Share News

Teacher Assignments: ప్రాథమికోన్నత స్కూళ్లలో ఎస్జీటీలా

ABN , Publish Date - Apr 19 , 2025 | 03:28 AM

ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎసీజీటీల కేటాయింపు ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తాయి. 6 నుంచి 8 తరగతులకు ఎసీజీటీలతో బోధించడంపై పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

Teacher Assignments: ప్రాథమికోన్నత స్కూళ్లలో ఎస్జీటీలా

  • 6 నుంచి 8 తరగతులకు స్కూల్‌ అసిస్టెంట్లు బోధించాలని టీచర్ల పట్టు

  • తాజా ప్రతిపాదనపై గరంగరం.. పాఠశాలల ఆధారంగా ఎస్జీటీల కేటాయింపు

  • మోడల్‌ ప్రైమరీ స్కూళ్లకు హెచ్‌ఎం పోస్టు.. ఫౌండేషనల్‌ స్కూల్‌లో 30:1గా నియామకం

  • జీవో 117కు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు.. సరికాదంటున్న ఉపాధ్యాయ వర్గాలు

  • ఎస్జీటీలతో బోధించడం ఏంటని గతంలోనూ విమర్శలు.. గుర్తుచేస్తున్న టీచర్లు

టీచర్ల కేటాయింపు విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయాలపై ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ప్రాథమికోన్నత పాఠశాలలకు కేవలం సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్జీటీ)నే ఇవ్వడం సరికాదనే వాదన వినిపిస్తోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117కు పాఠశాల విద్యాశాఖ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాని ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి 8 తరగతులకు కూడా ఎస్జీటీలే బోధిస్తారు. వైసీపీ హయాంలో ప్రవేశ పెట్టిన ఈ విధానంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా తక్కువ మంది ఉన్న చోట్ల అప్పటి ప్రభుత్వం మొత్తం ఎస్జీటీలనే కేటాయించింది. ఎక్కువ మంది విద్యార్థులుంటే స్కూల్‌ అసిస్టెంట్లను నియమించింది. 6వ తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లు బోధించాల్సి ఉంటుంది. కానీ, ఎస్జీటీలతో బోధించడం ఏంటని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు దాదాపు 700 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా మార్చారు. ప్రాథమికోన్నత పాఠశాలలుగానే మిగిలిన వాటిలో మాత్రం 6 నుంచి 8 తరగతులకు ఎస్జీటీలను కేటాయించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. దీంతో దాదాపు 1200 ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధనపై ప్రతికూల ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే, ప్రాథమిక తరగతుల బోధనకు ఎస్జీటీల కేటాయింపులోనూ మూడు రకాల విధానాలు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. కొత్తగా 1,557 ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులను కూడా చేర్చారు. ఇక, 1 నుంచి 5 తరగతుల్లో 10 మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్జీటీలను కేటాయించారు. 11 నుంచి 30 మంది విద్యార్థులుంటే ముగ్గురు, 31 నుంచి 40 మంది విద్యార్థులుంటే నలుగురు, 40 మంది దాటితే ఐదుగురు ఎస్జీటీలను నియమిస్తారు.


ఫౌండేషన్‌ పాఠశాలల్లో ఇలా..

కేవలం 1, 2 తరగతులు మాత్రమే ఉండే ఫౌండేషన్‌ పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీని ఇస్తారు. 31 నుంచి 60 మంది వరకు ఇద్దరు ఎస్జీటీలను కేటాయిస్తారు. 1 నుంచి 5 తరగతులుండే బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌లో 20 మంది విద్యార్థుల వరకు ఒక టీచర్‌ను ఇస్తారు. 21 నుంచి 60 మందికి ఇద్దరిని నియమిస్తారు. ఇలా ప్రాథమిక తరగతులకు టీచర్ల కేటాయింపులో వ్యత్యాసం ఉండటంపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు మోడల్‌ ప్రైమరీ స్కూల్‌లో 59 మంది విద్యార్థులకు నలుగురు ఎస్జీటీలను కేటాయిస్తారు. మిగులు టీచర్లు ఉంటే ఐదో టీచర్‌ను హెడ్‌ మాస్టర్‌(హెచ్‌ఎం)గా నియమిస్తారు. 150 మంది దాటితే ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీని ఇస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో నలుగురు ఎస్జీటీలను కేటాయిస్తారు. ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే హెచ్‌ఎం, పీఈటీ పోస్టు ఇవ్వరు. ఆ పాఠశాలల్లో సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ హెచ్‌ఎంగా వ్యవహరిస్తారు. 75 మంది విద్యార్థులు దాటే ఉన్నత పాఠశాలలకు హెచ్‌ఎం, పీఈటీ పోస్టులు కేటాయిస్తారు. 400 మంది విద్యార్థులు దాటితే రెండో పీఈటీ, 751 దాటితే మూడో పీఈటీ, ఆ తర్వాత ప్రతి 350 మంది విద్యార్థులకు ఒక పీఈటీ పోస్టు ఇస్తారు. ఈ విధానాలపైనే ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

-(అమరావతి-ఆంధ్రజ్యోతి)

Updated Date - Apr 19 , 2025 | 03:30 AM