Seva is the Supreme Duty: సేవే పరమ ధర్మం
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:27 AM
శ్వప్రేమకు ప్రతిరూపం భగవాన్ సత్యసాయిబాబా అని ప్రధాని మోదీ అన్నారు. సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందని.. సత్యసాయి పాటించిన ప్రేమ, సేవాభావనలు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. భక్తి, జ్ఞానం, కర్మ..
సత్యసాయి.. విశ్వ ప్రేమకు ప్రతిరూపం: ప్రధాని
కోట్ల మందిపై ఆయన ప్రేమ, సేవాభావనల ప్రభావం.. ‘అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు’ అని బోధించారు
ఆయన సంస్థలూ అదే పాటిస్తున్నాయి.. 140 దేశాల్లో కోట్ల మందికి బాబా బోధనలు వెలుగుబాట
ఆయన ప్రేరణతో కలిసి పనిచేద్దాం.. పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకల్లో మోదీ పిలుపు
సమాజాన్ని, ప్రజలను ఆదుకోవడానికి సత్యసాయి నిరంతరం తపించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రకృతి వైపరీత్యం సంభవించినా సత్యసాయి సేవాదళ్ సభ్యులు బాధితులకు సేవలందిస్తున్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో భూకంపం సమయంలో సేవాదళ్ చేసిన సేవలు నాకు బాగా గుర్తున్నాయి.
- ప్రధాని మోదీ
సత్యసాయి అరుదైన ఆధ్యాత్మిక శక్తి. భారతదేశంలో.. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో.. మరీ ముఖ్యంగా అనంతపురంలో.. ప్రపంచానికి వెలుగునిచ్చిన మహోన్నత వ్యక్తి పుట్టడం మనందరి అదృష్టం.
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
బాబా స్మారక రూ.100 నాణెం, తపాలా స్టాంపుల ఆవిష్కరణ
సత్యసాయి చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి
‘మానవ సేవే మాధవ సేవ’ అనిబోధించారు.. ఆచరించారు: సీఎం
సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు జల్ జీవన్ మిషన్‌కు అంకురం: పవన్
అనంతపురం/పుట్టపర్తి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): విశ్వప్రేమకు ప్రతిరూపం భగవాన్ సత్యసాయిబాబా అని ప్రధాని మోదీ అన్నారు. సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందని.. సత్యసాయి పాటించిన ప్రేమ, సేవాభావనలు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. భక్తి, జ్ఞానం, కర్మ.. ఈ మూడు సేవలే భారతీయ నాగరికతకు మూలమన్నారు. సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రశాంతి నిలయంలో బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం హిల్‌వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు. సీఎంతో కలిసి సత్యసాయి స్మారక రూ.100 నాణేలు, పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని ‘ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భగవాన్ శతజయంతి ఉత్సవాలను జరుపుకోవడం ఓ వరంగా, వాటిలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా, ఆయన ప్రేమ మనతోనే ఉందని చెప్పారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని అన్నారు. ఆయన బోధనలు 140 దేశాల్లో కోట్ల మందికి మార్గం చూపాయని.. ఆయన జీవితం వసుధైవ కుటుంబకం అనే భావనతో నడచిందని తెలిపారు. ‘మన భారతీయుల జీవన విధానమే సేవ, భక్తి, జ్ఞానం. ‘సేవా పరమో ధర్మః’ అనేది మన మూల జీవన విధానంలో ఉంది. అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు (లవ్ ఆల్... సర్వ్ ఆల్) అని సత్యసాయి బోధించారు. ఆయనతో పాటు ఆయన సంస్థలూ అదే పాటిస్తూ వస్తున్నాయి. కోట్ల మంది భక్తులు దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మానవ సేవే మాధవ సేవగా భావించి సేవలు అందిస్తున్నారు. సత్యసాయి చేపట్టిన తాగునీరు, వైద్యం, విద్య, విపత్తు నిర్వహణ వంటి సేవలు అనిర్వచనీయం. 3 వేల కిలోమీటర్లకు పైగా తాగునీటి పైపులను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నారు. అనేక ఆస్పత్రులు నిర్మించి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు’ అని కొనియాడారు.
బాలికలకు ఆర్థిక సాయం..
