Share News

RTC Bus: సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌!

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:40 AM

డ్రైవర్‌ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడమే ప్రమాదానికి కారణమని బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. కడప జిల్లా జమ్మలమడుగు డిపోకు చెందిన ఏపీ 39 యూవీ 4299 నంబరు గల...

 RTC Bus: సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌!

  • ఆర్టీసీ బస్సు బోల్తా.. 16 మందికి గాయాలు

  • నంద్యాల జిల్లాలో ఘటన

కొలిమిగుండ్ల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో మంగళవారం ఆర్టీసీ అద్దె బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 16 మందికి గాయాలు కాగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడమే ప్రమాదానికి కారణమని బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. కడప జిల్లా జమ్మలమడుగు డిపోకు చెందిన ఏపీ 39 యూవీ 4299 నంబరు గల ఆర్టీసీ బస్సు 34 మంది ప్రయాణికులతో కొలిమిగుండ్ల మీదుగా అనంతపురం జిల్లా తాడిపత్రికి బయల్దేరింది. కొలిమిగుండ్ల మండలం కల్వటాల సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కనే పదడుగుల లోతున ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు హాహాకారాలు చేశారు. పక్కనే పొలాల్లో పనిచేస్తున్న కూలీలతో పాటు, అదే రహదారిలో వెళ్తున్న వారు అప్రమత్తమై బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. నందిపాడుకు చెందిన సుబ్బలక్ష్మమ్మ, రామలక్ష్మమ్మ, డ్రైవర్‌ మహబూబ్‌ బాషా, మరో మహిళకు తీవ్ర గాయాలు కాగా, మరో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొలిమిగుండ్ల ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి 11 మందిని మెరుగైన వైద్యం కోసం అవుకు క్లస్టర్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సుబ్బలక్ష్మమ్మ, రామలక్ష్మమ్మలను కర్నూలు జీజీహెచ్‌కు తరలించినట్లు కొలిమిగుండ్ల సీఐ రమే్‌షబాబు తెలిపారు. ఘటనపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డితో పాటు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి ప్రసాద్‌రెడ్డి ఆరాతీశారు. స్థానిక ఆర్టీసీ అధికారులతో పాటు వైద్యాధికారులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రులు పోలీసులను ఆదేశించారు.

Updated Date - Mar 05 , 2025 | 03:40 AM