Amaravati: 10 కోట్ల ప్రభుత్వ భూమిని కోటిన్నరకే కొట్టేయాలని..
ABN , Publish Date - Jul 03 , 2025 | 06:01 AM
అది.. అమరావతి రాజధానికి ఆనుకుని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రాంతం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా విల్లాలు నిర్మించుకునేందుకు అక్కడ ఉన్న ఖరీదైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిపై ఓ సంస్థ నిర్వాహకులు కన్నేశారు......

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సొంతం చేసుకునేందుకు ప్లాన్
వెంచర్‌కు రోడ్ల నిర్మాణం పేరిట మార్కెట్ విలువకు ఇవ్వాలని అర్జీ
అభ్యంతరాలుంటే తెలపాలని
తాడేపల్లి తహసీల్దార్ నోటీసు జారీ
(గుంటూరు-ఆంధ్రజ్యోతి): అది.. అమరావతి రాజధానికి ఆనుకుని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రాంతం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా విల్లాలు నిర్మించుకునేందుకు అక్కడ ఉన్న ఖరీదైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిపై ఓ సంస్థ నిర్వాహకులు కన్నేశారు. కారు చౌకగా హస్తగతం చేసుకునేందుకు పథకం సిద్ధం చేశారు. ఆ భూముల వాస్తవ విలువ దాదాపు రూ.10 కోట్లు కాగా, మార్కెట్ విలువ పేరుతో కేవలం రూ.కోటిన్నరకే కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సదరు రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత సోదరుడు గోదావరి జిల్లాలకు చెందిన ఓ ఎమ్మెల్యే. దీంతో భూమి కట్టబెట్టేందుకు స్థానిక రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారు. చుట్టుపక్కల పొలాలకు చెందిన రైతులు ఈ తంతుకు అడ్డుపడుతూ స్థానిక తహసీల్దార్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాడేపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 255, 275-1ఏ, 302, 316-1 సరిహద్దుల్లో రెండు ఎకరాలా నాలుగు సెంట్ల ప్రభుత్వ భూమిని విల్లాలు, అపార్ట్‌మెంట్లకు అవసరమైన రహదారుల సౌకర్యాల నిమిత్తం మార్కెట్ విలువ ప్రకారం విక్రయించాల్సిందిగా కోరుతూ విష్ణు ప్రియ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అర్జీ దాఖలు చేసినట్లు, దీనిపై అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోగా తెలియజేయాల్సిందిగా తాడేపల్లి తహసీల్దారు ప్రకటన జారీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఏ1 నోటీసును ఆ ప్రాంతంలోని వార్డు సచివాలయం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం, తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద బోర్డులో ప్రచురించారు. చట్టం ముసుగులో ఈ స్థలాలను తమ స్వాధీనంలోకి తీసుకునేందుకు రియల్ ఎస్టేట్ నిర్వాహకులు పావులు కదిపారు. ఎమ్మెల్యే కుటుంబీకులు కావడంతో అధికారులు కూడా దీనికి అవసరమైన ప్రక్రియను వేగంగా ప్రారంభించారు. ఈ రెండు ఎకరాలా నాలుగు సెంట్లు కూడా ఒకేబిట్టుగా లేదు. 255 సర్వే నంబర్‌లో 45 సెంట్లు, 275-1ఏలో 17 సెంట్లు, 302లో 44 సెంట్లు, 316-1లో 98 సెంట్లుగా ఉంది. ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.10 కోట్ల వరకు పలుకుతుందని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ రికార్డుల ప్రకారం మార్కెట్ విలువ సుమారు రూ.కోటిన్నర ఉంటుందని తెలుస్తోంది. ఆ మొత్తం చెల్లించి ఈ భూములను చేజిక్కించుకునేందుకు రియల్ ఎస్టేట్ నిర్వాహకులు తొలి అడుగు వేశారు. ఈ భూముల్లో కొంత మేరకు వెంచర్‌కు అవతలి వైపు ఉన్న పొలాలకు వెళ్లేందుకు డొంక రోడ్డు మార్గంగా ప్రస్తుతం ఉపయోగపడుతున్నది. డొంక రోడ్లుగా ఉపయోగ పడుతున్న ప్రభుత్వ భూములను అమ్మేందుకు వీల్లేదని ఇప్పటికే ఆ ప్రాంత రైతులు స్థానిక తహసీల్దార్‌కు, కలెక్టర్‌కు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
అయితే రైతులను ఏదోవిధంగా ఒప్పించి ఫిర్యాదులు వెనక్కి తీసుకునేలా చేయాలని రియల్ ఎస్టేట్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్న రోడ్డు మార్గం వంకలుగా ఉందని, ఈ భూమిని తాము కొనుక్కునేందుకు అంగీకరిస్తే నేరుగా వెళ్లేందుకు తమ వెంచర్ పక్కన వేరే మార్గం వేస్తామని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. భూముల విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.