Eluru IG Statement: అది రోడ్డు ప్రమాదమే
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:38 AM
పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదమేనని పోలీసు దర్యాప్తు స్పష్టం చేసింది. బైక్ హెడ్‌లైట్ పనిచేయకపోవడం, మద్యం సేవించి స్కిడ్ కావడం ప్రమాదానికి కారణంగా నిర్ధారణ అయ్యింది

పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల స్పష్టీకరణ
ప్రమాద సమయంలో పనిచేయని బుల్లెట్ హెడ్‌లైట్..
హైవే పక్కన కంకరపైకి వెళ్లడంతో స్కిడ్ అయిన బైకు
ఆయనపై పడిన బుల్లెట్
ఏ వాహనమూ ఢీ కొట్టలేదు
100 మందిని విచారించాం
400 సీసీ ఫుటేజీల పరిశీలన
దర్యాప్తుపై ప్రవీణ్ కుటుంబ సభ్యులకు నమ్మకం
ఏలూరు ఐజీ అశోక్ వెల్లడి
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): పాస్టర్ ప్రవీణ్ మృతికి రోడ్డు ప్రమాదమే కారణమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో ఆయన వెళ్తున్న బుల్లెట్ హెడ్‌లైట్ పనిచేయలేదని, గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పోతున్నారని అంచనా వేశామని తెలిపారు. రాజమహేంద్రవరం సమీపంలో హైవే పక్కన కంకరపైకి బండి వేగంగా వెళ్లడంతో స్కిడ్ అయి అర్ధ చంద్రాకారంలో రోడ్డు కిందకు జారి వర్షపు నీటి డ్రెయిన్‌లో పడిపోయారని ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారని వెల్లడించారు. అక్కడున్న రాయి ప్రవీణ్ ముఖానికి బలంగా తగలడంతో గాయమైందని, కిందకు పడిపోయిన క్రమంలో ఆయనపై బుల్లెట్ పడిందని నివేదిక ఇచ్చారని తెలిపారు. ఏ వాహనం కూడా ఢీకొనలేదని వివరించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో దర్యాప్తు వివరాలను వెల్లడించారు. గతనెల 24న ప్రవీణ్ హైదరాబాద్‌లో బయల్దేరినప్పటి నుంచి రాజమహేంద్రవరం సమీపంలో మృతి చెందిన ఘటన వరకు ముఖ్యమైన సీసీ ఫుటేజీలను ప్రదర్శించి వివరించారు.
దారిలో ఏం జరిగిందంటే...
‘మార్చి 24 ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ప్రవీణ్ (46) బయలుదేరారు. మార్గమధ్యంలో నాలుగుసార్లు మద్యం కొనుగోలు చేశారు. పెట్రోలు బంకులతో కలిపి ఆరు చోట్ల యూపీఐ ద్వారానే డబ్బులు చెల్లించారు. చిల్లకల్లులోని వెంకటసాయి ఫుడ్ ప్లాజా ఎదురుగా హైవేపై ఒకసారి, కీసర టోల్ గేటుకు 500 మీటర్ల దూరంలో మరోసారి, రామవరప్పాడు రింగ్‌రోడ్ వద్ద మూడోసారి కింద పడిపోయారు. ఈ మూడు ప్రమాదాల్లో ఆయనకు రాపిడి గాయాలయ్యాయి. బైక్ హెడ్‌లైట్ పగిలిపోయింది. రామవరప్పాడు రింగ్ వద్ద పడిపోయిన సమయంలో ఆటో డ్రైవరు చూసి పోలీసులకు చెప్పారు. పోలీసుల సూచనతో పక్కన పార్కులో సుమారు 2గంటలు విశ్రాంతి తీసుకున్నారు. పోలీసులకు తెలియకుండా మళ్లీ బుల్లెట్‌పై బయలుదేరారు. నయారా పెట్రోలు బంకు సమీపంలో రోడ్డు పక్కన ఏడు అడుగుల దిగువున ఉన్న ఎండిపోయిన వర్షపు నీటి డ్రెయిన్‌లో పడిపోయి మృతిచెందారు. ప్రమాదం 24న రాత్రి 11.42 గంటలకు జరిగింది. ప్రవీణ్ వాహనం వెంబడి వెళ్లిన వాహనాలను పరిశీలించాం. ఈ కేసులో సుమారు 100 మందిని విచారించాం. 400సీసీ ఫుటేజీలను పరిశీలించాం. దూరం నుంచి వస్తుండడం, హెడ్‌లైట్ లేకుండా కుడి వైపున సిగ్నల్ లైట్‌తో అజాగ్రత్తగా ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగింది’ అని ఐజీ వివరించారు.
