Share News

Nirmala Sitharaman: మన దేశం అభివృద్ధి చెందాలంటే ఇలా చేయాలి..

ABN , Publish Date - Mar 06 , 2025 | 06:53 PM

విభజన సమయంలో హామీ ఇచ్చినట్లుగానే పోలవరం పూర్తి చేసి తీరతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విశాఖలో కేంద్ర బడ్జెట్‌పై పోస్ట్ బడ్జెట్ చర్చలో పాల్గొన్న ఆమె పలు కీలక విషయాలు తెలిపారు.

Nirmala Sitharaman: మన దేశం అభివృద్ధి చెందాలంటే ఇలా చేయాలి..
Nirmala Sitharaman

విశాఖపట్నం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వివిధ వ్యాపార వర్గాలు కేంద్ర బడ్జెట్‌పై పోస్ట్ బడ్జెట్ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నామన్నారు. మొదట ముంబాయిలో రెండో చర్చ విశాఖలో నిర్వహించామన్నారు. విశాఖలో బడ్జెట్‌పై వివిధ వర్గాల ప్రజలను కలసి వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంగా కాకుండా తమ బాధ్యతగా సహకారం అందిస్తున్నామన్నారు.


పోలవరం పూర్తి చేస్తాం

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎక్కువ మొత్తం కేటాయించినట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను పునరాభివృద్ది చేయడానికి 11 వేల కోట్లు సహకారం అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి రాజధానికి కూడా సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు లోటు లేకుండా కేటాయింపులు చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక సమస్యల వలన పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందని కామెంట్స్ చేశారు. విభజన సమయంలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చామని, ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రూ. 12 లక్షల వరకు టాక్స్ కట్టే అవకాశం లేకుండా వెసులుబాటు ఇచ్చామన్నారు. సర్వీస్ సెక్టార్‌లో నిర్దిష్టమైన ఆదాయం వస్తుందని, ఇతర దేశాలు తరహాలో మన దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆదాయ వనరులు పెంచుకోవాలని సూచించారు.

నీటి కష్టాలు నాకు తెలుసు..

ఈ క్రమంలోనే తాను పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో నివసించి అక్కడ నీటి కష్టాలు అనుభవించినట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా నేరుగా ఇంటికి మంచినీరు ఇచ్చే బృహత్తర ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. ఆత్మ నిర్బర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వినాయక చవితికి విగ్రహం తయారుచేసే మట్టిని కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేదన్నారు.

సుంకాలు పెరిగే అవకాశం

విశాఖకు సమీపంలో ఫార్మా రంగం అభివృద్దికి బల్క్ డ్రాగ్ పరిశ్రమలు విస్తృత పరిచామన్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడు నిర్ణయంతో సుంకాలు పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్లి అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. అమెరికా సుంకాల పెంపు ప్రభావం మన దేశ ఆర్థిక స్థితిపై పడుతుందని వివరించారు. నూతన పద్ధతుల ద్వారా ఆదాయ పన్ను చెల్లింపు విధానం అనేది పన్ను చెల్లింపుదారులకు సులభతరమైన మార్గంగా చేయడం జరిగిందన్నారు. 9 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేస్తే, మూడు కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని తెలిపారు. కొత్త పన్ను వెసులుబాటు ద్వారా ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Janasena: పవన్‌పై జగన్ సెన్సేషనల్ కామెంట్స్.. జనసైనికులు ఎలా రియాక్ట్ అయ్యారంటే..

Posani Krishna Murali: పోసానికి ఓ కేసులో షాక్.. రెండు కేసుల్లో ఊరట

Updated Date - Mar 06 , 2025 | 07:21 PM