ప్రభుత్వం ఇచ్చింది. రాజానాయక్ భూములను కబ్జా చేసి సజ్జల ఎస్టేట్‌లో కలిపేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే... ‘ఏం చేసుకుంటావో చేసుకో’ అంటూ బెదిరించారు. రాజానాయక్ ఇటీవల సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం సంచలనం రేపింది. పలువురు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేయాల్సి ఉంది. కేంద్రమంత్రి జితేంద్రసింగ్ కడప కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష, సీకేదిన్నె మండలంలో పర్యటన ఉండడంతో జిల్లా యంత్రాంగం అంతా ఆయన వెంటే ఉన్నారు. సీకేదిన్నె మండలంలో మంత్రి పర్యటన ముగిశాక రెవెన్యూ, అటవీ అధికారులు వెళ్లి సర్వే చేపట్టారు. మీడియా ప్రతినిధులు అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడి సిబ్బంది గేట్లు వేసి అడ్డుకున్నారు.
విచారణకు పవన్ ఆదేశం
కడప జిల్లా సీకే దిన్నె మండల పరిధిలో సజ్జల కుటుంబం ఆక్రమణలో రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయని ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారులను ఆదేశించారుఏ మేరకు అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి? ఎవరు స్వాధీనం చేసుకున్నారు? అక్కడ వన్యప్రాణులకు హాని కలిగిందా? వంటి వివరాలతో నివేదిక ఇవ్వాలని పీసీసీఎ్‌ఫను ఆదేశించారు. అటవీ భూముల అన్యాక్రాంతంపై విచారణ చేయాలని కడప జిల్లా కలెక్టర్‌కు దిశానిర్దేశం చేశారు.