Share News

Road Accident Rajahmundry: డివైడర్‌ దాటొచ్చి.. కారును ఢీకొట్టి..

ABN , Publish Date - May 27 , 2025 | 05:42 AM

రాజమండ్రి గామన్‌ వంతెనపై లారీ డివైడర్‌ దాటి కారును ఢీకొట్టిన దారుణ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వారు మనవరాలి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Road Accident Rajahmundry: డివైడర్‌ దాటొచ్చి.. కారును ఢీకొట్టి..

  • రాజమండ్రి గామన్‌ వంతెన హైవేపై లారీ బీభత్సం

  • నలుగురి దుర్మరణం.. ఒకరి పరిస్థితి విషమం

  • మృతుల్లో ఇద్దరు వయో వృద్ధులు

  • మనవరాలి పుట్టినరోజుకు కాకినాడకు వెళ్తుండగా ఘటన

రాజమహేంద్రవరం, మే 26(ఆంధ్రజ్యోతి): కాకినాడలో చదువుకుంటున్న మనవరాలి పుట్టినరోజు సందర్భంగా.. ఆమెను కలిసి ఆశీస్సులు అందించేందుకు ఆ తాతయ్య, అమ్మమ్మలు.. మరో ముగ్గురితో కలిసి కారులో బయలుదేరారు. అయితే, వీరు బయలుదేరిన పది నిమిషాలకే.. మృత్యువు బొగ్గు లారీ రూపంలో ఎదురొచ్చింది. రాజమండ్రి గామన్‌ బ్రిడ్జి హైవేపై లారీ అదుపుతప్పి డివైడర్‌ను దాటి.. పక్కరోడ్డులో ఎదురుగా వస్తున్న వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలివీ.. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలానికి చెందిన ఉప్పులూరి వరప్రసాద్‌(60) భార్య శివలీలావతి(56)తో కలిసి కొవ్వూరులో నివాసం ఉంటూ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె భవానీ ఏడేళ్లక్రితం విద్యుదాఘాతంలో మరణించింది. భవానీకి కుమార్తె భువనేశ్వరి, కుమారుడు శంకర్‌ ఉన్నారు. కూతురి మరణంతో మనవళ్ల సంరక్షణ భారం వీరిపై పడింది. వీళ్ల భాగస్వామ్యంతోపాటు బంధుమిత్రుల సాయంతో ఇద్దరినీ చదివిస్తున్నారు. సోమవారం భువనేశ్వరి పుట్టినరోజు. కాకినాడలో చదువుకుంటోన్న ఆమె వద్దకు ఉదయం 9గంటల సమయంలో కొవ్వూరు నుంచి కారులో బయలుదేరారు.


ఆమెకు ఇష్టమైన తినుబండారాలు సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. కారులో వరప్రసాద్‌ దంపతులతోపాటు పక్కింటివారైన.. చాగల్లు మండలానికి చెందిన లక్కంసాని సురేశ్‌(అవంతి ఫీడ్స్‌ ఉద్యోగి), బిందు(34) దంపతులు, చాగల్లు మండలం మార్కొండపాడుకు చెందిన శివలీలావతి తల్లి ఉప్పులూరి వీరవెంకట సత్యవతి(75) ఉన్నారు. వరప్రసాద్‌ కారు డ్రైవింగ్‌లో ఉన్నాడు. గామన్‌ వంతెన హైవే రోడ్డులో ఎడమవైపు లైన్‌లో ఆటోనగర్‌ జంక్షన్‌ దగ్గర్లోకి వచ్చారు. పక్కనే కుడివైపు రోడ్డులో దివాన్‌చెరువు వైపునుంచి వచ్చే వాహనాలను ఆటోనగర్‌ జంక్షన్‌వద్ద రోడ్డు రవాణా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో బొగ్గు లోడుతో విశాఖ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న లారీ వస్తోంది. వాహనాల తనిఖీలు గమనించిన లారీ డ్రైవర్‌ కంగారులో సడెన్‌ బ్రేక్‌ వేశాడు. వాహనంలో 30 టన్నులకుపైగా బొగ్గు లోడు ఉండడంతో వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో లారీ డివైడరును దాటి అవతలి లైన్‌లో వస్తున్న కారును ఢీకొట్టి పది మీటర్ల మేర నెట్టుకుపోయింది. చిన్న చెట్టు అడ్డు రావడంతో చెట్టుకు లారీకి మధ్య కారు నలిగిపోయింది. దీంతో కారులో ఉన్న వరప్రసాద్‌, సత్యవతి, బిందు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. లీలావతి ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికి మరణించగా.. సురేశ్‌ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 27 , 2025 | 05:44 AM