సుకన్య సమృద్ధి యోజన కింద వేల మంది బాలికలకు సత్యసాయి ట్రస్ట్ ఆర్థికసాయం అందిస్తోందని ప్రధాని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 కోట్లకుపైగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ఉన్నాయని.. వీటిలో రూ.3.25 లక్షల కోట్లకుపైగా నిధులు ఉన్నాయని చెప్పారు. ‘వారాణసీ ఎంపీగా 27 వేల మంది బాలికలకు సుకన్య సమృద్ధి యోజన కింద నిధులు జమ చేయించాను. సామాజిక భద్రత కోసం దేశంలో చాలా పథకాలను ప్రారంభించాం. వీటిపై విదేశాల్లోనూ పెద్దఎత్తున చర్చ జరుగుతోంది’ అని తెలిపారు. శ్రీసత్యసాయి ట్రస్టు వంద గిర్ జాతి గోవులను తన చేతులమీదుగా పేదవారికి అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ర్టీయ గోకుల్ మిషన్‌లో భాగంగా వారాణసీలో 480కిపైగా గిర్ జాతి ఆవులను పేదవారికి అందించామని తెలిపారు. ఇప్పుడు వెయ్యికిపైగా గిర్ ఆవులు ఆ ప్రాంతంలో తయారయ్యాయని అన్నారు. రువాండాలో 200కుపైగా గిర్ ఆవులు ఉన్నాయని.. గోదానం లాంటి సంప్రదాయం అక్కడ కూడా ఉందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు వెళ్తోందని.. ఇందులో ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. ‘వోకల్ ఫర్ లోకల్’ అనే మంత్రాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పారు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తే ఆత్మనిర్భర్ భారత్ సాధించినట్లేనని చెప్పారు. ‘సత్యసాయి ప్రేరణతో అంతా కలిసి పనిచేద్దాం. ప్రతి వ్యక్తి కరుణ, శాంతి, కర్మ విధానాలతో ముందుకెళ్లాలి’ అని ప్రధాని పిలుపిచ్చారు.

మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకూభగవాన్ మన మధ్యే: లోకేశ్
ప్రశాంతి నిలయం ప్రశాంతతకు ఆలయం. ఇక్కడకు నేను ఎప్పుడు వచ్చినా... బంగారూ అని బాబా నన్ను పిలిచినట్లు అనిపిస్తుంది. భగవాన్ సత్యసాయి చూపిన బాటలో మనమంతా నడవాలి. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకూ భగవాన్ మన మధ్యలోనే ఉంటారు. బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. భగవాన్ చెప్పినట్లు సేవే కులం.. సమానత్వమే మతం... ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు పవిత్రమైనవి. ‘అందరినీ ప్రేమించు... అందరికీ సేవ చేయి... ఎప్పటికీ సహాయం చేయి... ఎవరినీ బాధించకు..’ అని సత్యసాయి చూపిన మార్గంలో మనమంతా నడవాలి. ఖండాలు, సంస్కృతులు, విశ్వాసాలు, వయసుతో సంబంధం లేకుండా ఆయన జీవితం లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తోంది. భగవాన్ చూపిన పవిత్ర మార్గాన్ని అనుసరిస్తూ శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, శ్రీసత్యసాయి సేవా సంస్థలు సమాజానికి విశేష సేవలను అందిస్తున్నాయి. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా కీలకమైన శస్త్ర చికిత్సలు చేస్తూ, లక్షలాది మందికి పునర్జన్మనిస్తున్నారు. సత్యసాయి సంస్థలు విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా యువ హృదయాల జీవిత లక్ష్యాన్ని సాకారం చేస్తున్నాయి. ప్రభుత్వ పాలనలో వివిధ విభాగాలు, వ్యాపారం, సైన్స్, స్టార్ట్‌పలకు నేడు నైతిక మేధస్సు అవసరం. సత్యసాయి యువతకు ఇచ్చిన సందేశం ఇదే. ఆయన చెప్పినట్లుగా పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పడం నా ధ్యేయం. సత్యసాయి మనుషుల్లో దేవుడిని చూశారు.. ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు.. సేవలతో ప్రజలకు దేవుడయ్యారు.. కుల, మత, ప్రాంతీయ విభజనలు వద్దు. పేదలకు సాయం చేయాలి. సత్యం మాట్లాడాలి. ఇది భగవాన్‌కు మనం శతజయంతి సందర్భంగా ఇచ్చే ఘన నివాళి. కేంద్రం సత్యసాయి పేరుతో ప్రత్యేకంగా రూ.100 నాణేలు, తపాలా బిళ్లలు విడుదల చేస్తున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు.

