AP Mining: ఏపీలో గనుల సీనరేజీ పాలసీ సరళీకృతం.. అన్ని జిల్లాల్లో మైనింగ్ కార్యాలయాలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 01:47 PM
ఏపీలో గనుల సీనరేజీ పాలసీ సరళీకృతం చేస్తున్నామని.. అన్ని జిల్లాల్లో మైనింగ్ కార్యాలయాలు నిర్మిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇసుక అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నామని మంత్రి చెప్పారు.
ఒంగోలు (ప్రకాశం జిల్లా), నవంబర్ 23: ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లా మైన్స్ అండ్ జియాలజి నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ భూమి పూజ నిర్వహించారు. ఏపీలో గనుల సీనరేజీ పాలసీ తెస్తున్నామని.. అన్ని జిల్లాల్లో మైనింగ్ కార్యాలయాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
అనంతరం మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర పలు అంశాలు ప్రస్తావించారు. 'జగన్ ప్రభుత్వంలో మైనింగ్‌లో దోచుకున్నారు. గత ప్రభుత్వంలో మైనింగ్‌పై ఆధారపడిన వాళ్లకి ప్రతిరోజు దిన దిన గండంగా గడిచింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా ముందుకెళ్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో బలవంతంగా లాక్కున్న మైన్స్‌ని తిరిగి ప్రారంభించాం. ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఇసుక అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నాం.' అని మంత్రి తెలిపారు.
విశాఖలో జరిగిన సమ్మిట్‌లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. 'గత ఐదేళ్లలో వచ్చిన పెట్టుబడులను తరిమేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు తిరిగి నమ్మకం కలిగించారు. ప్రకాశం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు రాబోతున్నాయి. వచ్చిన పెట్టుబడులతో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుంది. గనుల సీనరేజీ పాలసీని గత ప్రభుత్వంలో తీసుకువచ్చారు.దాన్ని సరళీకృతం చేస్తాం. నకిలీ మద్యం వ్యవహారం దురదృష్టకరం. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చెయ్యాలని దురుద్దేశంతో నకిలీ మద్యం తయారు చేశారు. మద్యంలో గతంలో వాళ్ళు చేసిన స్కాం బయటకి తీస్తున్నాం. కీలకమైన వ్యక్తుల అరెస్టులు జరుగుతున్నాయి. నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ జరుగుతోంది. అందులో ఎంతటి వారున్నా వదిలిపెట్టే సమస్య లేదు. మద్యం షాపుల్లో బార్ కోడ్ స్కానింగ్ పెట్టాం. బార్ కోడ్ స్కానింగ్ పెట్టిన తరువాత నకిలీ బాటిల్స్ బయటపడలేదు.' అని మంత్రి చెప్పారు.
కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బి.ఎన్.విజయ్ కుమార్, ఉగ్ర నరసింహ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రాంబాబు రాజు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..
Read Latest AP News And Telugu News