Share News

Private Contracts Tourism: ప్రైవేటుకు పర్యాటకం

ABN , Publish Date - May 24 , 2025 | 04:50 AM

ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ యూనిట్లను ప్రైవేటుకు అప్పగించేందుకు ఉన్నతాధికారి చర్యలతో తీవ్ర వ్యతిరేకత చెలరేగుతోంది. మౌలిక వసతులు కల్పించకుండా నష్టాల బూచిచూపుతూ ప్రైవేటు జపం చేస్తూ ఉద్యోగ సంఘాల ఆందోళనకు దారి తీశారు.

 Private Contracts Tourism: ప్రైవేటుకు పర్యాటకం

  • యూనిట్ల అప్పగింతకు ఓ అధికారి అత్యుత్సాహం.. పది నెలలుగా పైసా విదల్చకుండా యూనిట్ల నిర్వీర్యం

  • నష్టాల బూచిచూపి ఏపీటీడీసీ అధికారులపై ఒత్తిడి

  • సీఎం చంద్రబాబు సూచనలకు విరుద్ధంగా ఆదేశాలు

  • అదీ 20 రోజులే డెడ్‌లైన్‌.. ఏపీటీడీసీలో వ్యతిరేకత

(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

పర్యాటక యూనిట్లను తక్షణం ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టాలట. దీనికి 20 రోజులే డెడ్‌లైన్‌. సిబ్బంది గురించి అనవసరం. వచ్చిన వాళ్లు కొనసాగిస్తే ఉంటారు.. లేకపోతే పోతారట! రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థానంలో ఉన్న ఒక కార్యదర్శి నోటి నుంచి వచ్చిన ఆదేశాలు ఇవి! పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆలోచనలను పంచుకోకుండా.. గత పది నెలలుగా పర్యాటక యూనిట్లకు ఎలాంటి ఆర్థిక సహకారం ఇవ్వని ఆ అధికారి.. నష్టాల బూచి చూపి ప్రైవేటుకు అడ్డగోలుగా కట్టబెట్టేందుకు ఏపీటీడీసీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలకు విరుద్ధంగా, సామాన్యులకు పర్యాటకాన్ని దూరం చేసేలా పర్యాటక యూనిట్లను ప్రైవేటుకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఏపీటీడీసీలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ అధికారి నిర్వాకం కారణంగా యూనిట్లన్నీ ప్రైవేటు కోరల్లో చిక్కుకునే పరిస్థితి నెలకొంది. పర్యాటకం అభివృద్ధి అంటే పర్యాటక యూనిట్లను పూర్తిగా ప్రైవేటు పరం చేయటమా? కనీస మౌలిక వసతుల గురించి పట్టించుకోరా? అన్న విమర్శలు వస్తున్నాయి. పదవీ విరమణ చేస్తున్న దశలో మరికొంత కాలం ఎక్స్‌టెన్షన్‌ పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆ అధికారి తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రతిపాదనలు బుట్టదాఖలు

విజయవాడ డివిజన్‌ పరిధిలో కొండపల్లి దగ్గర షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఉంది. దీనికి సమీపంలో మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తే.. ఆ దారిలో వాహనాలలో వెళ్లే వారు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ఆగే అవకాశముంది. షాపులను ఏ దుకాణాలకు ఇచ్చినా మంచి వ్యాపారం జరుగుతుంది. మంచి సెంటర్‌గా మారుతుంది. దీని గురించి ప్రతిపాదనలు పంపితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. దీని ద్వారా డబ్బులు వచ్చే అవకాశాన్ని వదిలిపెట్టేశారు. కొద్దిగా నిధులు ఖర్చు చేసి దీనిని వినియోగంలోకి తీసుకువస్తే వచ్చే ఆదాయం ద్వారా ఐదారు నెలల్లోనే పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది. ఈ పనులు కూడా చేయకపోతే పర్యాటకాభివృద్ధి సంస్థ ఎందుకో ఆ అధికారే చెప్పాలి.

Updated Date - May 24 , 2025 | 04:51 AM