Share News

CM Chandrababu: గత పాలన సైకో పాలన.. ఆర్థిక విధ్వంసం చేసి అందరినీ ఇబ్బంది పెట్టారు

ABN , Publish Date - Aug 02 , 2025 | 01:28 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలు సైకో పాలన చూశారని, గత పాలకులు పెన్షన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టి, ఆర్థిక విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Chandrababu:  గత పాలన సైకో పాలన.. ఆర్థిక విధ్వంసం చేసి అందరినీ ఇబ్బంది పెట్టారు
CM Chandrababu And YS Jagan

ప్రకాశం జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు పెన్షన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారని, ఎన్నికల ముందు రాక్షస పాలన చూశామని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఇబ్బందిపడుతూ పెన్షన్లు పెంచారని అయితే కూటమి పాలనలో ఒక్కసారే పెన్షన్లు పెంచామని ప్రజలకు వివరించారు. ఐదేళ్లు ఏపీ ప్రజలు సైకో పాలన చూశారని సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశారు. గత పాలనలో అందరినీ ఇబ్బందిపెట్టారని.. అందుకే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ పొత్తు కోసం ముందుకువచ్చారని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


పశువువా లేకా మనిషా: చంద్రబాబు

అమరావతి ఆడబిడ్డలపై జగన్ తన దినపత్రికలో దారుణంగా చిత్రీకరించారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ పొదిలి వచ్చిన సమయంలో ఆడబిడ్డలు క్షమాపణ చెప్పమని అడిగారని అయితే, వారిపై దౌర్జన్యం చేశారని చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యక్తి గత జీవితాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే విమర్శించాడని.. అతను పశువువా లేకా మనిషా అర్థం కావడం లేదని చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. నేనైతే మరోసారి అలాంటివి జరగకుండా మందలించేవాడిని అని కానీ జగన్ ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పరామర్శించాడని అన్నారు. అవసరమైతే ఇళ్లల్లోకి వెళ్లి టీడీపీ వాళ్ళని లేపేస్తామని జగన్ అన్నాడని, నేను ఒకసారి ఏమారితే నారాసుర రక్త చరిత్ర అని జగన్ తన పత్రికలో రాశారని చంద్రబాబు కామెంట్స్ చేశారు.

బూతుల పంచాంగం నేర్చుకుంటున్నారు

గుంటూరులో జగన్ కారు కింద కార్యకర్తలు పడితే చికిత్స చేయకుండా పక్కన పడేశారన్నారు. జగన్‌ని చూసి వారి నాయకులు, కార్యకర్తలు గొడ్డలి వేట్లు, బూతుల పంచాంగం, రప్పారప్పా అంటూ నేర్చుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. జగన్ లేపేస్తే చూస్తూ ఊరుకోమని ఇక్కడ ఉండేది సీబీఎన్ అని చంద్రబాబు హెచ్చరించారు. గతంలో తీవ్ర వాదులు, ముఠా నాయకులపై పోరాడానని, ఇప్పుడు ఇలాంటి నేరస్తులు రాజకీయ ముసుగులో వస్తున్నారని.. ఆ ముసుగులు తొలగించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఇంటికో వ్యాపారవేత్త

ప్రకాశం జిల్లాలో సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకానికి దర్శి నియోజకవర్గం తూర్పువీరాయపాలెం గ్రామం నుంచి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటికి ఒక వ్యాపారవేత్తని తయారు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఇంటికొక సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయాలని ఆలోచన చేశామని, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సాఫ్ట్‌వేర్ మనవాళ్లే ఉన్నారన్నారు.

వాట్సాప్ గవర్నెన్స్

అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడతామని కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రంగా రీజనల్ కేంద్రాలు పెడతామని, ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తామని తెలిపారు. ఏ సర్టిఫికెట్ కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు.


ప్రకృతి సేద్యంతోనే ఆరోగ్యం

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తీసుకువచ్చినట్లు చెప్పిన సీఎం చంద్రబాబు రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. పంటలకు ఎరువులు ఎక్కువ వేయడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని కాబట్టి, ప్రకృతి సేద్యమే ఆరోగ్యానికి మంచిదని వివరించారు. రైతు కూలీలు చిక్కడం లేదని వ్యవసాయంలో టెక్నాలజీని తీసుకొచ్చామన్నారు. అమెరికా పెంచిన టారిఫ్ వలన ఆక్వా రైతులకు ఇబ్బందని, దీనిపై ఆక్వా రైతులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

నదులు అనుసంధానం చేస్తాం

రాష్ట్రంలో 1000 టీఎంసీల నీటితో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయని, రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేయడానికి నదులు అనుసంధానం చేస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో గుండ్లకమ్మ గేట్లు కూడా రిపేరు చేయలేదని, తాము గుండ్లకమ్మ గేట్లు పెట్టడంతో పాటు నీళ్లు నిల్వ చేశామని తెలిపారు. 1995-96లో వెలుగొండ ప్రాజెక్ట్ తానే ప్రారంభించానని, వెలుగొండ పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు.


2047 టార్గెట్

సమైక్యాంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశానని, ఎవరికి ఆ అవకాశం రాలేదని తెలిపారు. తాను చేసిన అభివృద్ధి వలన హైదరాబాద్ దేశానికి తలమానికం అయ్యిందని, హైదరాబాద్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన తర్వాతే అందరూ అన్నం తిన్నారని గుర్తు చేశారు. గతంలో డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లోనే బిఎస్ఎన్ఎల్ ఫోన్లు ఉండేవని, కానీ ఇప్పుడు అందరికీ చేతుల్లోకి సెల్‌ఫోన్లు వచ్చాయని తెలిపారు. 2047కి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ని తయారు చెయ్యాలని సీఎం చంద్రబాబు అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

గత పాలన సైకో పాలన.. ఆర్థిక విధ్వంసం చేసి అందరినీ ఇబ్బంది పెట్టారు

అవినీతికి కేరాఫ్‌గా మారిన ఆర్డీవో కార్యాలయం

Read Latest AP News and National News

Updated Date - Aug 02 , 2025 | 03:02 PM