Jagananna Bhu Raksha: హద్దులు చెరిపి..
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:22 AM
జగనన్న భూరక్ష పేరుతో ఆనాడు చేపట్టిన హద్దురాళ్ల సరఫరా కాంట్రాక్టును ఆయన చేజిక్కించుకుని..

కూటమి నేతలతో చెలిమికి తీవ్ర ప్రయత్నాలు
వైసీపీ హయాంలో అడ్డగోలుగా కాంట్రాక్ట్ పట్టారు
చాలావరకు బిల్లులు అప్పుడే లాగేసుకున్నారు
మిగతాదీ రాబట్టుకునేందుకు వింత విన్యాసం
గుంటూరు జిల్లాలో ఆ నాయకుని తీరుపై చర్చ
(గుంటూరు - ఆంధ్రజ్యోతి): జగనన్న భూరక్ష పేరుతో ఆనాడు చేపట్టిన హద్దురాళ్ల సరఫరా కాంట్రాక్టును ఆయన చేజిక్కించుకుని.. చాలావరకు బిల్లులు చేరుకున్నారు. ఇంకా తనకు ఆరు కోట్లు రావాల్సి ఉందని చెబుతున్న ఆయన.. ఆ మొత్తం రాబట్టుకునేందుకు వింత రాజకీయ విన్యాసం మొదలుపెట్టారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సఖ్యతగా ఉండేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీనికోసం గుంటూరు జిల్లా సమీక్షామండలి, జిల్లాపరిషత్తు తదితర సమావేశాలకు ఠంచనుగా హాజరవుతున్నారని తెలిసింది. ఒకదశలో ఆయన వైసీపీని వీడతారని కూడా ప్రచారం జరిగింది. ఆయన సన్నిహితులు ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. ఆ వివరాల్లోకి వెళితే.. జగనన్న భూరక్ష పథకం అమలులో నాటి జగన్ ప్రభుత్వం అన్ని నిబంధనలను తుంగలోకి తొక్కింది. గుంటూరు జిల్లాలో 58 గ్రామాల్లో రీసర్వే చేసి 83,770 హద్దురాళ్లను జగన్ బొమ్మతో ఏర్పాటు చేసింది. అలానే బాపట్ల జిల్లాలో 110 గ్రామాల్లో 1,60,147 హద్దురాళ్లను రైతుల భూముల్లో పాతింది. పల్నాడు జిల్లాలో అయితే అత్యధికంగా 214 గ్రామాల్లో 4 లక్షల 16 వేల 64 హద్దు రాళ్లను వేసింది. ఇందుకోసం రూ. 55 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా పనిని చేపట్టాలన్నా, ఏవైనా సమకూర్చుకోవాలన్నా ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అవలంభించాలి. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో సర్వే హద్దురాళ్లు సరఫరా చేసేందుకు ఆ పార్టీకి చెందిన నేతలకే దక్కేలా నిబంధనలను సవరించారు. వేరొకరిని టెండర్లు వేయకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఆ విధంగా కొన్ని జిల్లాలకు సర్వే హద్దు రాళ్లు సరఫరా చేసే కాంట్రాక్టుని గుం టూరు నగరానికి చెందిన ఆ వైసీపీ నేతకు దక్కిం ది. వైసీపీ ప్రభుత్వంలో ఆయన నామినేటెడ్ పదవులు పొందారు. 2019 ఎన్నికల సమయంలో తాను ఆర్థికంగా నష్టపోయానని చెప్పి గుట్టుచప్పుడు కాకుండా భూముల రీసర్వే ప్రాజెక్టులో హద్దురాళ్ల సరఫరా కాంట్రాక్టును పొందారు. ప్రకాశం జిల్లా బల్లికురవలో ఒక ఫ్యాక్టరీని తీసుకొని హద్దురాళ్లను కొన్ని జిల్లాలకు సరఫరా చేశారు.
ఈ క్రమంలో తాడేపల్లి ప్యాలె్‌సకు కూడా పర్సంటేజీలు చేరాయి. ఆయన ప్రత్యేక యం త్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని ప్రకాశం జిల్లా బల్లికురవలోని గనుల నుంచి ముడి పదార్థాన్ని సేకరించి అక్కడే హద్దురాళ్లను తయారు చేసి వాటిపై జగన్ బొమ్మలు ముద్రించి సరఫరా చేశారు. ఇందుకోసం రూ. కోట్లలోనే లబ్ధి పొందారు. బిల్లులను ఎన్నికలకు ముందుగానే పాస్ చేయించుకొన్నారు. కొన్ని పెండింగ్‌లో ఉండటంతో ఎలాగైనా పొందాలన్న ఉద్దేశంతోనే ఆయన కూటమి నేతలతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..