Share News

Deputy CM Pawan Kalyan : ఏళ్ల తరబడి పెండింగ్‌ ఏంటి?

ABN , Publish Date - Jan 18 , 2025 | 04:21 AM

‘‘ఉద్యోగులపై విజిలెన్స్‌ కేసులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడమేంటి? ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి? వాటి వివరాలేంటి? విచారణ జాప్యానికి కారణాలేంటి?’’ అనే విషయాలపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌, అటవీ శాఖ అధికారులను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు.

Deputy CM Pawan Kalyan : ఏళ్ల తరబడి పెండింగ్‌ ఏంటి?

  • ఉద్యోగుల విజిలెన్స్‌ కేసులపై 3 వారాల్లో నివేదిక సమర్పించండి

  • పీఆర్‌, ఆర్‌డీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, అటవీ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్‌ ఆదేశాలు

అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ‘‘ఉద్యోగులపై విజిలెన్స్‌ కేసులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడమేంటి? ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి? వాటి వివరాలేంటి? విచారణ జాప్యానికి కారణాలేంటి?’’ అనే విషయాలపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌, అటవీ శాఖ అధికారులను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్‌ ఉండాలని, వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పనితీరు, నిబద్ధతకు విజిలెన్స్‌ ఒక సూక్ష్మదర్శినిలా పనిచేస్తుందన్నారు. అయితే ఉద్యోగులపై నమోదవుతున్న విజిలెన్స్‌ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు, చర్యలు సంవత్సరాల పాటు పెండింగ్‌లో ఉండడం ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపుతోందని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌, అటవీ శాఖల్లో విజిలెన్స్‌, ఏసీబీ, శాఖాపరమైన కేసుల వివరాలు, అవి ఎంత కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి, అందుకు గల కారణాలపై మూడు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. కొన్ని కేసులు 20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న విషయాన్ని అధికారులు పవన్‌ దృష్టికి తెచ్చారు.


అపరిష్కత కేసుల వల్ల అధికారులు, సిబ్బంది ఉద్యోగ విరమణ తర్వాత కూడా రిటెర్మెంట్‌ బెనిఫిట్స్‌ పొందలేకున్నారు. పదోన్నతుల్లో వెనుకబడిన అధికారులు కూడా ఉన్నారని గ్రహించారు. అభియోగాలు వచ్చిన వారిపై విచారణ ప్రారంభించినప్పుడు.. అందుకు తగిన పత్రాలు అందుబాటులో ఉండటం లేదని, ఇది విచారణ జాప్యానికి కారణం అవుతోందని అధికారులు డిప్యూటీ సీఎంకు తెలిపారు. తన శాఖల పరిధిలో విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా తీసుకునే చర్యల్లో వేగం పెంచేందుకు పవన్‌ ప్రత్యేక మార్గదర్శకాలను సూచించారు. ఏదైనా విషయంలో అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వస్తే ప్రాథమిక విచారణ పకడ్బందీగా జరపాలన్నారు. ప్రాథమిక విచారణలో బలమైన సాక్ష్యాలు సేకరించాలని.. విచారణ అధికారికి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి మధ్య సన్నిహిత సంబంధాలు లేకుండా తొలి దశలోనే నిరోధించాలని స్పష్టం చేశారు. శాఖల్లోని అన్ని విజిలెన్స్‌, నాన్‌ విజిలెన్స్‌ కేసులను సరైన రీతిలో తిరిగి విచారించి, వేగంగా పరిష్కరించేందుకు శాఖాధిపతులు దృష్టి సారించాలని ఆదేశించారు.

Updated Date - Jan 18 , 2025 | 04:22 AM