AP Deputy CM: మరి వారి మాటేంటి?
ABN , Publish Date - Jun 02 , 2025 | 05:09 AM
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శర్మిష్ఠ అరెస్టును ఖండిస్తూ, సనాతన ధర్మాన్ని అవమానించిన రాజకీయ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. లౌకికవాదం రెండు వైపులా సమానంగా ఉండాలంటూ పశ్చిమ బెంగాల్ పోలీసులకు సూచించారు.

సనాతన ధర్మాన్ని ‘కలుషిత ధర్మం’ అన్న వారిపై చర్యలు తీసుకోలేదేం?
వారి క్షమాపణలేవీ: పవన్ కల్యాణ్
శర్మిష్ఠ పనోలీ అరెస్టును ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆక్షేపించారు. లౌకికవాదం అనేది రెండు వైపులా రాకపోకలు సాగించే రోడ్డులా ఉండాలని ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ‘న్యాయవిద్యార్థిని శర్మిష్ఠ వాడిన భాష, మాటలు విచారకరం. కొందరికి మనస్తాపం కలిగించేలా ఉన్నాయి. ఆమె తన తప్పు తెలుసుకుని పోస్టును డిలీట్ చేసి.. బహిరంగ క్షమాపణ చెప్పారు. అయితే బెంగాల్ పోలీసులు వేగంగా స్పందించి ఆమెపై చర్య తీసుకున్నారు. మరి సనాతన ధర్మాన్ని అవహేళన చేసి కోట్ల మంది మనసులను టీఎంసీ ఎంపీలు, ఎన్నికైన నేతలు గాఢంగా గాయపరచినప్పుడు వారు ఏం చేశారు? మన ధర్మాన్ని కలుషిత ధర్మమని (మమతా బెనర్జీ) వ్యాఖ్యానించినప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదేం? వాళ్ల క్షమాపణలేవీ? సత్వర అరెస్టులేవీ’ అని నిలదీశారు. ‘దైవ నింద ఎల్లప్పుడూ ఖండనార్హం. అయితే లౌకికవాదం అనేది కొందరికి రక్షణ కవచంలా, ఇంకొందరిపై ఖడ్గంలా ఉండకూడదు. పశ్చిమ బెంగాల్ పోలీసులూ.. అందరి పట్లా న్యాయంగా వ్యవహరించండి’ అని సూచించారు. ఆయన పోస్టును బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి ‘ఎక్స్’లో షేర్ చేశారు.