Nimmala Ramanaidu: బనకచర్లతో తెలంగాణకు నష్టం లేదు
ABN , Publish Date - Jun 18 , 2025 | 03:50 AM
అనుమతులన్నీ పొందాకే పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం నిర్మిస్తామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టమూలేదన్నారు.

రాజకీయ దురుద్దేశాలతోనే ఆ రాష్ట్ర నేతల ఫిర్యాదులు
కాళేశ్వరం అవినీతిపై విచారణను పక్కదోవ పట్టించేందుకే: నిమ్మల
కడలిపాలయ్యే వరద జలాలనే తరలిస్తాం
అనుమతులన్నీ పొందాకే పథకం నిర్మిస్తాం
జగన్ నోరు విప్పడం లేదెందుకు?
గోదావరి- కృష్ణా అనుసంధానంపై ఆయన, కేసీఆర్ అవగాహనకు రాలేదా?
రోజుకు 4 చొప్పున 100 రోజుల్లో 400 టీఎంసీలు తరలిస్తామనలేదా?
బోర్డుల అనుమతుల్లేకుండా తెలంగాణ ప్రాజెక్టులు నిర్మించలేదా?
బాబు అడ్డుకుని ఉంటే అవి పూర్తయ్యేవా?
నిలదీసిన మంత్రి రామానాయుడు
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): అనుమతులన్నీ పొందాకే పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం నిర్మిస్తామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టమూలేదన్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న వరద నీటిని మాత్రమే తరలిస్తామని చెప్పారు. రాజకీయ దురుద్దేశాలతోనే తెలంగాణ నేతలు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నార ని ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు సీఎం చం ద్రబాబు వ్యతిరేకం కాదని.. అందుకే కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులను అక్కడి ప్రభుత్వం పూర్తి చేసుకోగలిగిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణను డైవర్ట్ చేసేందుకే బీఆర్‌ఎస్ నేతలు బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారని తె లిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో పోలవరం-బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంలో గోదావరి జలాలను తెలంగాణ భూభాగం నుంచి నాగార్జునసాగ ర్, శ్రీశైలం జలాశయాలకు రోజు కు 4 టీఎంసీల చొప్పున వంద రోజుల పాటు 400 టీఎంసీలను తరలిస్తామని.. నాటి ఉభయ రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ఉమ్మడిగా ప్రకటించలేదా అని నిలదీశారు. రాష్ట్రానికి ద్రోహం చేసేలా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతుంటే.. మాజీ సీఎం జగన్ ఎందు కు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ అసెంబ్లీలో, రాయలసీమ ప్రాంతం నగరిలో, అమరావతిలో జగన్‌ను కేసీఆర్ కలిసిన సందర్భంలోనూ.. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాల్లో 1000 టీఎంసీలను అనుసంధానం ద్వారా మళ్లిస్తేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని అన్నారని.. ఆ మాటలను ఇప్పు డు బీఆర్‌ఎస్ నేతలే ఎందు కు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు.
తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘గోదావరి, కృష్ణా బోర్డుల అనుమతులు లేకుండా కేసీఆర్ ప్రాజెక్టులను నిర్మించలేదా? విభజన చట్టానికి భిన్నంగా.. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందకుండానే ప్రాజెక్టులకు టెండర్లను పిలిచి పనులు చేయలేదా? కాళేశ్వరం, సీతారామ సాగర్ తదితర ప్రాజెక్టులను అనుమతుల్లేకుండానే చేపట్టలేదా? చంద్రబాబు అడ్డుకుని ఉంటే అవి పూర్తయ్యేవా? తెలంగాణ ప్రభుత్వం పాటించని నిబంధనలు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తిస్తాయా’ అని నిలదీశారు.
బనకచర్లతో సముద్రానికే నష్టం
నదీ జలాలపై పూర్తి హక్కులు ఉన్న దిగువ రాష్ట్రంగా ఏపీ బనకచర్ల అనుసంధాన పథకాన్ని నిర్మిస్తే.. ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు ఎలాంటి నష్టమూ ఉండదని నిమ్మల స్పష్టం చేశారు. దీని ద్వారా రోజుకు 2 టీఎంసీల వరద జలాలను 100 రోజులు తీసుకెళ్తామన్నారు. సముద్రం లో కలుస్తున్న 3,000 టీఎంసీలలో 200 టీఎంసీలు తగ్గుతాయని.. ప్రాజెక్టును నిర్మిస్తే 200 టీఎంసీలను సముద్రమే కోల్పోతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ నేతల ఆరోపణలను లోతుగా పరిశీలిస్తే.. సాంకేతికాంశాల కంటే రాజకీయాంశాల మీదే తపన ఉన్నట్లుగా ఉందన్నారు. బనకచర్లకు కావలసిన అన్ని అనుమతులనూ నిబంధనల ప్రకారం తీసుకుంటామని తెలిపారు. గత నెల 22న ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను కేంద్ర జల సంఘానికి సమర్పించామన్నారు. దీనిని జలసంఘం ఆమోదించాకే.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను తయారు చేస్తామని వెల్లడించారు. టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(టీవోఆర్) ఆమోదం కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. అవసరమైన అన్ని అనుమతులూ సాధించా కే.. టెండర్లు పిలిచి.. నిర్మాణం చేపడతామని తేల్చిచెప్పారు. ఆలోపు తెలంగాణ నేతల విమర్శలపై రాయలసీమకు చెందిన వ్యక్తిగా.. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా జగన్ నోరువిప్పాలని మంత్రి కోరారు. జగన్ మౌనం దాల్చడం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు.