P4 Initiative: పీ-4 తొలి అడుగు పడింది
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:23 AM
ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన పీ-4 పథకం ఆచరణలోకి వచ్చింది. 41 బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు ఆటోలు, కుట్టు మిషన్లు, ఉద్యోగాలు, ఇంటి స్థలాలు అందజేశారు

బంగారు కుటుంబాలకు మార్గదర్శకుల ‘మెరుగు’
కోరుకున్న విధంగా ఉపాధి అవకాశాల కల్పన
పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కలెక్టర్ లక్ష్మీశ
చందర్లపాడు, ఏప్రిల్ 29: మహనీయుడు జగ్జీవన్‌రామ్ జయంతి ఏప్రిల్ 5న ఆయనకు నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు ప్రారంభించిన పీ-4 పథకం ఆచరణ దిశగా తొలి అడుగులు వేసింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలోని 41 బంగారు కుటుంబాలను మార్గదర్శకులకు(పారిశ్రామిక వేత్తలు) నాడు ముఖ్యమంత్రి అప్పగించారు. దేశానికే స్ఫూర్తినిచ్చేలా రూపొందించిన ఈ పథకం ప్రారంభించిన 20 రోజుల్లోనే మార్గదర్శకులు కార్యాచరణలోకి దిగారు. సోమవారం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జిల్లా కలెక్టర్ లక్ష్మీశల సమక్షంలో ఈ పథకానికి పారిశ్రామిక వేత్తలు శ్రీకారం చుట్టారు. పథకం ప్రారంభం రోజు సీఎం చంద్రబాబు సందర్శించిన ఇంటికి వెళ్లిన కలెక్టర్, ఎమ్మెల్యే ఆ కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు. ప్రారంభ సభలో వారు సీఎంని కోరిన విధంగా ఆటో, కుట్టుమిషన్, ఇంటి స్థలం ఇస్తున్నామని, త్వరలో ఇల్లు కూడా కట్టిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సాయంతో బంగారు కుటుంబాలుగా ఉన్న మీరు ఎదిగి మార్గదర్శులుగా తయారు కావాలని వారు ఆకాంక్షించారు.
సీఎం కలను సాకారం చేసే దిశగా...
ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించిన ఇంటి యజమాని వెంకట్రావమ్మ కుటుంబాన్ని దత్తత తీసుకున్న మార్గదర్శి ‘సెంథినీ బయోటెక్’ పరిశ్రమ ఆటో రిక్షా అందజేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన మూడు సెంట్ల ఇంటి స్థలం పత్రాన్ని, స్థానిక పారిశ్రామిక వేత్త చందోలు భానుమూర్తి అందించిన కుట్టు మిషన్‌ను వెంకట్రావమ్మకు అందజేశారు. అలాగే నాగరత్నం కుటుంబాన్ని దత్తత తీసుకున్న మార్గదర్శి ‘క్రక్స్ బయోటెక్’ పరిశ్రమ వారికి ఆటోను అందజేసింది. పారిశ్రామిక వేత్త చందోలు భానుమూర్తి కట్టు మిషన్ అంద జేశారు. కాగా, లక్ష్యయ్య, రమాదేవి దంపతులను దత్తత తీసుకున్న ‘అంబా కోచ్’ పరిశ్రమ ఇరువురికీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. పరిశ్రమ అధినేత అనూరాధ మాట్లాడుతూ, ‘మా పరిశ్రమ ద్వారా ఈ కుటుంబాన్ని అత్యున్నత శిఖరాలకు చేరుస్తాం. చంద్రబాబు ఆశించిన పేదరిక రహిత సమాజం కోసం పాటుపడతాం’ అని చెప్పారు. మరో నాలుగు బంగారు కుటుంబాలకు చందోలు భానుమూర్తి కుట్టు మిషన్లు అందజేశారు. కొన్ని కుటుంబాలకు అవసరమైన మందులు పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి
AP Govt: ‘వేస్ట్ మేనేజ్‌మెంట్’పై కీలక ఒప్పందం
Gorantla Madhav: ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకొంటున్న ప్రజలు
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
For More AP News and Telugu News