Share News

Visakhapatnam Mayor Defeated: విశాఖ నగరిపై కూటమి జెండా

ABN , Publish Date - Apr 20 , 2025 | 05:25 AM

విశాఖపట్నం మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయం సాధించింది. 74 మంది మద్దతుతో తీర్మానం నెగ్గినట్లు కలెక్టర్‌ ప్రకటించారు

Visakhapatnam Mayor Defeated: విశాఖ నగరిపై కూటమి జెండా

  • మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

  • తీర్మానానికి 74 మంది మద్దతు

  • సమావేశాన్ని బహిష్కరించిన వైసీపీ

  • 26న డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం!

విశాఖపట్నం, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ అధ్యక్షతన శనివారం జరిగిన కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 63 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు(ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ) మొత్తం 74 మంది సభ్యులు హాజరయ్యారు. వైసీపీకి చెందిన 31 మంది కార్పొరేటర్లు, సీపీఐ, సీపీఎంలకు చెందిన ఒక్కొక్క కార్పొరేటర్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. సమావేశం నిర్వహించేందుకు అవసరమైన కోరం ఉండడంతో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపేవారు చేతులు ఎత్తాలని కోరగా 63 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు చేతులు ఎత్తారు. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించేవారు చేతులు ఎత్తాలని కలెక్టర్‌ కోరగా ఎవరూ స్పందించలేదు. దీంతో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు కలెక్టర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మేయర్‌ పీఠం కూటమి పరంకానుంది. కాగా, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం కోసం ఈనెల 26న కౌన్సిల్‌ సమావేశం జరగనుంది.

Updated Date - Apr 20 , 2025 | 05:27 AM