ఇక్కడితో కేసు ముగిస్తున్నాం
‘ప్రవీణ్ బావ శామ్యూల్ వాలెస్ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. కేసు తీవ్రత దృష్ట్యా అనుభవం గల అధికారులతో సిట్ వేసి 14 రోజుల్లో వేగంగా దర్యాప్తు చేశాం. ప్రవీణ్ కుటుంబ పరువును కాపాడాల్సిన బాధ్యత సమాజంపై కూడా ఉంది. అందువల్ల కొన్ని విషయాలు వెల్లడించలేం. వదంతులు వ్యాప్తిచేసిన 11 మందిపై కేసులు పెట్టి ఒకరిని అరెస్టు కూడా చేశాం. ఈ కేసు దర్యాప్తును ఇక్కడితో ముగిస్తున్నాం. అనుమానాలపై ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే అందజేసి సహకరించాలని కోరాం. గురువారం వరకు గడువు ఇచ్చినా ఎవరూ ఇవ్వలేదు’ అని ఐజీ తెలిపారు.
హత్య కోణంలోనూ దర్యాప్తు చేశాం
‘ప్రవీణ్‌ను హత్య చేశారని, మృతదేహాన్ని తీసుకొచ్చి పడేశారని అనుమానాలు వ్యక్తం చేసిన వారెవరూ తగిన ఆధారాలు సమర్పించలేదు. ఆ కోణంలోనూ దర్యాప్తు చేశాం. దర్యాప్తుపై ప్రవీణ్ భార్య సహా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయలేదు. పోలీసులపై వారికి విశ్వాసం ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైనా ఊహాగానాలు, వదంతులు వ్యాప్తి చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు’ అని ఐజీ హెచ్చరించారు.
రూ. 2,842 మద్యం కొనుగోలు
‘పాస్టర్ ప్రవీణ్ మార్గమధ్యంలో నాలుగుసార్లు ఆగి మొత్తం రూ.2,842 విలువ చేసే మద్యం కొనుగోలు చేశారు. 24న మధ్యాహ్నం 12.24 గంటలకు హైదరాబాద్ సిటీలోని సవేరా లిక్కర్ మార్ట్‌లో రూ.950 మద్యం కొన్నారు. మధ్యాహ్నం 3.02కు కోదాడలోని శ్రీఆదిత్య వైన్స్‌లో రూ.670, సాయంత్రం 4.56కు విజయవాడ దగ్గర రూ.872, రాత్రి 10.12 గంటలకు ఏలూరులోని నిపన్స్ టానిక్ వైన్స్‌లో రూ.350మద్యం కొన్నారు’ అని తెలిపారు.
బుల్లెట్‌పై ఎందుకు వచ్చారంటే..
‘రాజమహేంద్రవరం రూరల్‌లోని నామవరంలో బైబిల్ కాలేజీ నిర్మాణానికి ప్రవీణ్ 510 గజాల స్థలం కొనుగోలు చేశారు. నిర్మాణ పనుల నిమిత్తం లాలాచెరువులోని ఒక గదిని కూడా అద్దెకు తీసుకున్నారు. కాలేజీ నిర్మాణ అవసరాలకు బుల్లెట్‌ని రాజమహేంద్రవరంలో ఉంచడానికి ఆయన హైదరాబాద్ నుంచి దానిపై బయల్దేరారు’ అని ఐజీ చెప్పారు.