భూమిపై మనం చూసిన దైవం సత్యసాయితో నాకెన్నో అనుభవాలు: చంద్రబాబు
ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ సత్యసాయిబాబా. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి ఆయన ప్రతిరూపం. లవ్ ఆల్.. సర్వ్ ఆల్... హెల్ప్ ఎవర్... హర్ట్ నెవర్ అనేది ఆయన మనకు చూపిన దారి. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో ఇవాళ ఆయన శతజయంతి వేడుకలు జరుపుకొంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దానినే ఆయన బోధించారు. ఆచరించి ఫలితం చూపించారు. ఆ భావనతో సత్యసాయి భక్తులు మానవాళికి సేవలు అందిస్తున్నారు. బాబాతో నాకు ఎన్నో అనుభవాలు. ట్రస్ట్ కార్యక్రమాలపై పలుమార్లు నాతో చర్చించారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60 వేల మందికి ఉత్తమ విద్యను అందిస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, జనరల్ ఆస్పత్రులు, మొబైల్ ఆస్పత్రుల ద్వారా రోజూ రోగులకు సేవలు అందుతున్నాయి. రాయలసీమ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రశాంతి నిలయాన్ని తాకట్టుపెట్టి అయినా ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్న గొప్ప దైవసంకల్ప బలుడు బాబా. ఈ విషయం తెలిసి భక్తులు కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారు. రూ.550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1,600 గ్రామాలు, 30 లక్షలకుపైగా జనాభాకు నీరిస్తున్నారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీంకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారు. సత్యసాయి స్ఫూర్తిని, ఆయన చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి.

సత్యసాయి భక్తులు.. విశ్వవ్యాపితం ఆయన గొప్పతనాన్ని మనకంటే విదేశీయులే బాగా చెబుతారు: పవన్
భగవాన్ సత్యసాయి బాబాకు భక్తులు విశ్వవ్యాప్తంగా ఉన్నారు. బాబా గొప్పతనం గురించి మన దేశ ప్రజలకంటే... విదేశీయులే గొప్పగా చెబుతారు. 30 ఏళ్ల క్రితం నేను సింగపూర్ వెళ్లినప్పుడు చైనీయుల ఇళ్లల్లో సత్యసాయి ఫొటోలు ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. 20 ఏళ్ల క్రితం హాలీవుడ్ నటుడు స్టీవెన్ సీగల్ బాబాను దర్శించేందుకు ఇక్కడకు రావడం నన్ను మరింత ఆశ్చర్యపరచింది. మరీ ముఖ్యంగా నా అన్నయ్య చిరంజీవి బెంగళూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి బాబాను దర్శించుకోవడం చూసి ఆశ్చర్యం వేసింది. అత్యంత వెనుకబడిన జిల్లాలో పుట్టిన భగవాన్ రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేశారు. ప్రధాని మోదీ చేపట్టిన జల్ జీవన్ మిషన్ తరహాలోనే ఆయన ఈ ప్రాంత దాహార్తి తీర్చారు. జల్ జీవన్ మిషన్‌కు అంకురమే ఆయన చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు. అప్పట్లో ఏ ప్రభుత్వాలు ఆలోచించని సమయంలోనే ఈ ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించాలని తలిచారు. ఈ పథకానికి రూ.400 కోట్లు ఇస్తానంటే అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు.. సత్యసాయి సాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. ఆయన సేవాతత్పరతకు ఎంత మంది ప్రభావితం చెందారో లెక్కలేదు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడికొచ్చి సేవ చేస్తారని మా వదిన, అన్నయ్య చెబుతుండేవారు. అలాంటి ఐఏఎ్‌సలు, ఇతర హోదాల్లో ఉన్న మేధావులతో పాటు సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తులను బాబా ప్రభావితం చేశారు. ఆయన సేవాతత్పరతను మున్ముందూ కొనసాగిస్తాం.

నన్ను బాలసత్యసాయి అనేవారు..
భగవాన్ సత్యసాయి బాబా చిన్నతనంలోనే నాకు దైవ సంబంధమైన అనుభూతినిచ్చారు. నాకు ఐదేళ్లప్పుడు ఎక్కడికెళ్లినా ఈ బాలుడు బాల సత్యసాయి బాబాలా ఉన్నాడని అందరూ అనేవారు. ఆ మాటలు అప్పట్లో వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. తర్వాత ఆయనతో ఏర్పడిన అనుబంధం ఆ మాటలకు అర్థం చూపింది. 1990లో వైట్‌ఫీల్డ్‌లో భగవాన్ దర్శనం పొందాను. మనం అడగకపోయినా... మన మనసులో ఏముందో... ఏ సందేహం ఉందో బాబా ముందుగానే చెప్పేవారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై బాబా బోధనలు నా జీవితాన్ని ప్రభావితం చేశాయి. 2011 వరల్డ్ కప్ సమయంలో ఎన్నో అంచనాలు, ఒత్తిడి ఉండేవి. బెంగళూరులో మా క్యాంప్ జరుగుతున్నప్పుడు బాబా ఫోన్ చేసి ఒక పుస్తకం పంపించానని చెప్పారు. ఆ పుస్తకం నాలో అనూహ్యమైన విశ్వాసాన్ని రగిల్చింది. ముంబైలో ఇండియా-శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్‌లో భారత జట్టు గెలిచి ట్రోఫీ అందుకోవడం నా జీవితంలో చిరస్మరణీయంగా నిలిచింది. ఇది బాబా ఆశీస్సుల వల్లే సాధ్యమైంది. ఆ విజయంతో ఆయన నాకు అంతర్గత భక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రసాదించారు. బాబా మన వెంట ఉంటే భయం అనే మాటే ఉండదు. ఆయన్ను స్మరించడమే ఒక ఆశీర్వాదం.
- సచిన్ టెండూల్కర్, క్రికెట్ లెజెండ్

కోట్ల హృదయాల్లో సత్యసాయి నిలిచే ఉన్నారు
‘భగవాన్ సత్యసాయి బాబా జన్మించి వందేళ్లు పూర్తయింది. ఆయన ప్రభావం, దివ్యస్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల హృదయాల్లో ఇంకా నిలిచే ఉన్నాయి. ఆయన ప్రేమకు, సేవకు, దయకు సరిహద్దులు లేవు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మేవారు. అది చేసి చూపించారు. ఆయన చేసిన ప్రజాసేవ, ప్రేమ, దయ, పరిపూర్ణతలు ప్రపంచానికి ఆదర్శం. భగవాన్ 5డిలు.. డిసిప్లీన్, డెడికేషన్, డివోషన్, డిటర్మినేషన్, డిస్ర్కిమినేషన్ బోధించారు. ఈ ఐదు డీలు మన జీవితానికి దిశగా, ధర్మంగా నిలుస్తాయి. ఇవే జీవితానికి పునాది అని ఎల్లప్పుడూ చెప్పేవారు. విద్య, ఆరోగ్యంలో సత్యసాయి సంస్థల సేవలు అమూల్యం. బాల వికాస్ స్కూళ్లలో నైతిక బోధనలు భవిష్యత్ తరాలకు వెలుగుచూపుతున్నాయి. పుట్టపర్తి, కోల్‌కతా, వైట్‌ఫీల్డ్, ముంబై.. నాలుగు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అంతర్జాతీయ స్థాయి వైద్యం పూర్తిగా ఉచితంగా అందించడం బాబా కరుణార్ద్ర హృదయానికి నిదర్శనం. జలసేవ, గ్రామీణాభివృద్ధి, యువత సాధికారతలో ఆయన కార్యక్రమాలు చరిత్రాత్మకం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఆయన జీవితం. బాబా ప్రేమ, సేవ, కరుణ ప్రపంచానికే ఒక వరం.
- ఐశ్యర్యారాయ్ బచ్చన్, బాలీవుడ్ నటి